మహదేవపూర్, ముద్ర:
రైతులు ఉద్యాన పంటల సాగు ద్వారా దీర్ఘకాలిక లాభాలతో పాటు మంచి ఆర్థిక ఆదాయం పొందే అవకాశం ఉందని జిల్లా ఉద్యాన శాఖ అధికారి ఎ సునీల్ కుమార్ తెలిపారు.సోమవారం ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో చిట్యాల మండలం, గుంటూరుపల్లి గ్రామంలో రైతులకు ఉద్యాన పంటల సాగుపై అవగాహన మరియు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యాన పంటలు సాగు చేయడం ద్వారా తక్కువ భూమితో ఎక్కువ ఆదాయం పొందే అవకాశం ఉందన్నారు. మార్కెట్‌లో మంచి ధర లభించడంతో పాటు నీటి వినియోగం తక్కువగా ఉండటం వలన రైతులకు ఖర్చులు కూడా తగ్గుతాయని తెలిపారు. పండ్ల తోటలు మరియు కూరగాయల పంటలు రైతులకు నిరంతర ఆదాయాన్ని అందిస్తాయని చెప్పారు. ఉద్యాన పంటల సాగులో చేపట్టాల్సిన వివిధ యాజమాన్య పద్ధతుల గురించి రైతులకు వివరించారు. ముఖ్యంగా సమగ్ర ఉద్యాన పంటల అభివృద్ధి పథకం, ఆయిల్ పామ్ పథకం, ఉద్యాన మిషన్ వంటి పథకాలను రైతులు సద్వినియోగం చేసుకొని లబ్ధి పొందాలని సూచించారు.మండల వ్యవసాయ శాఖ అధికారి శ్రీనివాస్ రెడ్డి యూరియా యాప్ వినియోగంపై రైతులకు విపులంగా వివరించారు. డ్రిప్ కంపెనీ ప్రతినిధులు కుమార్ మరియు పరీక్షిత్ డ్రిప్ సాగు విధానం, దాని వినియోగం మరియు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి రైతులకు వివరించారు.
ఈ కార్యక్రమంలో ఉద్యాన విస్తరణ అధికారి రామాచారి, ఆయిల్ పామ్ ప్రతినిధులు సాయి, ప్రీతం, గవాస్కర్, పరిపూర్ కంపెనీ ప్రతినిధి పూర్ణచందర్, కుమార్ డ్రిప్ కంపెనీ ప్రతినిధి సమ్మయ్య, రైతులు కొంక హనుమంతరావు, పువ్వాటి సత్యనారాయణ, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.