- జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్
ముద్ర ప్రతినిధి, ఆదిలాబాద్: ప్రజల ఆర్థిక రక్షణకై ఆదిలాబాద్ జిల్లా పోలీసులు మరియు బ్యాంకు అధికారులతో ఈరోజు పోలీసు హెడ్ క్వార్టర్స్ నందుగల ముఖ్య సమావేశ మందిరంలో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అధ్యక్షతన సంయుక్త సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లాలోని అన్ని ప్రధాన బ్యాంకుల ముఖ్య అధికారులు మరియు రీజనల్ అధికారులు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ప్రజలు ఎంతగానో నమ్ముతూ బ్యాంకుల నందు తమ డబ్బులు నగదు బంగారు ఆభరణాలు సురక్షితంగా ఉంటాయని నమ్మి పోలీసు వ్యవస్థపై నమ్మకంతో ఉంటారని దానిని ఓమ్ము చేయకుండా కలిసికట్టుగా పనిచేస్తూ నేరాల నియంత్రణకు కృషి చేద్దామని జిల్లా ఎస్పీ పిలుపునిచ్చారు. ముఖ్యంగా బ్యాంకు లాకర్ల నందు ఏటీఎంల నందు బ్యాంకు చెస్టుల నందు అధునాతన సాంకేతిక పరిజ్ఞానం కలిగిన సెన్సార్ లను సీసీటీవీ కెమెరాలను అలారం వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఈ అలారం వ్యవస్థ బ్యాంక్ అధికారులకు దగ్గర్లో ఉన్న పోలీసు అధికారులకు వచ్చే విధంగా చూడాలన్నారు. నెలకు ఒకసారి ఏటీఎంలో వద్ద బ్యాంకుల వద్ద భద్రతా చర్యలు విషయంపై సెల్ఫ్ ఆడిట్ చేసుకుంటూ పర్యవేక్షిస్తూ ఉండాలని సూచించారు. రాత్రి సమయాలలో ప్రత్యేకంగా బ్యాంకుల వద్ద ఏటీఎం ల వద్ద గస్తీ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఏటీఎంల వద్ద సెక్యూరిటీ గార్డులను ఏర్పాటు చేసుకోవడం మంచిదని సూచించారు. అధిక మొత్తంలో నగదు తరలించే సమయంలో వీలైనంత సెక్యూరిటీ సిబ్బందిని అప్రమత్తంగా ఉండే వారిని నియమించుకోవాలని సూచించారు. జాతీయ రహదారితో ఉన్న ఏటీఎం ల వద్ద ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడం జరిగిందని దానితోపాటు వారాంతపు సమయంలో ఎక్కువ నగదు ఉండకుండా బ్యాంకు నియమాలను అతిక్రమించకుండా తగు చర్యలను చేపట్టాలని సూచించారు.దొంగలు నవీన పద్ధతులను ఉపయోగించడం తో మరింత అప్రమత్తతో వ్యవహరించాలని సూచించారు. అదేవిధంగా ప్రస్తుత సమాజంలో సైబర్ క్రైమ్ పెరిగిపోయిన కారణంగా మోసాలకు పాల్పడుతున్న వారి అకౌంట్లను ఫ్రీజ్ చేసే విధంగా వెంటనే చర్యలు చేపట్టాలని దీనికి జిల్లా పోలీస్ యంత్రాంగం ప్రత్యేకంగా ఒక సైబర్ క్రైమ్ బృందాన్ని ఏర్పాటు చేసి పర్యవేక్షించడం జరుగుతుందని తెలిపారు. ముఖ్యంగా మ్యూల్ అకౌంట్ ద్వారా సైబర్ నేరాలు జరుగుతున్న కారణంగా వాటిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, వాటి వివరాలను ఎప్పటికప్పుడు పోలీసు అధికారులకు చేరవేస్తూ, అందజేయాలని సూచించారు. మ్యూల్ అకౌంట్ ల సమాచారం వివిధ బ్యాంకుల సమన్వయంతో పోలీసు అధికారులతో కలిసికట్టుగా ఉంటూ నేరాల నియంత్రణ కృషి చేయాలని సూచించారు. ప్రతి ఏటీఎంల నందు రెండు డివిఆర్లు ఉండే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. గ్రామీణ ప్రాంతాలలో ఉన్న బ్యాంకు లు మరియు ఏటీఎంలో ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ నిరంతరం ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తూ ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పి బి సురేందర్ రావు, డీఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి, పట్టణ సిఐలు బి సునీల్ కుమార్, సిహెచ్ కరుణాకర్ రావు, కె ఫణిదర్, బ్యాంకు అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
