Take a fresh look at your lifestyle.

ఆరు గ్యారంటీలకు గోరి హామీల అమలుపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు,ఇందిరమ్మ, రాజీవ్ గాంధీ పేరుతో ఉన్న పథకాలకూ నిధుల్లేవు రాష్ట్ర బడ్జెట్ పై బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు ఆరోపణ

 

ముద్ర, తెలంగాణ బ్యూరో :

ప్రభుత్వం తాను ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ లో ఆరు గ్యారంటీలకు గోరి కట్టిందని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు విమర్శించారు. ఆరు గ్యారంటీల అమలు విషయంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ఆరోపించారు. టెండర్ల మీద ఉన్న ప్రేమ పేదల మీద లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ పై ఆయన బీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఇందిరమ్మ, రాజీవ్ గాంధీ పేరుతో పథకాలు ఉన్నా నిధులు మాత్రం కేటాయింపు లేదని ఎద్దేవా చేశారు. బడ్జెట్ ను చూస్తుంటే భట్టి బడ్జెట్ బోగస్ బడ్జెట్ అని అర్థమవుతోందన్నారు. గతంలో నిధులు ఖర్చు చేయని పథకాలకు మళ్లీ నిధులు కేటాయించారని మీ ప్రభుత్వంలో స్కాములు తప్ప స్కీములు ఉన్నాయా అని ప్రశ్నించారు. పెట్టుబడులు, ఉద్యోగాల కల్పనపై శ్వేతపత్రం ఇవ్వాలని డిమాండ్ చేసినా పట్టించుకోలేదని మండిపడ్డారు. ఈ బడ్జెట్‍లో సకల జనులకు దక్కింది గుండు సున్నా మాత్రమే అన్నారు. ఈ ప్రభుత్వం మూడేళ్లు కూడా నిండకముందే రూ. 3 లక్షల కోట్ల అప్పు చేసిందన్నారు. బీఆర్ఎస్ హయాంలో తలసరి ఆదాయ వృద్ధి 12.1శాతం తలసరి ఉంటే మీ పాలనలో అది 10.2 శాతం ఉందని ఇది కాంగ్రెస్ పరిపాలన వైఫల్యానికి నిదర్శనం అన్నారు. వెనుక ఫిరాయింపు ఎమ్మెల్యేలను కూర్చొబెట్టుకుని భట్టి రాజ్యాంగ విలువల గురించి మాట్లాడటం సిగ్గుచేటన్నారు. సీఎం రేవంత్ రెడ్డి తుగ్లక్ పాలనతో రాష్ట్ర అభివృద్ధి పడిపోయిందన్నారు. క్యూర్, ప్యూర్, రేర్ పేరుతో, హైదారాబాద్ ను మూడు ముక్కలు చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం మూడు ముక్కలాట ఆడుతోందని ఆరోపించారు. ఇది క్యూర్ మోడల్ కాదు చోరీ మోడల్ అని ఎద్దేవా చేశారు. కూల్చడం మీద ఉన్న ప్రేమ నిర్మాణాలపై లేదన్నారు.

Leave A Reply

Your email address will not be published.