రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్..
ముద్ర న్యూస్ ( ధర్మపురి) :
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో విశిష్ట స్థానాన్ని సంపాదించిన స్వర్గీయ శ్రీపాద రావు సేవలు ఎన్నటికీ మరువలేనివని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురిలో నిర్వహించిన స్వర్గీయ శ్రీపాదరావు 27వ వర్ధంతి కార్యక్రమంలో ఆయన పాల్గొని ఘన నివాళులు అర్పించారు. స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో శ్రీపాదరావు చిత్రపటానికి పూలమాల వేసి మంత్రి శ్రద్ధాంజలి ఘటించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మారుమూల మంథని ప్రాంతంలోని ధన్వాడ గ్రామంలో జన్మించిన శ్రీపాద రావు సాధారణ కుటుంబం నుంచి రాజకీయాల్లోకి ఎదిగి ప్రజలకు సేవ చేసిన మహానేత అని కొనియాడారు. గ్రామస్థాయి రాజకీయాల నుంచి తన ప్రయాణాన్ని ప్రారంభించి ధన్వాడ సర్పంచ్‌గా, మంథని సమితి అధ్యక్షుడిగా, అనంతరం మంథని ఎమ్మెల్యేగా ప్రజలకు విశేష సేవలు అందించారని గుర్తుచేశారు.
అంతేకాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ స్పీకర్‌గా బాధ్యతలు నిర్వహించిన సమయంలో సభా పరిపాలనలో తనదైన ముద్ర వేసి, ఆ పదవికి గౌరవం తీసుకొచ్చిన నాయకుడు శ్రీపాదరావు అని మంత్రి పేర్కొన్నారు. ఆయన నాయకత్వంలో శాసనసభ చర్చలు శాంతియుతంగా, సమర్థవంతంగా సాగేవని తెలిపారు.

శ్రీపాదరావు వ్యక్తిత్వం గురించి మాట్లాడుతూ చిన్నా పెద్ద తేడా లేకుండా అందరితో కలిసిమెలిసి ఉండే స్వభావం ఆయన ప్రత్యేకత అని అన్నారు. రాజకీయ విభేదాలు ఉన్నా వ్యక్తిగతంగా ఎవరికీ విరోధం లేకుండా జీవించిన అజాతశత్రువుగా ఆయనకు మంచి పేరు వచ్చిందని మంత్రి అభిప్రాయపడ్డారు. ప్రజలతో సన్నిహితంగా మెలిగి, వారి సమస్యలను అర్థం చేసుకుని పరిష్కరించేందుకు ఎల్లప్పుడూ కృషి చేసిన నేతగా ఆయన గుర్తుండిపోతారని చెప్పారు.
ఇదే సందర్భంలో ఆయన కుమారుడు, ప్రస్తుత మంత్రి శ్రీధర్ బాబు తన తండ్రి ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ రాజకీయాల్లో రాణిస్తున్నారని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు. తండ్రికి తగ్గ తనయుడిగా ప్రజల విశ్వాసాన్ని సంపాదించుకున్నారని ప్రశంసించారు.
శ్రీపాదరావు వర్ధంతి సందర్భంగా ధర్మపురి ప్రజల తరఫున ఆయనకు ఘన నివాళులు అర్పిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సంగనభట్ల దినేష్, ధర్మపురి మున్సిపల్ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమం భావోద్వేగ వాతావరణంలో ముగిసింది.