రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ సంచలన ఆదేశాలు
భూ వివాదం కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు చర్యలు
ముద్ర, తెలంగాణ బ్యూరో :
రాజ్యాంగబద్ధమైన కమిషన్ ఆదేశాలను బేఖాతరు చేసిన నల్లగొండ జిల్లా తిరుమలగిరి సాగర్ తహసీల్దార్ అనిల్ తీరుపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. అధికార గర్వంతో విచక్షణ కోల్పోయి ఓ భూ వివాదం కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన తహసీల్దార్ కు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. వివరాల్లోకి వెళితే.. మండల పరిధిలోని ఒక భూ వివాదంలో ఎమ్మార్వో అనిల్ అత్యుత్సాహం ప్రదర్శించారని.. బాధితుడి పట్ల పక్షపాతంగా, ఏకపక్షంగా వ్యవహరిస్తూ నిబంధనలకు విరుద్ధంగా నిర్ణయాలు తీసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఎమ్మార్వో తీరుతో తీవ్ర అన్యాయానికి గురైన బాధితుడు, న్యాయం కోసం రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించారు. బాధితుడి ఫిర్యాదును స్వీకరించిన హెచ్‌ఆర్‌సీ, ఈ వివాదంపై సమగ్ర విచారణ జరిపి పూర్తిస్థాయి నివేదికను సమర్పించాలని గతంలోనే ఎమ్మార్వో అనిల్‌ను ఆదేశించింది. కమిషన్ ఆదేశాలను ఏమాత్రం లెక్కచేయని ఎమ్మార్వో, గడువు ముగిసినా నివేదికను సమర్పించకుండా కాలయాపన చేశారు. ప్రభుత్వ అధికారి అయి ఉండి, ఒక బాధ్యతాయుతమైన కమిషన్ ఆదేశాలను బేఖాతరు చేయడంపై హెచ్‌ఆర్‌సీ తీవ్రంగా పరిగణించింది. తహసీల్దార్ అనిల్ నిర్లక్ష్య వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేసిన కమిషన్, చివరకు ఆయనపై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. వెంటనే ఎమ్మార్వో అనిల్‌ను అరెస్ట్ చేసి తమ ముందు ప్రవేశపెట్టాలని పోలీసు శాఖకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇలాంటి కేసుల్లో వివరణ కోరడం పరిపాటి, కానీ నేరుగా ఒక ఎమ్మార్వోపై అరెస్ట్ వారెంట్ జారీ కావడంతో జిల్లా యంత్రాంగంలో ఒక్కసారిగా వణుకు మొదలైంది. బాధ్యతారాహిత్యంగా వ్యవహరించే అధికారులకు ఈ ఘటన ఓ వార్నింగ్‌గా హెచ్చరికగా నిలుస్తుందని ప్రజలు భావిస్తున్నారు.