Take a fresh look at your lifestyle.

జగిత్యాల డబుల్ బెడ్ రూమ్ కాలనీలో నీటి వసూళ్ల పర్వం… నీళ్లు కావాలంటే రూ.3500 చెల్లించాలి… ప్రజావాణిలో బాధితుల ఫిర్యాదు

 

ముద్ర ప్రతినిధి, జగిత్యాల:

నిరుపేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు ప్రభుత్వం నిర్మించిన జగిత్యాల అర్బన్ డబుల్ బెడ్ రూమ్ కాలనీలో ప్రస్తుతం ‘నీటి’ మాఫియా రాజ్యమేలుతోంది. ఇక్కడ నివాసముంటున్న పేద ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకుని కొందరు వ్యక్తులు యథేచ్ఛగా అక్రమ వసూళ్లకు పాల్పడుతుండటం కలకలం రేపుతోంది. జగిత్యాల కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో అర్బన్ కాలనీకి చెందిన మహిళలు భారీ సంఖ్యలో తరలివచ్చి, అదనపు కలెక్టర్ బి. రాజా గౌడ్ కు తమ కష్టాలను ఏకరువు పెట్టారు. కాలనీలో నీటి సరఫరాను పర్యవేక్షించే అయూబ్ ఖాన్ అనే వ్యక్తి ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని బాధితులు ఆరోపించారు. “నీళ్లు రావాలంటే 3,500 రూపాయలు మామూళ్లు ఇచ్చుకోవాల్సిందే” అంటూ సదరు వ్యక్తి బహిరంగంగానే హుకుం జారీ చేస్తున్నాడని, నిరుపేద కుటుంబాల దగ్గర ఈ స్థాయిలో డబ్బులు వసూలు చేయడం దారుణమని వారు అదనపు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. లంచం ఇవ్వని ఇళ్లకు నీటి సరఫరా నిలిపివేస్తూ, పైపులైన్ రిపేర్ల పేరుతో అక్రమ దందాను సాగిస్తున్న సదరు వ్యక్తిని వెంటనే విధుల నుండి తొలగించాలని మహిళలు డిమాండ్ చేశారు. కాలనీలో కనీస పారిశుధ్యం కరువైందని, మురుగు నీరు రోడ్లపై నిలిచి నరకప్రాయంగా మారిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని బాధితులు హెచ్చరించారు. ఈ మొత్తం వ్యవహారంపై స్పందించిన అదనపు కలెక్టర్ బి. రాజా గౌడ్ నీటి సరఫరాలో జరుగుతున్న అవకతవకలపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలని మున్సిపాలిటీ అధికారులను ఆదేశించారు.

పురుగుల మందు డబ్బాతో ప్రజావాణి కి వచ్చిన దంపతులు…

తమకు న్యాయం చేయాలని, లేదంటే ఇక్కడే పురుగుల మందు తాగి చస్తాతామంటూ జగిత్యాల కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి పురుగుల మందు డబ్బాతో దంపతులు రావడం కలకలం రేపింది. జగిత్యాల రూరల్ మండలం గుట్రాజుపల్లికి చెందిన పయ్యావుల రమేష్ దంపతులు తమ పొలానికి వెళ్లే దారిని కొందరు అడ్డుకుంటున్నారని ప్రజావాణిలో అదనపు కలెక్టర్ రాజాగౌడ్ తో ఆవేదన వ్యక్తం చేశారు. గత మూడేళ్లుగా తమను ఇబ్బంది పెడుతున్నారని, తహసిల్దార్, సర్వేయర్ వచ్చి హద్దులు పెట్టిన తమను వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంఘటనపై స్పందించిన అదనపు కలెక్టర్ తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

Leave A Reply

Your email address will not be published.