- వరద నిర్వహణకు హైదరాబాద్ తరహాలోనే అన్ని జిల్లాల్లో ఏర్పాట్లు.
- ప్రకృతి విపత్తుల విభాగం బలోపేతానికి ఉన్నత స్దాయి కమిటీ.
- వారం రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశం.
- రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి.
ముద్ర, తెలంగాణ బ్యూరో : ఈ ఏడాది రాష్ట్రంలో సాధారణ కంటే ఎక్కువ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ( ఐఎండీ) హెచ్చరికల నేపధ్యంలో గోదావరి కృష్ణా నదీ పరివాహాక ప్రాంతాల్లో వీలైనంత వరకు ప్రాణ, ఆస్ధి, ఆర్ధిక నష్టం జరగకుండా ఇప్పటి నుండే పకడ్బందీ చర్యలు తీసుకొంటూ అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. గోదావరి , కృష్ణా నదీ పరీవాహక ప్రాంతాల్లో వరద నిర్వహణపై ఆయా జిల్లాల కలెక్టర్లతో గురువారం సచివాలయంలోని తన ఛాంబర్‌లో మంత్రి ఉన్నతస్ధాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రకృతి విపత్తులతో నష్టం జరిగిన తర్వాత స్పందించే దానికంటే నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు.హైదరాబాద్ తరహాలోనే రాష్ట్ర స్దాయిలో ప్రధానంగా వరద ప్రభావిత ప్రాంతాలలో చేపట్టవలసిన చర్యలు, విపత్తుల నిర్వహణా విభాగం బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై హైడ్రా కమీషనర్ , అగ్నిమాపక డిజీ, విపత్తుల నిర్వహణ కమీషనర్ , కమాండ్ కంట్రోల్ సెంటర్ డైరెక్టర్ , నీటిపారుదల, ఆర్ అండ్ బి, ఆరోగ్య శాఖల కమీషనర్లతో ఉన్నత స్ధాయి కమిటీని ఏర్పాటు చేశామని, ఈ కమిటీ వారం రోజుల్లో నివేదిక ఇస్తుందని కమిటీ నివేదిక ప్రకారం చర్యలు చేపడతామని తెలిపారు.ఈ ఏడాది వర్షాకాల సీజన్ అనుకున్నదానికంటే 15 రోజుల ముందుగానే వచ్చిందని, దీనిని దృష్టిలో పెట్టుకొని జిల్లా కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని, అన్ని విభాగాలతో సమన్వయం చేసుకొని ప్రకృతి వైపరీత్యాల ప్రభావం వీలైనంతవరకు తగ్గించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. గోదావరి, కృష్ణా నదీ పరీవాహక ప్రదేశాలలో జూలై, ఆగష్టు, సెప్టెంబర్ నెలల్లో హఠాత్తుగా వచ్చే వర్షాలతో ఊహించని వరదలు వస్తున్నాయని చెప్పారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఇప్పటి నుంచే పకడ్బందీ చర్యలు తీసుకోవాలని చెప్పారు.ముఖ్యంగా పరీవాహక ప్రాంతాల్లోని నివాసితులను గుర్తించి వారిని అక్కడి నుంచి శాశ్వతంగా తరలించాలన్నారు.వారికి ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇచ్చే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.గత ఏడాది గోదావరి పరీవాహక ప్రాంతాల్లో తక్కువ సమయంలో ఎక్కువ వర్షం పడడం వల్ల నష్టం ఎక్కువగా జరిగిందని ఈసారి కూడా అటువంటి పరిస్ధితి ఎదురైతే నష్టాన్ని తగ్గించే విధంగా ముందస్తుగా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. రెవెన్యూ విపత్తుల నిర్వహణా శాఖ మూసపద్దతికి స్వస్తి చెప్పి మారుతున్న పరిస్ధితులకు అనుగుణంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని అన్ని శాఖలతో సమన్వయంతో పని చేయాలన్నారు. హైదరాబాద్ లోని తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కమాండ్ & కంట్రోల్ సెంటర్ కు, నిర్వహణ మరియు ముందస్తు హెచ్చరికల కోసం అవసరమైన యూజర్ ఐడీలను ఇవ్వాలని , గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఆయా జిల్లాల్లో పరిస్ధితులను బట్టి వరదల కార్యాచరణ ప్రణాళికలను ఈనెల 30వ తేదీలోగా తయారు చేసుకోవాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆపద మిత్ర వాలంటీర్స్,అగ్నిమాపక, విపత్తు నిర్వహణ శాఖ, ప్రత్యేక పోలీస్ విభాగంలోని సహాయంతో తో సామాజిక అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. వరద నియంత్రణ కట్టలు, చిన్న- మధ్య తరహా కాల్వలు, వర్షపు నీటి డ్రెయిన్‌లు మొదలైన వాటిని పరిశీలించి మరమ్మత్తులు చేపట్టాలన్నారు. ప్రతి మండలానికి వరద ప్రతిస్పందన ప్రణాళిక సిద్ధం చేయాలి – ఇందులో ఖాళీ చేయుటకు మార్గాలు, రిలీఫ్ క్యాంపుల ప్రదేశాలు, సంప్రదించవలసిన నెంబర్లు మొదలైనవి ఉండాలన్నారు.బోట్లు, లైఫ్ జాకెట్లు, అత్యవసర, పొడి ఆహార కిట్లు ముందే సిద్ధంగా ఉంచాలన్నారు. ఇరిగేషన్, రెవెన్యూ, పోలీస్, ఆరోగ్య శాఖల సామాన్యంతో పనిచేయాలని కంట్రోల్ రూములు ప్రారంభించాలని చెప్పారు. అత్యధిక ప్రమాద ప్రాంతాలలో స్థానిక రేస్క్యు బృందాలను ఏర్పాటు చేసి, వారికి ఖాళీ చేయుట, తక్షణ స్పందన చర్యలపై శిక్షణ ఇవ్వాలన్నారు. అత్యవసర సమయాల్లో, వరద భద్రత పై తీసుకోవలసిన జాగ్రత్తలపై ప్రజలతో ప్రత్యక్షంగా సమావేశాలు, పబ్లిక్ అడ్రస్ సిస్టంల ద్వారా అవగాహన కల్పించాలన్నారు.మొబైల్ వైద్య బృందాలను, అవసరమైన మందులు, నీటి శుద్ధి మాత్రలు, పారిశుద్ధ్య కిట్లు వంటివి తగిన మొత్తంలో అందుబాటులో ఉంచాలన్నారు. ఈ సమావేశంలో రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్, రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ కమీషనర్ హరీష్, అగ్నిమాపక శాఖ డైరెక్టర్ జనరల్ నాగిరెడ్డి, హైడ్రా కమీషనర్ రంగనాధ్, పంచాయితీరాజ్ కమీషనర్ సృజన, సిపి డిసిఎల్ డైరెక్టర్ ముష్రాఫ్ అలీ, వ్యవసాయ సహకార శాఖ డైరెక్టర్ బి. గోపి. ఐఎండీ అధికారిణి నాగరత్నం, ఆదిలాబాద్ , భద్రాద్రి కొత్తగూడెం, జోగులాంబ గద్వాల్, ములుగు, నిర్మల్, వనపర్తి జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు.