ప్రజా ప్రతినిధులు ప్రజల్లో మమేకం కావాలి పార్టీ పటిష్టతకు ప్రతి కార్యకర్త కృషి చేయాలి రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు
ముద్ర, వనపర్తి :
జిల్లాలో ప్రజల చేత నూతనంగా ఎన్నుకోబడిన గ్రామ సర్పంచులు, పట్టణాల్లో కౌన్సిలర్లు ప్రజల సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా పనిచేసి, వారి మెప్పు పొందాలని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సూచించారు.

గురువారం స్థానిక కళ్యాణ సాయి గార్డెన్స్‌లో ‘ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల యాక్షన్ ప్లాన్ కార్యక్రమంలో భాగంగా ఇటీవల నూతనంగా ఎన్నికైన గ్రామ సర్పంచులు, కౌన్సిలర్లకు నిర్వహించిన ఒకరోజు శిక్షణ కార్యక్రమంకు మంత్రి జూపల్లి కృష్ణారావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి నూతనంగా ఎన్నిక కాబడిన ప్రజా ప్రతినిధులకు పలు కీలక సూచనలు చేశారు. మంత్రి తో పాటు జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, జిల్లా ఎస్పీ సునీత రెడ్డి, వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘా రెడ్డి, దేవరకద్ర శాసనసభ్యులు జి మధుసూదన్ రెడ్డి, అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు ఖీమ్య నాయక్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోవర్ధన్ సాగర్ ఉన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలో పరిష్కరించడమే లక్ష్యంగా ఈ ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల ప్రణాళికను సీఎం రేవంత్ రెడ్డి తీసుకొచ్చారని చెప్పారు. ఇందులో భాగంగా జిల్లాలో ప్రజల చేత నూతనంగా ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులందరూ భాగస్వాములై ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేయాలన్నారు. ప్రతిరోజూ ఉదయం 2 గంటల పాటు 20 నుంచి 30 ఇళ్లను సందర్శించి, ప్రజల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకోవాలని సూచించారు. క్షేత్రస్థాయిలో సేకరించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఉన్నతాధి కారులకు నివేదించి, సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి. తద్వారా సమస్యలను పరిష్కరించి ప్రజల మెప్పు పొందాలని సూచించారు. ప్రజలకు సేవ చేసే అవకాశం దక్కడం గొప్ప విషయమని ఆ పేరును అలాగే నిలబెట్టుకోవాలని సూచించారు. నిరంతరం ప్రజలతో మమేకం అవ్వడం ద్వారా ప్రజా ప్రతినిధులకు , ప్రజలకు మధ్య ఉన్న బంధం బలోపేతం అవుతుందన్నారు. మనం చేసే ఏ పనైనా పదిమందికి ఉపయోగపడే విధంగా ఉండాలని సూచించారు. రాబోయే రోజుల్లో నిర్వహించబోయే గ్రామ సభల్లోనూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు రుణమాఫీ, రైతు భరోసా, సన్న వడ్లకు బోనస్, గృహ జ్యోతి మహాలక్ష్మి ఇందిరమ్మ ఇండ్లు వంటి పథకాలు అన్నింటిని ప్రజలకు తెలియజేయాలని సూచించారు. వనపర్తి శాసనసభ్యులు మేఘారెడ్డి మాట్లాడుతూ నూతనంగా గెలిచిన ప్రజాప్రతినిధులు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా తమ ఆఫీసులతో పాటు పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. గ్రామాలు వార్డుల్లో నీటి వృధాను ఎలక్ట్రిసిటీ వృధాను అరికట్టాలని తెలియజేశారు. తమ పరిధిలో ఉన్న పాఠశాలలు ఆసుపత్రుల్లో ఏమైనా సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించడానికి కృషి చేయాలన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించి వనపర్తి జిల్లాను అన్ని రంగాల్లో ముందంజలో ఉంచే విధంగా పనిచేయాలని సూచించారు.
సమావేశంలో వనపర్తి మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, వనపర్తి మున్సిపల్ చైర్ పర్సన్ మాధవి, కొత్తకోట మున్సిపల్ చైర్ పర్సన్ అరుణ, పెబ్బేరు మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీనివాస్ గౌడ్, ఆత్మకూరు మున్సిపల్ చైర్పర్సన్ నాగమణి, అమరచింత మున్సిపల్ చైర్ పర్సన్ జింక సువర్ణ, సర్పంచులు, కౌన్సిలర్లు, సంబంధిత శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.