Take a fresh look at your lifestyle.

ఇక కొత్త విద్యావిధానం టెన్త్ పరీక్షలు ఉండవు

రాష్ట్రంలో వంద పబ్లిక్ స్కూళ్లు
నర్సరీ నుంచి ఇంటర్ వరకు ఒకే విధానం
మీడియా చిట్ చాట్‌లో సీఎం రేవంత్ రెడ్డి

ముద్ర, తెలంగాణ బ్యూరో :
తెలంగాణ కొత్త విద్యావిధానంలో టెన్త్ పరీక్షలు ఉండవని, పన్నెండో తరగతి వరకూ ఒకే పద్దతిలో బోధన ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. సీఎం రాష్ట్ర విద్యావ్యవస్థలో తీసుకురాబోతున్న విప్లవాత్మక మార్పుల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. కొత్త విద్యా విధానంలో టెన్త్ పరీక్షలు ఉండవని ప్రకటించారు. విద్యావ్యవస్థను పూర్తిస్థాయలో మార్చి అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా సిద్దం చేస్తామన్నారు. ఇటీవల ప్రభుత్వం నియమించిన కమిటీ నూతన విద్యావిధానంపై నివేదిక ఇచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తావించిన ముఖ్యమైన మార్పు వన్ బోర్డ్ ఫర్ ఆల్ క్లాసెస్ . అంటే ప్రస్తుతం ఉన్న వేర్వేరు బోర్డులను కలిపి ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చి, విద్యా విధానాన్ని సరళీకృతం చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. జాతీయ విద్యా విధానం ప్రకారం భవిష్యత్తులో టెన్త్ బోర్డు పరీక్షల ప్రాముఖ్యతను తగ్గించి, విద్యార్థులపై ఒత్తిడి లేకుండా సెమిస్టర్ పద్ధతి ,ఇతర మూల్యాంకన పద్ధతులను ప్రవేశపెట్టే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది.

కార్పొరేట్ కు దీటుగా
తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్థాయికి దీటుగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని గతంలో సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. పదేళ్లుగా నిర్లక్ష్యానికి గురైన విద్యా రంగాన్ని ప్రక్షాళన చేస్తామని, ఇందుకోసం బడ్జెట్‌లో భారీగా నిధులు కేటాయిస్తున్నామని తెలిపారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ఇక్కడ కులమతాలకు అతీతంగా విద్యార్థులందరికీ ఒకే చోట నాణ్యమైన విద్య, వసతి కల్పిస్తామని చెబుతూ వస్తున్నారు. కేవలం డిగ్రీలు పట్టా పుచ్చుకోవడం కాకుండా, విద్యార్థులకు చేతినిండా పని దొరికేలా యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ని ప్రతిష్టాత్మకంగా తీసుకువస్తున్నారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా కోర్సులను రూపొందించి, విద్యార్థులకు నైపుణ్య శిక్షణ ఇస్తామని చెప్పారు. దీనివల్ల చదువు పూర్తికాగానే యువతకు ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయని, నిరుద్యోగ సమస్యను రూపుమాపవచ్చని ధీమా వ్యక్తం చేశారు. టాటా లాంటి దిగ్గజ సంస్థల భాగస్వామ్యంతో ఐటీఐలను కూడా అప్‌గ్రేడ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు.

మేం రాజీపడం
పాఠశాలల్లో చదివే విద్యార్థుల ఆరోగ్యం, పౌష్టికాహారం విషయంలో ప్రభుత్వం రాజీ పడబోదని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ముఖ్యంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. అలాగే, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా పాఠశాలల నిర్వహణ బాధ్యతలను మహిళా సంఘాలకు అప్పగించామని, తద్వారా స్థానికంగా పర్యవేక్షణ మెరుగుపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సీఎం చేసిన పరీక్షల రద్దు అంశంపై ప్రభుత్వం త్వరలో క్లారిటీ ఇవ్వనుంది.

Leave A Reply

Your email address will not be published.