- 93 లక్షల కుటుంబాలకు సన్న బియ్యం దేశంలోనే రికార్డు.
- అభివృద్ధి, సంక్షేమం సమానంగా పరుగులు పెట్టిస్తున్నాం.
- డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు.
మధిర, ముద్ర విలేఖరి : రేషన్ కార్డు అంటేనే ఆహార భద్రత అని, రాష్ట్రంలోని 93 లక్షల కుటుంబాలకు రేషన్ కార్డులతో పాటు సన్నబియ్యం ఇవ్వడం భారత దేశ చరిత్రలోనే రికార్డు అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. సోమవారం మధిర నియోజకవర్గం బోనకల్లు మండల కేంద్రంలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ అత్యంత పేదలతో పాటు, ఆర్థికంగా వెనుకబడిన మధ్యతరగతి వర్గాలకు కూడా ఇందిరమ్మ ప్రభుత్వంలో రేషన్ కార్డుల పంపిణీ జరుగుతుందన్నారు.రాష్ట్రంలో 1.15 లక్షల కుటుంబాలు ఉండగా 93 లక్షల కుటుంబాలకు రేషన్ కార్డులు ఇవ్వడమే కాకుండా, సన్న బియ్యం కూడా ప్రజా ప్రభుత్వంలో పంపిణీ చేస్తున్నామన్నారు. కుటుంబంలోని ప్రతి ఒక్కరికి నెలకు ఆరు కిలోల చొప్పున సన్న బియ్యం ఇవ్వడం భారతదేశ చరిత్రలో నే ఒక రికార్డు అన్నారు. లబ్ధిదారుల సంఖ్య రీత్యా చూసినా, సన్న బియ్యం పంపిణీలో చూసిన ఆహార భద్రత విషయంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ఒక రోల్ మోడల్ గా నిలిచిందన్నారు.
కొత్తగా పెళ్లి అయిన వాళ్ళు గత పది సంవత్సరాలుగా రేషన్ కార్డులు పేరు నమోదు, కుటుంబ సభ్యుల పేర్లు చేర్పులు, మార్పుల కోసం గత పది సంవత్సరాలు కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూసిన ఫలితం లేకుండా పోయిందన్నారు. మధిర నియోజకవర్గంలోనే కొత్తగా 13,767 మంది లబ్ధిదారులకు ఒకేరోజు కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేయడం సంతోషకర విషయం అన్నారు. రేషన్ కార్డులో జారీ అనేది ఉమ్మడి రాష్ట్రంలో నిరంతర ప్రక్రియ కాగా గత పది సంవత్సరాలు పరిపాలించిన వారు ఈ విషయాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు.200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరా చేస్తుండగా ఈ పథకం కింద రాష్ట్రంలోని 51 లక్షల కుటుంబాలకు లబ్ధి కలుగుతుందన్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద పది లక్షల వరకు ఉచిత వైద్య సదుపాయం రాష్ట్రంలోని 93 లక్షల కుటుంబాలకు అందుబాటులోకి వచ్చిందన్నారు. ఇటీవలే తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్లు రైతులకు రైతుబంధు పథకం ద్వారా పెట్టుబడి సాయం కింద రైతుల ఖాతాల్లో జమ చేశామని,అధికారంలోకి వచ్చిన మూడు నెలల వ్యవధిలోనే రెండు లక్షల వరకు రైతు రుణమాఫీ కింద 21 వేల కోట్లు రైతుల పక్షాన బ్యాంకులకు చెల్లించామని తెలిపారు.కేవలం సంక్షేమ కార్యక్రమాలే కాకుండా పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని, రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు పరుగులు పెడుతున్నాయన్నారు. రాష్ట్రంలో రహదారుల అభివృద్ధికి ఆర్ అండ్ బి శాఖ ద్వారా 20వేల కోట్లతో పనులు చేపట్టామని, విద్యార్థులకు ప్రపంచ స్థాయి విద్యను అందించేందుకు యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ అందుబాటులోకి తీసుకువస్తున్నామని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అనుదీప్ దూరిశెట్టి, డిసిసిబి చైర్మన్ దొండపాటి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.
