Take a fresh look at your lifestyle.

చివరి గింజ వరకు ధాన్యం మద్దతు ధరకు కొనుగోలు చేస్తాం

  • తెలంగాణ రెవెన్యూ శాఖా మంత్రి పొంగులేటి.
  • నాయకన్ గూడెంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం.

ముద్ర, పాలేరు : రైతులు పండించిన ధాన్యాన్ని చివరి గింజ వరకు మద్దతు ధరకు రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌర సంబంధాల శాఖా మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి స్పష్టం చేశారు.గురువారం ఆయన కూసుమంచి మండలం లోని నాయకన్ గూడెంలో గంగమ్మ తల్లిని దర్శించుకొని ఆ గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ ఇందిరమ్మ రాజ్యంలో రైతుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత కల్పించామని, రైతును రాజు చేయడమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం పని చేస్తుందని చెప్పారు. గడిచిన సంవత్సర కాలంలో 25. 65 లక్షల మంది రైతన్నలకు రూ. 20,687 కోట్లతో 2 లక్షల రూపాయల వరకు రుణ మాఫీ పూర్తి చేసామన్నారు.గత ప్రభుత్వం పెండింగ్లో పెట్టిన రైతు బంధు నిధులను కూడా ప్రజా ప్రభుత్వం విడుదల చేసిందన్నారు. రైతు భరోసా పెండింగ్ నిధులను త్వరలో రైతుల ఖాతాలలో జమ చేస్తామన్నారు.దేశ చరిత్రలో మద్దతు ధరతో పాటు క్వింటాల్ కు 500 రూపాయల బోనస్ చెల్లిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని చెప్పారు. గత వానా కాలం పంటకు దాదాపు 1700 కోట్ల రూపాయలు బోనస్ అందించామన్నారు. యాసంగిలో కూడా సన్న రకం ధాన్యానికి బోనస్ చెల్లించి చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు.ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల దగ్గర నుండి పంట కొనుగోలు చేస్తామని, రైతులు ఎవరు ఆందోళనకు గురి కావద్దన్నారు. గత వానా కాలం పంట సమయంలో రికార్డు స్థాయిలో వరి పంట పండిందని, దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో పండని విధంగా వానా కాలం, యాసంగి ధాన్యం మన రాష్ట్రంలో పండుతుందని తెలిపారు.గత ప్రభుత్వాలు వరి పంటపై నియంత్రణ పెట్టాయని, కానీ, ప్రజా ప్రభుత్వంలో ఆ నియంత్రణేమీ పెట్టకుండా రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసి విదేశాలకు ఎగుమతి చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస్ రెడ్డి, డిఆర్డీవో సన్యాసయ్య, జిల్లా పౌర సరఫరాల అధికారి చందన్ కుమార్, పౌర సరఫరాల జిల్లా మేనేజర్ జి. శ్రీలత, ఖమ్మం ఆర్డీఓ నరసింహారావు, అడిషనల్ డిఆర్డీవో నూరొద్దీన్, తహసీల్దార్ కరుణశ్రీ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.