Take a fresh look at your lifestyle.

స్పీకర్ తీర్పుపై హైకోర్టును ఆశ్రయిస్తాం-కేంద్ర మంత్రి బండి సంజయ్

కాంగ్రెస్ కండువా కప్పుకుని, ఎంపీగా పోటీ చేసినా స్పీకర్ కు కనబడలేదా..?
దానం, కడియంకు క్లీన్ చిట్ ఇవ్వడం దారుణం
పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించేలా స్పీకర్ తీర్పు

ముద్ర, తెలంగాణ బ్యూరో :

రాజ్యాంగ వ్యవస్థలను కాంగ్రెస్ తన కార్యాలయంలో బంధించాలని చూస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలంటే కాంగ్రెస్ పార్టీని బంగాళాఖాతంలో విసిరేయాలని ఆయన పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి, కాంగ్రెస్ కండువా కప్పుకుని, ఆ పార్టీ తరపున ఎంపీగా పోటీ చేసినా అనర్హత వేటు పడకపోవడం సిగ్గుచేటని సంజయ్ విమర్శించారు. గాంధీ భవన్‌లో ఉంటూ కాంగ్రెస్ తరపున ప్రచారం చేస్తున్నా వారు పార్టీ ఫిరాయించలేదని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన విషయం నిజం కాదా? అని ఆయన ప్రశ్నించారు. పార్టీ ఫిరాయింపుల కేసులో ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరిలపై దాఖలైన అనర్హత పిటిషన్లను అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ డిస్మిస్ చేయడాన్ని బండి సంజయ్ తప్పుబట్టారు. ఈ నిర్ణయం ప్రజాస్వామ్యానికే గొడ్డలి పెట్టు అన్నారు. శాసన వ్యవస్థే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని ఆరోపించారు. బుధవారం ఆయన మీడియాకు ప్రకటన విడుదల చేశారు. స్పీకర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ తాము హైకోర్టును ఆశ్రయిస్తామని బండి సంజయ్ స్పష్టం చేశారు. ‘న్యాయ వ్యవస్థపై మాకు పూర్తి నమ్మకం ఉంది. గతంలో బెంగాల్‌లో కూడా ఇలాంటి తీర్పు వస్తే అక్కడి హైకోర్టు మొట్టికాయలు వేసింది. తెలంగాణలోనూ ఫిరాయింపుదారులకు న్యాయస్థానం చెంప చెళ్లుమనేలా తీర్పు ఇస్తుందని ఆశిస్తున్నాం’ అని ఆయన పేర్కొన్నారు. ఈ అప్రజాస్వామిక నిర్ణయాలపై ప్రజాస్వామ్య వాదులంతా నోరు విప్పాలని ఆయన కోరారు. ఈ మేరకు ఆయన తన ఎక్స్ ఖాతా వేదికగా ఎంపీ ఎన్నికల సమయంలో దానం కాంగ్రెస్ నుంచి పోటీ చేసినట్లు ఎలక్షన్ కమిషన్ వెబ్‌సైట్‌లోని ఆధారాలను షేర్ చేశారు. ‘కన్నతల్లే బిడ్డను చంపడం ఎంత పాపమో, రక్షించాల్సిన శాసన వ్యవస్థే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడం అంతకంటే పెద్ద పాపం’ అని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. స్పీకర్ తీర్పు ఫిరాయింపులను ప్రోత్సహించేలా ఉందని వ్యాఖ్యానించారు. శాసనసభ స్పీకర్ స్వతంత్రంగా వ్యవహరించాలి తప్ప, ‘డూప్లికేట్ గాంధీ కుటుంబానికి’ తాబేదారులా వ్యవహరించకూడదని బండి సంజయ్ ఘాటుగా వ్యాఖ్యానించారు.

Leave A Reply

Your email address will not be published.