Take a fresh look at your lifestyle.

ఆదిలాబాద్ లో దా‘రుణం’ … అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

  • రుణం చెల్లించలేదని బ్యాంక్‌ సిబ్బంది వేధింపులు
  • బ్యాంక్‌ లోనే పురుగుల మందు తాగిన జాదవ్​ దేవరావు
  • బ్యాంక్​ ఎదుట మృతుడి బంధువుల ఆందోళన

ముద్ర, తెలంగాణ బ్యూరో : ఆదిలాబాద్​ జిల్లాలో దారుణం చోటు చేసుకున్నది. పంట కోసం చేసిన అప్పు చెల్లించలేని దుస్ధితిలో ఉన్న ఓ రైతు స్థానిక ఐసీఐసీఐ బ్యాంకు అధికారులు వేధింపులు భరించలేక ఆ బ్యాంకులోనే పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడడం సంచలనం రేపింది. మృతుడు జాదవ్​ దేవరావుగా గుర్తించారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని రేణుగూడకు చెందిన రైతు జాదవ్ దేవరావ్ సదరు బ్యాంక్ లో రూ.3 లక్షల వరకు అప్పు తీసుకున్నాడు. దాంతో బ్యాంకు అధికారులు అప్పు తీర్చాలని పదేపదే వేధిస్తుండటంతో బ్యాంకుకు వచ్చి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయంపై బ్యాంకు మేనేజర్​ మాట్లాడుతూ రైతు దేవరావు ను ఒప్పించే ప్రయత్నం చేసినప్పటికీ ఆయన ప్రవర్తన సరిగా లేని కారణంగానే బ్యాంకులో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. మరోవైపు జాదవ్​ మృతికి బ్యాంకు సిబ్బందే కారణమంటూ.. మృతుడి కుటుంబ సభ్యులు బ్యాంకు ఎదుట ఆందోళనకు దిగారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు బ్యాంక్ వద్దకు చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ఖమ్మం జిల్లా కూసుమంచిలో మరో రైతు.. !

అప్పుల బాధలకు మరో యువరైతు బలయ్యాడు. చేసిన అప్పులు తీర్చలేక ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఖమ్మం జిల్లా కూసుమంచి మండల పరిధిలోని లోక్యాతండా లో ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. తండాకు చెందిన వడియా నవీన్ కుమార్ (33) తనకు ఉన్న అర ఎకరం పొలాన్ని సాగు చేస్తూనే చుట్టుపక్క ప్రాంతాల్లో ఉన్న మామిడి తోటల్లో మొక్కలు అంటుగట్టే పనికి వెళ్తున్నాడు. కొన్నాళ్ల నుంచి అప్పుల బాధతో సతమతం అవుతున్నాడు. ఈ క్రమంలోనే తీసుకున్న నగదు తిరిగి చెల్లించాలంటూ అప్పులోల్లు ఒత్తిడికి చేయడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. పని కోసమని చెప్పి 10 రోజుల క్రితం నవీన్ కుమార్ ఇంట్లో ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయాడు.గురువారం నుంచి అతడి మొబైల్ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వచ్చింది. అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు నవీన్ కోసం వెతకగా..అతడి వ్యవసాయ భూమిలోనే చెట్టుకు వేలాడుతూ విగత జీవిగా కనిపించాడు

Leave A Reply

Your email address will not be published.