ధాన్యం లిఫ్టింగ్ వేగవంతం చేయాలి..
తూకంలో కోతలు, బీ-గ్రేడ్ పేరుతో అక్రమ తగ్గింపులు లేకుండా చూడాలి..
అధికారులు నిరంతరం
పర్యవేక్షణ జరపాలి..
ముద్ర ప్రతినిధి, కరీంనగర్ :
రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుంది..
కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు తీసుకొచ్చిన ధాన్యాన్ని వాస్తవ తూకంతోనే కొనుగోలు చేయాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ రైతులను నష్టపరిచే విధంగా వ్యవహరించవద్దని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ వెలిచాల రాజేందర్ రావు అధికారులను కోరారు.
బుధవారం వెలిచాల రాజేందర్ రావు మీడియాతో మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల్లో తూకం విషయంలో పారదర్శకత పాటిస్తూ, రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సూచించారు. ముఖ్యంగా ధాన్యం లిఫ్టింగ్ ఆలస్యం అవుతున్న ప్రాంతాల్లో అదనంగా రైస్ మిల్లులను కేటాయించి, రవాణా మరియు లాజిస్టిక్ సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ధాన్యం కొనుగోలు ప్రక్రియలో జాప్యం కారణంగా రైతులు ఇబ్బందులు పడకుండా అధికారులు క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యవేక్షణ కొనసాగించాలని కోరారు. లిఫ్టింగ్ సమస్యలతో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నిల్వలు పేరుకుపోకుండా ముందస్తు ప్రణాళికతో చర్యలు చేపట్టాలని సూచించారు.
అలాగే బీ-గ్రేడ్ పేరుతో రైతుల ధాన్యంపై అన్యాయంగా తగ్గింపులు చేయడం సరికాదన్నారు. ధాన్యం నాణ్యత విషయంలో అధికారులు న్యాయబద్ధంగా, పారదర్శకంగా వ్యవహరించాలని, రైతులకు నష్టం కలిగించే విధంగా ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవద్దని స్పష్టం చేశారు. రైతుల కష్టార్జిత ఫలితానికి తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. ప్రభుత్వం రైతుల పక్షాన నిలుస్తోందని, ప్రతి గింజను కొనుగోలు చేసే దిశగా చర్యలు కొనసాగుతు న్నాయని తెలిపారు. రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దని, కాంగ్రెస్ ప్రభుత్వం రైతాంగానికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.