అసెంబ్లీలో నాలుగోసారి బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క
శాసన మండలిలో బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పాలన సాగిస్తున్నాం
రెండేళ్ల కాలంలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేశాం
దేశంలోనే ఆదర్శవంతమైన పాలన అందిస్తున్నాం
రాష్ట్రాభివృద్ధి కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నాం
దేశంలోనే తెలంగాణను నంబర్‌వన్‌గా నిలుపుతాం
రైతు సంక్షేమం, మహిళా సాధికారిత, యువతకు ఉపాధియే ప్రాధాన్యం
తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు పెద్దపీట
ప్రతి పౌరుడికి సామాజిక, ఆర్థిక న్యాయం మా లక్ష్యం
ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క
అసెంబ్లీకి ముందు కేబినెట్ భేటీ.. బడ్జెట్ ప్రతిపాదనలపై ఆమోదం
ముద్ర, తెలంగాణ బ్యూరో :
2026: 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్‌ను ఆర్ధిక మంత్రి భట్టి విక్రమార్క శుక్రవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. 2025-26 పద్దు రూ.3.04 లక్షల కోట్లు కాగా.. ఈ ఏడాది రూ.3.24 లక్షల కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టారు. రంగాల వారీగా కేటాయింపు వివరాలను భట్టి విక్రమార్క సభా వేదికగా వెల్లడించారు. ఈ బడ్జెట్‌లో ఆరు గ్యారెంటీలకు రూ.50,713 కోట్లు, ఆర్థికశాఖకు రూ.60,438 కోట్లు కేటాయించారు.

అలాగే ఇందిరమ్మ ఇళ్లు, సాగునీటి ప్రాజెక్టులు, పంచాయతీ రాజ్ వంటి కీలక శాఖలకు భారీగా నిధులు కేటాయించారు.హోంశాఖతో పాటు విద్య, పట్ణాభివృద్ధి రంగాలకు పెద్దపీట వేశారు. అంత్యంత ప్రాధాన్యతమైన ఆర్థిక శాఖలకు రూ.60438 కోట్లు కేటాయించగా సాధారణ పరిపాలనశాఖకు రూ.1190 కోట్లు కేటాయించారు. ఉన్నత విద్య కు రూ.5443 కోట్లు, రాష్ట్రంలో శాంతి భద్రత పర్యవేక్షించే హోంశాఖకు రూ.11907 కోట్లు, పరిశ్రమలు, వాణిజ్యం రూ.3,747 కోట్లు, పట్టణాభివృద్ధి శాఖ రూ.17,907 కోట్లు, ప్రణాళికశాఖ రూ.7971 కోట్లు, రెవెన్యూ శాఖకు రూ.4020 కోట్లు, మాధ్యమిక విద్య రూ.21,231 కోట్లు, రవాణాశాఖ రూ.4,491 కోట్లు కేటాయించారు. రైతు భరోసా పథకానికి రూ.18 వేల కోట్లు ఖర్చు చేయనున్నట్లు వెల్లడించారు. చేయూత పథకానికి రూ.14,861 కోట్లు.. ఇందిరమ్మ ఇండ్ల పథకానికి రూ.5,500 కోట్లు.. మహాలక్ష్మి పథకానికి రూ.4,305 కోట్లు.. రైతులు పండించిన సన్న వడ్ల బోనస్‌కు రూ.3,500 కోట్లు.. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందించే గృహ జ్యోతి పథకానికి రూ.2,080 కోట్లను కేటాయించారు. రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకానికి రూ.1,143 కోట్లు.. మహాలక్ష్మి పథకం కింద ఎల్పీజీ సబ్సిడీకి రూ.723 కోట్లు.. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకానికి రూ. 600 కోట్లు.. పవర్ సబ్సిడీకి రూ.14 వేల కోట్లు.. బియ్యం సబ్సిడీకి రూ.3 వేల కోట్లు.. కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ స్కీంకు రూ.3,683.. విద్యార్థుల డైట్ ఛార్జీల కోసం రూ.2,170 కోట్లు.. విద్యార్థుల స్కాలర్‌షిప్‌లకు రూ.4,343 కోట్లు.. ఆఫీస్ ఖర్చులకు రూ.2,323 కోట్లు కేటాయించారు.ప్రతి పౌరుడికి సామాజిక, ఆర్థిక న్యాయం అందించడమే లక్ష్యంగా బడ్జెట్ ను రూపొందించినట్లు చెప్పారు. అంబేడ్కర్ అడుగుజాడల్లోనే పాలన సాగిస్తున్నామని పేర్కొన్నారు. తెలంగాణలో తలసరి ఆదాయం 10.2 శాతం పెరిగి రూ.4,18,931 లక్షలకు చేరిందని ప్రకటించారు. 2024-25తో పోలిస్తే 2025-26లో తెలంగాణ రాష్ట్ర జీడీపీ 10.6 శాతం మేర పెరిగిందన్నారు. జాతీయ సగటు వృద్ధి రేటు కంటే తెలంగాణ జీఎస్‌డీపీ 2.7 శాతం ఎక్కువగా ఉందన్నారు. అంతకుముందు ఉదయం 9 గంటలకు అసెంబ్లీ కమిటీ హాలులో కేబినెట్ సమావేశం నిర్వహించి బడ్జెట్‌ను ఆమోదించారు. ప్రజా భవన్ నల్ల పోచమ్మ ఆలయం వద్ద బడ్జెట్ ప్రతులకు భట్టి పూజలు నిర్వహించారు.

బీఆర్ఎస్ వాకౌట్
ఓ వైపు బడ్జెట్ పై భట్టి విక్రమార్క ప్రసంగిస్తుండగానే బీఆర్ఎస్ నేతలు సభ నుంచి వాకౌట్ చేశారు. బడ్జెట్ రాష్ట్ర ప్రజల అవసరాలు తీర్చేలా లేదని విమర్శిస్తూ.. చెవుల్లో పువ్వులు పెట్టుకుని నిరసన తెలిపారు. అనంతరం తెలంగాణ అసెంబ్లీ, మండలి సోమవారానికి వాయిదా పడ్డాయి.
ఆరు గ్యారంటీలకు రూ. 50వేల కోట్లు..
రాష్ట్ర బడ్జెట్‌లో ప్రభుత్వం ఆరు గ్యారెంటీలకు పెద్దపీట వేసింది. ఈ పథకాల అమలు కోసం రూ.50 వేల కోట్ల నిధులు కేటాయిస్తున్నట్లు ప్రకటించింది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని పేదలు, వృద్ధులు, ఆసరా అవసరమైన వారికి భట్టి భారీ ఊరటనిచ్చారు. కొత్తగా మరో 2 లక్షల మందికి ‘చేయూత’ పెన్షన్లు మంజూరు చేయనన్నట్లు భట్టి విక్రమర్క అసెంబ్లీలో ప్రకటించారు. కాగా ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను అమలుకు చర్యలు చేపట్టింది. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని ప్రకటించిన కాంగ్రెస్ సర్కార్… ఇప్పటికే ఈ గ్యారెంటీల్లో కొన్నింటిని అమలు చేస్తోంది. మరికొన్ని హామీలు మాత్రం మిగిలిపోయాయి. దీనిపై ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీలు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఆరు గ్యారెంటీల అమలుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం నడుం బిగించింది. 6 గ్యారెంటీలకు భారీగా నిధులను కేటాయించింది. ఈ పథకాల అమలు కోసం ఏకంగా రూ.50,713 కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపింది.
మూసీ పునరుజ్జీవానికి రూ. 1500 కోట్లు
మూసీ నది ప్రాజెక్టు కోసం రూ.1500 కోట్లు కేటాయిస్తున్నట్లు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రకటించారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కోసం రూ.5 వేల కోట్లు.. ప్రభుత్వ ఉద్యోగుల ఆరోగ్య పథకం కోసం రూ.1,056 కోట్లు.. ఉస్మానియా యూనివర్సిటీకి రూ. వెయ్యి కోట్ల కేటాయింపులు చేసినట్లు భట్టి వివరించారు.
ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు డిజిటల్ కార్డులు
ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న నగదు రహిత ఆరోగ్య భద్రత పథకం ఎంప్లాయిస్ హెల్త్ స్కీంను ప్రారంభిస్తున్నట్టు భట్టి విక్రమార్క ప్రకటించారు. రాష్ట్రంలోని రాజీవ్ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా ప్రభుత్వ ఆస్పత్రులతోపాటు 421 ఎంప్యానెల్ ప్రయివేట్ ఆసుపత్రుల్లో 1,998 వ్యాధులకు ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు చికిత్స పొందవచ్చని తెలియజేసారు. ఇందులో భాగంగా ప్రతి ఉద్యోగికి డిజిటల్ కార్డు అందిస్తామని వెల్లడించారు. మరోవైపు రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న 3 టిమ్స్ ఆస్పత్రులను ఈ ఏడాది చివరికి ప్రారంభిస్తామన్నారు. నిమ్స్ ఆస్పత్రి విస్తరణ, వరంగల్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తో సహా మొత్తం 6,582 టెర్షియరీ కేర్ బెడ్లు అందుబాటులోకి తెస్తామని పేర్కొన్నారు.
ఇంటర్ విద్యార్ధులకు మధ్యాహ్న భోజనం
ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఇంటర్ చదువుతున్న విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజనం పథకాన్ని ప్రవేశపెడుతున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు. 2026-27 విద్యా సంవత్సరం నుంచి ప్రీప్రైమరీ నుంచి ఇంటర్ వరకు విద్యార్థులకు నూతనంగా బ్రేక్ ఫాస్ట్ పథకాన్ని ప్రారంభిస్తామని మంత్రి తెలిపారు. మూడు రోజులు అల్పహారంతోపాటు పాలు, మరో మూడు రోజులు రాగి జావ అందిస్తామని భట్టి ప్రకటించారు. తెలంగాణలోని ఏ విద్యార్థి కూడా ఆకలితో అలమటించొద్దనే ఉద్దేశంతో బ్రేక్‌ఫాస్ట్ పథకానికి రూపకల్పన చేశామని మంత్రి తెలిపారు. ఐటీఐలు, ఏటీసీల్లో చదివే విద్యార్థులకు నెలకు రూ.2 వేల చొప్పున స్కాలర్‌షిప్ అందిస్తామని మంత్రి ప్రకటించారు. ఈ బడ్జెట్లో విద్యా రంగానికి రూ.26,674 కోట్లు కేటాయించారు.
తెలంగాణ విద్యార్థి ఉద్యమాలకు గుండె కాయ ఉస్మానియా యూనివర్సిటీకి రాష్ట్ర బడ్జెట్‌లో పెద్ద పీట వేశారు. వర్సిటీ అభివృద్ధికి రూ. 1000 కోట్లు కేటాయించారు. ఈ నిధులు మౌలిక సదుపాయాల కల్పన, పాత భవనాల పునరుద్ధరణ, నూతన హాస్టల్ భవనాల నిర్మాణానికి వినియోగించనున్నారు. ఈ కేటాయింపులతో యూనివర్సిటీలో అత్యాధునిక పరిశోధనా కేంద్రాలు, డిజిటల్ లైబ్రరీలు, స్మార్ట్ క్లాస్ రూమ్‌ల ఏర్పాటుకు మార్గం సుగమం అయింది. ఇక విద్యార్థులకు అవసరమైన క్రీడా ప్రాంగణాలు, క్యాంపస్ సుందరీకరణ పనులకు కూడా ఈ నిధులు వెచ్చించనున్నారు. ప్రభుత్వ తీసుకున్న ఈ నిర్ణయంపై విద్యార్ధులు, అధ్యాపకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
మెట్రో రెండో దశకు రూ. 600 కోట్లు..
హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 విస్తరణకు ప్రభుత్వం రూ.600 కోట్లు కేటాయించింది. మెట్రో నిర్వహణను ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకుంటుందని, పాతబస్తీ, ఎయిర్‌పోర్ట్ కారిడార్లకు ప్రాధాన్యత ఇస్తామని మంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. నగర మౌలిక వసతుల కోసం హెచ్-సీఐటీటీ కింద రూ.2,654 కోట్లు, తాగునీటి ప్రాజెక్టుల కోసం భారీ నిధులను బడ్జెట్‌లో కేటాయించినట్లు చెప్పారు. హైదరాబాద్ మహానగరానికి జీవనాడిగా ఉన్న మెట్రో రైల్ ప్రాజెక్టును ఎల్ అండ్ టీ సంస్థ నుంచి ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకోవాలనే నిర్ణయం రాష్ట్ర రవాణా చరిత్రలో ఒక సాహసోపేతమైన, ప్రజానుకూలమైన నిర్ణయమన్నారు. హైదరాబాద్ మెట్రో రైలు ప్రస్తుతం రోజుకు సుమారు 5 లక్షల ప్రయాణికులకు సేవలందిస్తోందన్నారు. ఈ సౌకర్యాన్ని పాతబస్తీకి విస్తరించడంతో పాటు మెట్రో ఫేజ్-11 కింద కొత్త కారిడార్లు నిర్మించి నెట్వర్‌ను విస్తరించే ప్రణాళికను ప్రభుత్వం రూపొందించిందన్నారు. వేగంగా విస్తరిస్తున్న హైదరాబాద్ నగరంలో పాతబస్తీ, శంషాబాద్ విమానాశ్రయం, హైటెక్ సిటీ దాటి ఇతర ప్రాంతాలకు మెట్రో విస్తరణ అత్యవసరంగా మారిందన్నారు. ఇక దేశంలోనే అత్యంత నివాసయోగ్యమైన నగరంగా హైదరాబాద్ ఇప్పటికే ఖ్యాతి గడించిందన్నారు. అంతర్జాతీయ నగరాలకు ధీటుగా తీర్చిదిద్దేందుకు తమ ప్రభుత్వం తగిన చర్యలు చేపడుతోందన్నారు. ప్రజలు, సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, కార్పొరేట్ సామాజిక బాధ్యత భాగస్వాములు తదితరుల సహకారంతో అనేక నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడుతోందన్నారు. హైదరాబాద్ శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల జాబితాలో ముందుందన్నారు. అయినా, ప్రభుత్వం అక్కడితోనే ఆగకుండా తెలంగాణలోని ప్రతి పట్టణం, ప్రతి నగరం హైదరాబాద్ మాదిరిగా అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో పనిచేస్తుందన్నారు. రాష్ట్రంలో పట్టణీకరణ శాతాన్ని పెంచగలిగామన్నారు. ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుందని చెప్పడానికి ఇది ఒక నిదర్శనమన్నారు. నగర నీటి అవసరాలు తీర్చేందుకు గోదావరి తాగునీటి ప్రాజెక్ట్, కొత్త రిజర్వాయర్లు, 39 మురుగునీటి శుద్ధి కేంద్రాలను మంజూరు చేశామన్నారు. వాటి నిర్మాణం వివిధ దశలలో కొనసాగుతోందని చెప్పారు. పాత జీహెచ్ఎంసీ సంస్థకి ఉన్న అధిక వడ్డీ అప్పుల గురించి సంబంధిత బ్యాంకులతో చర్చించి వడ్డీ రేటును 9.15 శాతం నుండి 7.95 శాతానికి తగ్గించామన్నారు. హైదరాబాద్ నగర మౌలిక వసతుల అభివృద్ధి కోసం ‘H-CITI’ పథకం కింద 2 వేల 654 కోట్ల రూపాయలు కేటాయించామని భట్టి విక్రమార్క వెల్లడించారు.

జూన్ 2 నుంచి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం
రాష్ట్ర ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క రాష్ట్ర ప్రజలకు శుభవార్త చెప్పారు. ఈ ఏడాది జూన్ 2 నుంచి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని అమలు చేయనున్నట్లు అసెంబ్లీలో ప్రకటించారు. ఈ పథకం కింద రాష్ట్రంలోని 1.15 కోట్ల కుటుంబాలకు రూ.5 లక్షల జీవిత బీమా కల్పిస్తున్నట్లు వెల్లడించారు. పేద, ధనిక అనే తేడాలు లేకుండా రాష్ట్ర ప్రజలందరికీ ఈ బీమాను వర్తింపజేస్తామని తెలిపారు. ఏపీ రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి, అసంఘటిత రంగంలోకి కార్మికులకు బీమా రక్షణ కల్పిస్తోంది. ఈ పథకం కింద ప్రభుత్వమే బీమా ప్రీమియాన్ని చెల్లిస్తోంది. అయితే తెలంగాణ ప్రభుత్వం కుటుంబ ఆర్థిక పరిస్థితితో సంబంధం లేకుండా రాష్ట్రంలోని అన్ని కుటుంబాలకు ఈ పథకాన్ని వర్తింపజేస్తామని ప్రకటించడం గమనార్హం. ఈ పథకం అమల్లోకి వస్తే.. చాలా వరకు పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా లభించనుంది.
ఎస్టీల సంక్షేమానికి రూ.12,600 కోట్లు కేటాయించారు. ఈ నిధులను ‘ఇందర సౌర గిరి జల వికాసం’ పథకం ద్వారా ఖర్చు చేయనున్నారు. 100 శాతం సబ్సిడీతో సోలార్ పంపు సెట్లను అందించి, ఆరు లక్షల ఎకరాల పోడు భూముల్లో అటవీ ఉత్పత్తులకు సంబంధించిన తోటల పెంపకాన్ని ప్రోత్సహించి 2.10 లక్షల గిరిజన రైతులకు లబ్ధిచేకూర్చనున్నట్లు భట్టి విక్రమార్క ప్రకటించారు. ఈ పథకాన్ని ఇప్పటికే అచ్చంపేటలో పైలట్ ప్రాజెక్టుగా ప్రాంరంభించామని, దీని విధివిధానాలు అధ్యయనం చేసి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామని భట్టి తెలిపారు.
ఐటీకి రూ.875 కోట్లు
బడ్జెట్‌లో ప్రభుత్వం ఐటీ శాఖకు భారీగా నిధులు కేటాయించింది. గ్రామీణ ప్రాంతాలకు ఇంటర్నెట్ సేవలు అందించాలన్న లక్ష్యంతో రూ.875 కోట్లను కేటాయించింది. ఇప్పటికే టీ-ఫైబర్ ద్వారా రాష్ట్రంలోని 424 మండలాల్లోని 8888 గ్రామపంచాయతీలకు, 4800 ప్రభుత్వ సంస్థలకు హైస్పీడ్ ఇంటర్నెట్‌ను అనుసంధానం చేసింది. ఈ ఆర్థిక సంవత్సంలో మరో 50 వేల ప్రభుత్వ సంస్థలకు కొత్త కనెక్షన్లు ఇచ్చేందుకు ప్రణాళికలు రూపొందించింది. ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రైవేట్ సంస్థల ఇంటర్నెట్‌ను సేవలను తగ్గించడంతోపాటు ఖర్చును తగ్గించేందుకు ప్రభుత్వం టీ-ఫైబర్ ద్వారా సురక్షితమైన హైస్పీడ్ ఇంటర్నెట్‌ను అందిస్తున్నట్లు ఆర్థికశాఖ మంత్రి భట్టి బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు.
ఐటీలో 9.39 లక్షల మందికి ఉద్యోగాలు:
ఐటీ రంగంలో తెలంగాణ సాధిస్తున్న అభివృద్ధి దేశానికే తలమానిరంగా మారిందని భట్టి తెలిపారు. రాష్ట్రంలో 1500 కంటే ఎక్కువ ఐటీ, ఐటీఈఎస్ కంపెనీలు ఉన్నాయన్నారు. తెలంగాణలో ఐటీ రంగంలో వృద్ధి పెంచడానికి, పెట్టబడులను ఆకర్షించడానికి, ఉపాధి కల్పన కోసం 1వ, 2, ఐసీటీ విధానాలను ప్రభుత్వం ప్రారంభించిందని భట్టి వెల్లడించారు. వీటితోపాటు ఎలక్ట్రానిక్స్ పాలసీ, ఇమేజ్ పాలసీలను ప్రభుత్వం తీసుకొస్తున్న చెప్పారు. తెలంగాణ నుంచి ఐటీ ఎగుమతులు 3.13 లక్షల కోట్లకు 9.39 లక్షల మందికి పైగా ఉపాధి అవకాశీలు కల్పిస్తున్నాయని భట్టి వివరించారు.
హైదరాబాద్ లోయర్ ట్యాంక్ బండ్ వద్ద కొత్తగా డా.బి.ఆర్ అంబేద్కర్ నాలెడ్జ్ టవర్‍ను నిర్మించబోతున్నట్లు భట్టి ప్రకటించారు. రూ.368.27 కోట్ల అంచనా వ్యయంతో 910 ఎస్సీ కమ్యూనిటీ హాళ్లు, అంబేద్కర్ భవనాలు, విగ్రహాలు మంజూరు చేశామని తెలిపారు. హైదరాబాద్ లోని నింబోలి అడ్డ కాచిగూడలో బాబూ జగ్జీవన్ రామ్ పేరుతో నూతన వసతి గృహాన్ని నిర్మిస్తామని పేర్కొన్నారు. అంతరాలు లేని సమాజం కోసం తమ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందన్నారు. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల సామాజిక న్యాయం చేయాలనేది ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం అన్నారు. వసతి పాఠశాలలు, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల ద్వారా ఎస్సీ, ఎస్టీలకు ఉద్యోగావకాశాలు కల్పించడానికి కృషి చేస్తున్నట్లు చెప్పారు.
ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ అమలుపై..
ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ చట్టాన్ని సంపూర్ణంగా అమలు చేయడానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని భట్టి అన్నారు. తాము అధికారంలోకి వచ్చే సమయంలో 2023-24 ఆర్థిక సంవత్సరం నాటికి సబ్ ప్లాన్ చట్ట ప్రకారం ఖర్చు చేయాల్సిన నిధులలో ఎస్సీలకు చెందిన రూ.13 ,617 కోట్లు, ఎస్టీలకు చెందిన 1,317 కోట్లు కలిసి మొత్తం 14,934 కోట్లు ఖర్చు కాకుండా ఉందన్నారు. తమ ప్రభుత్వం గత ఆర్థిక సంవత్సరంలో చేసిన కేటాయింపులతో పాటు ఈ బకాయిలను కూడా అదనంగా కేటాయించామన్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఈ క్యారీ ఫార్వర్డ్ చేయవలసిన నిధులు, ఎస్సీలకు రూ7,757 కోట్లు, ఎస్టీలకు రూ.1,754 కోట్లు ఖర్చు చేయవలసి ఉంది. వాటిని మేము 2026-27 ఆర్థిక సంవత్సరంలో కేటాయించాల్సిన మొత్తానికి అదనంగా 2024-25 ఆర్థిక సంవత్సరానికి చెందిన బకాయిలను కూడా కేటాయిస్తున్నామన్నారు.
చెవిలో పువ్వు పెట్టుకుని బీఆర్ఎస్ నిరసన
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రసంగం ప్రారంభించగానే, బీఆర్ఎస్ సభ్యులు వినూత్న నిరసనకు దిగారు. ప్రభుత్వం ప్రజలను ‘చెవిలో పూలు’ పెట్టి మోసం చేస్తోందని అర్థం వచ్చేలా, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా తమ చెవులలో పూలు పెట్టుకుని సభ నుంచి వాకౌట్ చేశారు. అంతకు ముందు బడ్జెట్ ప్రసంగం ప్రారంభం కాగానే, ప్రభుత్వం గత ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను విస్మరించిందని ఆరోపిస్తూ నినాదాలు చేశారు. ముఖ్యంగా ‘ఆరు గ్యారంటీల’ అమలు తీరుపై వారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వాకౌట్ చేసిన అనంతరం, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు శాసనసభ ఎంట్రీ వద్దకు చేరుకుని ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా వారు ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ‘తులం బంగారం మోసం మోసం’ అంటూ నినాదాలు చేస్తూ ప్రభుత్వం పేద మహిళలను వంచించిందని ఆరోపించారు. ‘రెండు లక్షల ఉద్యోగాలు మోసం మోసం’ అంటూ యువతకు ఇచ్చిన హామీని ప్రభుత్వం నిలబెట్టుకోవడంలో విఫలమైందని మండిపడ్డారు. ఇక ‘బడ్జెట్ మోసం మోసం’ అంటూ, ఈ బడ్జెట్‌లో పేదలకు, రైతులకు, మహిళలకు ఎలాంటి న్యాయం జరగలేదని బీఆర్ఎస్ నేతలు ధ్వజమెత్తారు.
………………………………………………………………………………………
తెలంగాణ వార్షిక బడ్జెట్ రూ.3,24,234 కోట్లు
రెవెన్యూ వ్యయం రూ.2,34,406 కోట్లు
మూలదన వ్యయం రూ. 47, 267 కోట్లు
గతేడాది కంటే రూ.20 వేల కోట్లు అధికం
శాఖల వారీగా కేటాయింపులు (రూ. కోట్లలో)
విద్యాశాఖ -26,674
వైద్యారోగ్య శాఖ- 13,679
హోం శాఖ -11,907 కోట్లు
వ్యవసాయ శాఖ -23,179
విద్యుత్ శాఖ – 21,285
పౌరసరఫరాల శాఖ- 7,366
స్త్రీ, శిశు సంక్షేమం -3,143
ఎస్సీ అభివృద్ధి- 11,784
ఎస్టీ అభివృద్ధి- 7,937
మైనారిటీ సంక్షేమం-3769
ఇరిగేషన్ – 22, 615
మున్సిపల్ శాఖ -17,907
పశుసంవర్ధక శాఖ -1,529
రాజీవ్ యువ వికాసం -6,000
గృహ నిర్మాణం -7,430
ఐటీ శాఖ -875
చేనేత, జౌళి శాఖ -258
పరిశ్రమల శాఖ -3,490
పంచాయతీ రాజ్ -33,688
ఆర్ అండ్ బీ -12,789
న్యాయ శాఖ- 2,367
టూరిజం- 1,224
గోదావరి పుష్కరాలకు రూ. 500 కోట్లు కేటాయింపు
ఆరు గ్యారంటీలకు రూ.50,713 కోట్లు
గృహజ్యోతి – రూ.2,080 కోట్లు
రాజీవ్ ఆరోగ్యశ్రీ – రూ.1,143 కోట్లు
మహాలక్ష్మి గ్యాస్ సబ్సిడీ – రూ.723 కోట్లు
ఇందిరమ్మ ఆత్మీయ భరోసా – రూ.600 కోట్లు
రైతు భరోసా – రూ.18 వేల కోట్లు
చేయూత – రూ.14,861 కోట్లు
ఇందిరమ్మ ఇళ్లు – రూ.5,500 కోట్లు
మహాలక్ష్మి పథకం – రూ.4,305 కోట్లు
వ్యవసాయ ఉత్పత్తులకు బోనస్ – రూ.3,500 కోట్లు
విద్యుత్ రాయితీ – రూ.14 వేల కోట్లు
కల్యాణలక్ష్మీ పథకం – రూ.3,683 కోట్లు
ఉపకారవేతనాలు – రూ.4,343 కోట్లు