Take a fresh look at your lifestyle.

ప్రాణహిత – చేవెళ్ల ప్రాజెక్టును నిర్మిస్తాం సీఎం రేవంత్ రెడ్డి

 
బోథ్, ముద్ర:

తుమ్మిడి హెట్టి వద్ద ప్రాణహిత – చేవెళ్ల ప్రాజెక్టును తిరిగి నిర్మించి ఆదిలాబాద్ జిల్లాకు సాగునీరు, తాగునీటిని అందించి జిల్లాను సస్య శ్యామలం చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రజా పాలన – ప్రగతి బాట కార్యక్రమంలో భాగంగా సోమవారం ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గంలోని బజార్ హత్నూర్ మండలం పిప్పిరి గ్రామంలో జరిగిన బహిరంగ సభకు ఆయన డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తో కలిసి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాణహిత చేవెళ్లను తుమ్మిడి హెట్టి వద్ద మొదలు పెట్టి కొడంగల్, తాండూర్, వికారాబాద్ వరకు గోదావరి జలాలను 160 టీ ఎం సి లను తరలించాలని ప్రాజెక్ట్ కడితే ప్రాణహిత పేరు, ఊరు అంచనాలు మారాయని లక్ష కోట్లు గోదావరిలో పోసినట్లయిందని కాళేశ్వరం కడితే కుళేశ్వరం గా మారిందని ఎద్దేవా చేశారు.

తుమ్మిడి హెట్టి వద్ద ప్రాణహిత చేవెళ్లను నిర్మించే దిశగా సాగునీటి మంత్రి సర్వేలు చేస్తున్నారని అంచనాలు సిద్ధం చేస్తున్నారని త్వరలో ప్రాజెక్టు పనులను తుమ్మిడి హెట్టి వద్ద ప్రారంభిస్తామని అన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో ఎర్రబస్ తిరగడమే కష్టంమని అలాంటిది ఆదిలాబాద్ లో ఎయిర్ పోర్టు ను నిర్మించాలని స్థానిక ఎంపీ నగేష్, ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల శంకర్, బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ల తో పాటు ఈ ప్రాంత నాయకుల విజ్ఞప్తి మేరకు తాము కేంద్ర ప్రభుత్వ పెద్దలతో మాట్లాడినమనీ జూన్ 2 వ తేదీలోపల ఆదిలాబాద్ లో ఎయిర్ పోర్ట్ నిర్మాణానికి శంకు స్థాపన చేస్తామని అన్నారు. ఆదిలాబాద్ ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంతో పాటు దేశంలోనే అతి పెద్ద పారిశ్రామిక ప్రాంతంగా మార్చి ఈ ప్రాంత ఆదివాసీ గిరిజన చదువుకున్న బిడ్డలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. త్వరలోనే ఆదిలాబాద్ జిల్లా లో యూనివర్సిటీనీ ఏర్పాటు చేస్తామని అన్నారు. మహిళలకు ఉచిత బస్ ప్రయాణమే కాకుండా వారిని బస్ లకు యజమానులుగా మార్చమని అన్నారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ జల్ జంగిల్ జమీన్ నినాదంతో పోరాట స్ఫూర్తిని చాటిన కొమురం భీం గడ్డ ఇది అన్నారు. ఆదిలాబాద్ జిల్లాను అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తామని అన్నారు. ఎన్నికలప్పుడే రాజకీయాలని అభివృద్ధి విషయంలో అందరిని కలుపుకొని ముందుకు వెళ్తామని ఇక్కడ మా ఎమ్మెల్యే లు లేకపోయినప్పటికీ ఈ ప్రాంత ప్రజలు నష్టపోకూడదనే ఉద్దేశంతో బోథ్ నియోజకవర్గంలో రూ.200 కోట్లతో యంగ్ ఇండియా సమీకృత గురుకుల పాఠశాలను నిర్మిస్తున్నామని, ధన్నూర్, కుప్టి, కుచులపూర్ లలో 33/11 కేవీ విద్యుత్ ఉప కేంద్రాలను ఏర్పాటుకు శంకు స్థాపన చేసినట్లు తెలిపారు. పిప్పిరి, తేజాపూర్ లలో ఎత్తిపోతల పథకాలకు శ్రీకారం చుట్టామని అన్నారు. రూ.20 కోట్లతో ఆదిలాబాద్ నియోజకవర్గంలో మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాల, జూనియర్ కళాశాల, జైనథ్ లో మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల పాఠశాల లను ప్రారంభించామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి మానవీయ కోణంలో ఆలోచించి అంతరాలు లేని సమాజాన్ని నిర్మించాలన్నా ఆలోచనతో మన బిడ్డలు ప్రపంచంతో పోటీపడేలా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ను ఏర్పాటు చేస్తున్నామని దేశంలో ఏ రాష్ట్రంలో ఈ తరహా పాఠశాలలు లేవని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పుట్టడం అదృష్టం అని భావించేలా పాలన సాగుతుందని, ప్రజల ఎజెండానే తమ ఎజెండా అని అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేర్చుతామని, ప్రతి పైసా రాష్ట్ర అభివృద్ధికి ఖర్చు చేస్తామని అన్నారు. రాష్ట్రంలో ఏ ఒక్క బిడ్డ కూడా కాలే కడుపుతో బడికి వెళ్లవద్దని భావించి బడికి రాగానే అల్పాహారంతో పాటు రాగి జావా ఇస్తున్నామని అన్నారు. దశాబ్దాలుగా ఈ ప్రాంత విద్యార్థి లోకం కోరుతున్న యూనివర్సిటీ నీ ఆదిలాబాద్ జిల్లాలో ఏర్పాటు చేస్తామని అన్నారు. జిల్లాలో ఆదివాసీల కోసం 25 వేలు అదనపు ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేశామని అన్నారు. బోథ్ రెవెన్యూ డివిజన్ ఏర్పాటు అక్షాంక్షను గుర్తించామని త్వరలోనే ఏర్పాటు చేస్తామని అన్నారు. సీఎం సభ కు ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలనుండి భారీ సంఖ్యలో ప్రజలు తరలి వచ్చారు.

Leave A Reply

Your email address will not be published.