- కాంగ్రెస్ ఇచ్చిన వాగ్ధానాలు నెరవేర్చకపోతే ప్రశ్నిస్తాం
- తెలంగాణలో బీజేపీ ఎదుగుదలను నిలువరిస్తాం
ముద్ర, తెలంగాణ బ్యూరో : ప్రజాసమస్యల పరిష్కారం కోసం రాజీలేని పోరాటం చేస్తామని సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ అన్నారు. రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్ధానాలను నెరవేర్చకపోతే ప్రశ్నిస్తామని అన్నారు. శ్రామికుల దోపిడీ, సామాజిక అణచివేత, సరశీకృత ఆర్ధిక విధానాలపై బలమైన ఉద్యమాలను నిర్మిస్తామన్నారు. తెలంగాణలో మతోన్మాద బీజేపీ విధానాలను ఎండగడుతూ ఆ పార్టీ ఎదుగుదలను నిలువరిస్తామని ఆయన చెప్పారు. ఈ మేరకు బుధవారం హైదరాబాద్ లోని ఎంబీ భవన్ లో మాజీ ఎమ్మెల్సీ చేరుపల్లి సీతారాములు, పార్టీ సీనియర్ నేతలు టి జ్యోతి, టి సాగర్, ఎండీ అబ్బాస్, మల్లు లక్ష్మి, బండారు రవికుమార్ తో కలిసి మీడియాతో జాన్ వెస్లీ మాట్లాడారు.. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అనేక హామీలిచ్చిందని చెప్పారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం తప్ప ఇతర హామీలేవీ అమలు కావడం లేదన్నారు. విద్య,వైద్యం వ్యాపారంగా మారిందనీ, సామాన్యులకు అందని ద్రాక్షగా ఉందన్నారు. ఇచ్చిన హామీ ప్రకారం ఉద్యోగాలు ఇవ్వలేదని విమర్శించారు.
దావోస్ పర్యటనలో పెట్టుబడులు వచ్చాయంటూ రేవంత్‌రెడ్డి ఊదరగొడుతున్నారనీ, గతంలో కేటీఆర్ కూడా అదే చేశారని అన్నారు. ఫోర్త్ సిటీలో రియల్ ఎస్టేట్ వ్యాపారం జరిగేందుకు దోహదపడుతుందని వివరించారు. ఆ పెట్టుబడులతో పరిశ్రమలను స్థాపించి ఉద్యోగాల కల్పనపై స్పష్టత లేదన్నారు. రాష్ట్రంలో అత్యధికమంది కార్మికులు, అసంఘటిత కార్మికులున్నారని చెప్పారు. కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఉపాధి హామీ కూలీలకు రోజుకు రూ.400 కూలి, ఏడాదికి 150 పని కల్పిస్తామంటూ హామీ ఇచ్చారని గుర్తు చేశారు. పట్టణ ప్రాంతాలకూ విస్తరిస్తామన్నారని అన్నారు. పార్టీ సొంత శక్తిని పెంచుకోవడానికి మొదటి ప్రాధాన్యత ఇస్తామనీ, ఆ దిశగా కార్యక్రమాలను చేపడతామని చెప్పారు. ప్రజాసమస్యలపై నిరంతరం స్పందిస్తామని వివరించారు. అందరికీ విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు, సామాజిక న్యాయం కోసం పోరాడతామని అన్నారు. పార్టీ పునాదిని పెంచుకోవడం దృష్టిసారిస్తామని చెప్పారు. వామపక్ష శక్తులను ఐక్యం చేస్తామని అన్నారు. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీల విధానాలన్నీ ఒక్కటేనని స్పష్టం చేశారు. ప్రత్యామ్నాయ రాజకీయాలను ముందుకుతెస్తామన్నారు. విద్యావైద్యం ఉచితంగా అందించాల్సిన అవసరముందని చెప్పారు. ఉపాధి అవకాశాలను మెరుగుపర్చాలనీ, సామాజిక న్యాయం అమలు చేయాలని అన్నారు. ప్రత్యామ్నాయ రాజకీయాల కోసం వామపక్షాలను సంఘటితం చేస్తామన్నారు. అణగారిన వర్గాల హక్కుల కోసం, ప్రజలకు న్యాయం జరిగే వరకు ఉద్యమాలను చేపడతామని జాన్ వెస్లీ చెప్పారు.