Take a fresh look at your lifestyle.

1.15 కోటి కుటుంబాలకు ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా -అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి

రెండున్నరేళ్లలో పేదల వైద్యం కోసం రూ.‌4,500 కోట్ల ఖర్చు

ఆరోగ్య శ్రీ, సీఎం రిలీఫ్ ఫండ్ కు భారీ కేటాయింపు

రాష్ట్రంలో కొత్తగా 10 వేల పడకల సామర్థ్యంతో అత్యాధునికంగా వైద్యం

చికిత్స అందించే అనుభవం కలిగిన వైద్యులకు ప్రోత్సాహకాలిస్తాం

ఆస్పత్రుల నిర్వహణకు ప్రత్యేక అధికారులను నియమిస్తాం

పీహెచ్ సీ నుంచి స్పెషాలిటీ హాస్పిటల్స్ వరకు ప్రత్యేక ప్రణాళికతో ముందుకు

ముద్ర, తెలంగాణ బ్యూరో :

ఎన్ని అడ్డంకులు ఎదురైనా రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్య రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని సీఎం రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. గతంలో జరిగిన తప్పులను సరిదిద్దుకుంటూనే, నిరుపేదలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడానికి, అవసరమైతే మరిన్ని నిధులను సమకూర్చుతామని స్పష్టం చేశారు. ప్రజా ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత పేదల వైద్యానికి ఎక్కడా నిధుల కొరత లేకుండా ఇప్పటివరకు అత్యధికంగా నిధులు వెచ్చించినట్టు వివరించారు. అసెంబ్లీ సమావేశంలో గడిచిన 27 నెలల కాలంలో ప్రజా ప్రభుత్వం‌‌…రాజీవ్ ఆరోగ్యశ్రీ, సీఎం సహాయ నిధి, ఎల్ఓసీ రూపంలో అందించిన ఆర్థిక సహాయానికి సంబంధించిన గణాంకాలను సీఎం గురువారం శాసనసభ ముందు వివరించారు. ప్రశ్నోత్తరాల సమయంలో ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని అనేక అంశాలను వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం జరిపిన సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ సర్వేలెక్కల ప్రకారం తెలంగాణలోని 1.15 కోటి కుటుంబాలకు ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని అమలు చేయబోతున్నట్లు చెప్పారు. పేదలకు జీవిత బీమాను అందించి పేదల్లో ధీమా కల్పించాలన్న లక్ష్యంతోనే ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెడుతున్నట్లు వెల్లడించారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేదల వైద్యం కోసం రూ.‌4,500 కోట్లు ఖర్చు చేసినట్లు చెప్పారు. గడిచిన 27 నెలల కాలంలో ముఖ్యమంత్రి సహాయ నిధి కింద రూ. 2046 కోట్లు, రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద రూ. 2,400 కోట్లు మొత్తంగా రూ. 4,500 కోట్లు
పేదల వైద్యం కోసం ఖర్చు చేశామన్నారు. 2014 నుంచి 6వ డిసెంబర్ 2023 వరకు రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద ప్రతి నెలా సగటున రూ.‌52 కోట్లు ఖర్చు పెట్టింది. అదే ఇప్పుడు ప్రజా ప్రభుత్వం సగటున ప్రతి నెలా రూ. 89 కోట్లు ఖర్చు పెడుతోందన్నారు. గత ప్రభుత్వం బకాయిల భారాన్ని తమపై పెట్టిందన్నారు. గత ప్రభుత్వం నుండి రాజీవ్ ఆరోగ్యశ్రీలో వారసత్వంగా వచ్చిన భారం రూ.‌600.27 కోట్లు అన్నారు. అందులో ప్రభుత్వ ఆస్పత్రులకు రూ. 240.11 కోట్లు, ప్రైవేటు ఆస్పత్రులకు రూ360.16 కోట్ల బకాయి ఉందన్నారు ఆ భారాన్ని మోస్తూనే.. రాజీవ్ ఆరోగ్యశ్రీ రూ.‌5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచినట్లు చెప్పారు. ప్రజా ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత నుంచి ఈరోజు వరకు రూ.2,408.51 కోట్ల ఆరోగ్యశ్రీ నిధులను చెల్లించినట్లు చెప్పారు. ఇందులో ప్రభుత్వ ఆస్పత్రులకు రూ927.99 కోట్లు, ప్రైవేట్ ఆస్పత్రులకు రూ 1,480.52 కోట్లు చెల్లించామన్నారు. నెలకు ప్రభుత్వ ఆసుపత్రులకు రూ. 34 కోట్లు, ప్రైవేటు ఆస్పత్రులకు రూ. 54 కోట్లు అందించామన్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద మొత్తం రూ. 725.75 కోట్లు బకాయి ఉంటే, అందులో గత ప్రభుత్వం బకాయి పెట్టిన మొత్తం రూ. 600 కోట్లు అన్నారు గత ప్రభుత్వ బకాయి పోగా గడిచిన 28 నెలల కాలంలో ఈ ప్రభుత్వ బకాయి కేవలం రూ100 కోట్లు మాత్రమేనన్నారు.. ఇందులోనూ ప్రభుత్వ ఆస్పత్రులకే ఎక్కువగా రూ.496.31 కోట్లు బకాయి ఉంటే, ప్రైవేటు ఆస్పత్రులకు రూ231.44 కోట్లు ఉందన్నారు.

1.15 కోట్ల కుటుంబాలకు జీవిత బీమా

రాష్ట్రంలో నిరుపేదలను ఆదుకోవడానికి ప్రభుత్వం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోందని సీఎం వెల్లడించారు. ఇందులో భాగంగా పేదల్లో ధీమా కల్పించాలన్న సంకల్పంతోనే 1.15 కోట్ల కుటుంబాలకు జీవిత బీమా తెస్తున్నట్లు చెప్పారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ ఇవ్వకపోవడంతో చికిత్స అందడం లేదన్న వాదన అవాస్తవం అన్నారు. సీఎంఆర్ఎఫ్ గతంలో ఎలా దుర్వినియోగమైందో అందరికీ తెలిసిందేనన్న సీఎం… మరింత పారదర్శకంగా ప్రజాప్రతినిధులకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయడానికి వీలు కల్పించామన్నారు. నిమ్స్, సనత్‌నగర్, అల్వాల్, ఎల్బీనగర్, వరంగల్ టిమ్స్ వంటి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులతో పాటు రూ. 3 వేల కోట్లతో కొత్తగా నిర్మిస్తున్న ఉస్మానియా ఆస్పత్రి కలిపి రాష్ట్రంలో కొత్తగా 10 వేల పడకల సామర్థ్యంతో అత్యాధునికంగా వైద్యం అందించేలా తీర్చిదిద్దుతున్నట్లు రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఆ పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద పేదలు వైద్యం కోసం టీచింగ్ హాస్పిటల్స్‌కు పంపిస్తే తద్వారా అక్కడున్న నిపుణులైన వైద్యులతో చికిత్స అందించడానికి అలాగే వైద్య విద్యార్థులకు వృత్తిరీత్యా ఎంతో అనుభవం వస్తుందని సీఎం అభిప్రాయపడ్డారు. చికిత్స అందించే అనుభవం కలిగిన వైద్యులకు ప్రోత్సాహకాలు కూడా ఇచ్చే ఆలోచన చేస్తున్నామని చెప్పారు. పేదలకు మరింత వేగవంతమైన నాణ్యమైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ఆస్పత్రుల నిర్వహణ విధానంలో కూడా మార్పులు చేస్తున్నట్లు చెప్పారు వైద్యులకు హాస్పిటల్ నిర్వహణ బాధ్యత అప్పగించడంతో వైద్యంపై దృష్టి సారించలేని పరిస్థితులు ఉంటున్నాయన్న రేవంత్ రెడ్డి… నిర్వహణ విభాగాన్ని వేరు చేయాలన్న ఆలోచన చేస్తున్నామన్నారు. ఆస్పత్రుల నిర్వహణకు ప్రత్యేక అధికారులను నియమిస్తామని ప్రకటించారు.విదేశాల్లో గొప్ప పేరు గడించిన వైద్యులు రాష్ట్రానికి వచ్చినప్పుడు వెసులుబాటును బట్టి ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచితంగా పేదలకు వారి సేవలను అందించడానికి వీలుగా మెడికల్ అండ్ హెల్త్ వెబ్‌సైట్ ద్వారా ఒక వేదికను రూపొందిస్తున్నామన్నారు. వైద్య రంగం ఎప్పటికప్పుడు కొత్త సవాళ్లను ఎదుర్కొంటోందని సీఎం తెలిపారు. ఈ విషయంలో ప్రజలకు ఉపయోగపడే సూచనలను స్వీకరిస్తామన్నారు.‌ అలాగే విద్య పరంగా నర్సరీ నుంచి పైస్థాయి వరకు, వైద్యం పరంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి స్పెషాలిటీ హాస్పిటల్స్ వరకు ఒక ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళుతున్నామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. మంచి రోల్ మాడల్‌గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ముందుకెళుతున్నామని ముఖ్యమంత్రి వివరించారు.

Leave A Reply

Your email address will not be published.