- అనిల్ హత్యలో అయిదుగురు అరెస్ట్, మరో ఇద్దరు పరారీలో.
- వివరాలు వెల్లడించిన మెదక్ ఎస్పీ డి.వి. శ్రీనివాస్ రావు.
ముద్ర ప్రతినిధి, మెదక్: సంచలనం సృష్టించిన మెదక్ జిల్లా కుల్చారం పిఎస్ పరిధిలో వరిగుంతం సబ్ స్టేషన్ వద్ద జరిగిన కాల్పుల కేసు మిస్టరీ వీడింది. వ్యక్తిగత శతృత్వం, భూ తగాదాలే మారెల్లి అనిల్ (29) హత్యకు దారితీసింది. సోమవారం సాయంత్రం మెదక్ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ డి.వి. శ్రీనివాస్ రావు వివరాలు వెల్లడించారు. గత సోమవారం రాత్రి పైతర గ్రామానికి చెందిన కాంగ్రెస్ ఎస్సి సెల్ జిల్లా కార్యదర్శి మారెల్లి అనిల్ (29)ను గన్ తో కాల్చి చంపిన విషయం తెలిసిందే. హత్యకు పూర్తి సహకారం అందించింది నర్సాపూర్ నియోజకవర్గం కుల్చారం మండలం పైతరకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు సోమన్నగారి రవీందర్ రెడ్డి. ఆయన మద్దతుతో అయనతో పాటు మరో ఆరుగురు ఉన్నారు. రవీందర్ రెడ్డితో పాటు రంగంపేటకు చెందిన పాడెపు నాగరాజు, అతని తమ్ముడు పాడెపు నాగభూషణం, ఎం.డి. ఫరీద్, టేక్మాల్ కు చెందిన తలారి అశోక్ లను అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపుతున్నట్లు వెల్లడించారు. వీరి వద్ద నుండి. 32 ఎంఎం పిస్తల్, 2 కార్లు, ఒక స్క్రాప్ కారు, 4 బుల్లెట్ రౌండ్స్, 5 మొబైల్ ఫోనలు స్వాధీనం చేసుకున్నారు. మరో ఇద్దరు నిందితులు విజయవాడకు చెందిన గ్యారేజ్ కార్మికుడు శాబుద్దీన్, అతని స్నేహితుడు చిన్న పరారీలో ఉన్నారు. ఈ కేసును ఎస్పీ డి.వి శ్రీనివాస్ రావు ఆధ్వర్యంలో ఏఎస్పీ మహేందర్, డిఎస్పీలు ప్రసన్న కుమార్, నరేందర్ గౌడ్, ఐదుగురు సిఐలు, ఏడుగురు ఎస్ఐలు ఏడు బృందాలుగా ఏర్పడి నిందితులను పట్టుకున్నారు. పోలీసు అధికారులు, సిబ్బందిని ఎస్పీ అభినందనలు తెలిపారు. రివార్డు ప్రకటించనున్నట్లు పేర్కొన్నారు.
