- హైదరాబాద్‌లో ఏఐ ఆధారిత అత్యాధునిక డేటా సెంటర్
- రూ. 3500 కోట్ల పెట్టుబడులకు ఒప్పందం
- సింగపూర్ వాణిజ్య, పర్యావరణ శాఖ మంత్రి గ్రేస్ పూ హైయిన్ తో సీఎం రేవంత్ బృందం భేటీ
- తెలంగాణ అభివృద్ధిలో సింగపూర్ భాగస్వామ్యంపై చర్చలు
ముద్ర, తెలంగాణ బ్యూరో :సింగపూర్ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి బృందం అక్కడి ప్రభుత్వంతో మరో కీలక ఒప్పందం చేసుకున్నది. అక్కడి ఎస్టీ టెలీ మీడియా గ్లోబల్ డాటా సెంటర్స్ (ఎస్టీటీ) ఇండియాతో రాష్ట్ర బృందం చేసిన చర్చలు ఫలించగా..హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో రూ. 3,500 కోట్ల పెట్టుబడులకు ఆ సంస్థ ముందుకు వచ్చింది. ముచ్చర్ల – మీర్ఖాన్‌పేటలో అత్యాధునిక ఏఐ ఆధారిత డేటా సెంటర్ క్యాంపస్‌ను స్థాపించేందుకు ఈ కంపెనీ రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ అవగాహన ఒప్పందంపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ త్వరలోనే డేటా సెంటర్లకు రాజధానిగా అవతరిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పెట్టుబడుల నిర్ణయం తీసుకున్నందుకు ఎస్టీటీ గ్లోబల్ కంపెనీ ప్రతినిధులను అభినందించారు. మరోవైపు తెలంగాణతో కలిసి పని చేయటం గౌరవంగా ఉందని ఎస్టీటీ మీడియా గ్లోబల్ డేటా సెంటర్స్ ప్రెసిడెంట్, గ్రూప్ సీఈవో బ్రూనో లోపెజ్ అన్నారు.
మౌలిక సదుపాయాలతో పాటు తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రగతిశీల విధానాలు సాంకేతిక ఆవిష్కరణలను ప్రోత్సహకంగా ఉన్నాయన్నారు. ప్రభుత్వం అందించే సహకారంతో ఆర్థిక వృద్ధితో పాటు ఉపాధి కల్పన, స్థిరమైన డిజిటల్ భవిష్యత్తు నిర్మించాలనే ఉమ్మడి లక్ష్యం నెరవేరుతుందని అన్నారు.మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ఏఐ ఆధారిత రంగంలో వస్తున్న వినూత్న మార్పుల్లో హైదరాబాద్ ముఖ్యమైన పాత్ర పోషించబోతుందని వ్యాఖ్యానించారు. కాగా 100 మెగావాట్ల సామర్థ్యంతో హైదరాబాద్‌లో ఏర్పాటు చేసే అత్యాధునిక ఏఐ రెడీ డేటా సెంటర్‌ను ఈ కంపెనీ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నెలకొల్పనుంది. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా డేటా సెంటర్ సామర్థ్యాన్ని పెంచుకునే సదుపాయం ఇందులో ఉంటుంది. దేశంలోనే అతిపెద్ద డేటా సెంటర్లలో ఇది ఒకటిగా నిలుస్తుంది.
తెలంగాణతో కలిసి పని చేయటం గౌరవంగా ఉందని ఎస్టీటీ మీడియా గ్లోబల్ డేటా సెంటర్స్ ప్రెసిడెంట్, గ్రూప్ సీఈవో బ్రూనో లోపెజ్ సంతోసం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఎస్టీటీ హైదరాబాద్‌లోని హైటెక్ సిటీలో డేటా సెంటర్‌ను నిర్వహిస్తోంది. కొత్త క్యాంపస్ ఏర్పాటుతో కంపెనీ కార్యకలాపాలను విస్తరించనుంది. ఈ కంపెనీ దేశంలో వచ్చే పదేండ్లలో దాదాపు 3.2 బిలియన్ డాలర్ల పెట్టుబడులతో ఒక గిగావాట్ సామర్థానికి విస్తరించాలన్న లక్ష్యంతో పెట్టుబడులు పెడుతోంది. అంతకు ముందు మంత్రి శ్రీధర్ బాబు ఎస్టీటీ గ్లోబల్ డేటా సెంటర్‌ను సందర్శించి ఆ సంస్థ ప్రతినిధులతో చర్చలు జరిపారు. అనంతరం పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, ఎస్‌టీటీ గ్రూప్ సీఈవో బ్రూనో లోపెజ్ ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు.
సింగపూర్ వాణిజ్య, పర్యావరణ మంత్రితో భేటీ..!
శనివారం ఉదయం తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం సింగపూర్ వాణిజ్య, పర్యావరణ మంత్రి గ్రేస్ ఫు హైయిన్‌తో భేటీ అయింది.ఇందులో ఇరు దేశాల ప్రతినిధులు తెలంగాణతో వివిధ రంగాలలో సింగపూర్ ప్రభుత్వ భాగస్వామ్యంపై చర్చలు జరిపారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, ఉన్నతాధికారులు ఈ చర్చల్లో పాల్గొన్నారు. తెలంగాణలకు పెట్టుబడులకు ఉన్న అపారమైన అవకాశాలను వివరించారు. ప్రధానంగా నగరాలు, పట్టణాల అభివృద్ధి, మౌలిక సదుపాయాలు, నీటి వనరుల నిర్వహణ, నైపుణ్యాల అభివృద్ధి, స్పోర్ట్స్, సెమీ కండక్టర్ల తయారీ, పర్యావరణం, శాస్త్ర సాంకేతిక రంగాలకు ఉన్న అనుకూలతలను వివరించారు. తెలంగాణ ప్రభుత్వానికి సహకారం అందించేందుకు సింగపూర్ మంత్రి గ్రేస్ పు హైయిన్ సానుకూలంగా స్పందించారు.
తెలంగాణ రైజింగ్ లక్ష్య సాధనలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వంతో భాగస్వామ్యం పంచుకోవాలనే రాష్ట్ర ప్రభుత్వ ఆహ్వానాన్ని పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. ప్రధానంగా ఫ్యూచర్ సిటీ, మూసీ పునరుజ్జీవన ప్రాజెక్ట్, నీటి వనరుల నిర్వహణ, తెలంగాణ ఎంచుకున్న సుస్థిర వృద్ధి ప్రణాళికలపై ఎక్కువ ఆసక్తి ప్రదర్శించారు. పలు ప్రాజెక్టుల్లో పరస్పరం కలిసి పని చేసేందుకు అంగీకరించారు. ఉమ్మడిగా చేపట్టాల్సిన ప్రాజెక్టులు, వాటిపై అధ్యయనం చేసేందుకు ప్రత్యేక బృందాలను గుర్తించాలని నిర్ణయించారు. వివిధ రంగాల్లో సింగపూర్ అనుభవాలను పంచుకోవాలని, దేశంలోనే వేగంగా వృద్ధి చెందుతున్న తెలంగాణలో సంయుక్తంగా చేపట్టే ప్రాజెక్టుల కార్యాచరణ వేగవంతం చేయాలని నిర్ణయించారు.