Take a fresh look at your lifestyle.

మహిళా రిజర్వేషన్లకు ముహూర్తం ఫిక్స్…?

నియోజకవర్గాల పునర్విభజనకు ముందే అమలు
బడ్జెట్ మలి విడత సమావేశాల్లోనే రిజర్వేషన్ల చట్టం
సవరణ బిల్లుకు ఆమోదం తెలిపేందుకు కేంద్రం సన్నద్ధం
అసెంబ్లీ, లోక్ సభల్లో పెరగనున్న మహిళా ప్రాతినిధ్యం

ముద్ర, తెలంగాణ బ్యూరో :

ఏండ్ల నుంచి ప్రధాన డిమాండ్ గా ఉన్న మహిళా రిజర్వేషన్ల చట్టం అమలు దిశగా కేంద్రం వడివడిగా అడుగులు వేస్తోంది. నియోజకవర్గాల పునర్విభజనకు ముందే ఈ చట్టాన్ని అమలు చేయాలని భావిస్తున్నది. పార్లమెంట్ ఆమోదించిన చట్టాన్ని సవరించాలని భావిస్తోన్న కేంద్ర ప్రభుత్వం.. ఏప్రిల్ 2వ తేదీ వరకూ జరగనున్న బడ్జెట్ మలి విడత సమావేశాల్లోనే మహిళా రిజర్వేషన్ చట్టం సవరణ బిల్లును ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతున్నది. ఈ మేరకు సాధ్యాసాధ్యాలు, అవకాశాలను పరిశీలిస్తున్నట్లు కేంద్ర అధికారిక వర్గాలు తెలిపారు. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించడమే లక్ష్యంగా పెట్టుకున్న కేంద్రం ఈ మేరకు కసరత్తు చేస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.

2023లోనే ఆమోదం
మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించే మహిళా రిజర్వేషన్ చట్టం 2023లో ఆమోదం పొందింది. ఈ బిల్లు సెప్టెంబర్ 20న లోక్‌సభలో, సెప్టెంబర్ 21న రాజ్యసభలో ఆమోదం పొందంగా ఆ వెంటనే రాష్ట్రపతి ఆమోదించారు. వాస్తవానికి జనాభా గణన, నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ పూర్తయిన తర్వాతే అమలు చేస్తామని మహిళా రిజర్వేషన్‌ బిల్లులోని నిబంధనలు చెబుతున్నాయి. జనగణన ఆలస్యం కావడం, ఆ తర్వాత నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ ఆలస్యంతో 2029 లోక్‌సభ ఎన్నికల నాటికి ఈ బిల్లు అమల్లోకి వస్తుందని అంచనా వేశారు. కానీ అప్పటి జనగణన, పునర్విభజన ప్రక్రియ కోసం వేచి చూడకుండానే మరో రాజ్యాంగ సవరణ ద్వారా మహిళా రిజర్వేషన్లు అమలు చేసే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.

తెలుగు రాష్ట్రాల్లో పెరగనున్న మహిళా ప్రాతినిధ్యం
మహిళా రిజర్వేషన్ బిల్లు అమల్లోకి వస్తే అసెంబ్లీ, లోక్ సభలో మహిళల ప్రాతినిథ్యం పెరగనుంది. తెలంగాణలో ప్రస్తుతం 119 శాసనసభ స్థానాలు ఉండగా వీటిలో సుమారు 40 శాతం సీట్లు మహిళలకు కేటాయించాల్సి ఉంటుంది. లోక్ సభకు 17 స్థానాలు ఉంటే సుమారు 5-6 సీట్లు మహిళాలకు దక్కనున్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్ లో 175 శాసనసభ స్థానాలు ఉంటే ఇందులో మహిళలకు సుమారు 57-58 సీట్లు, 25 లోక్ సభ స్థానాల్లో 8 మహిళలకు దక్కనున్నాయి. ఇదిలా ఉంటే నియోజకవర్గాల పునర్విభజన జరిగితే రెండు తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాల సంఖ్య పెరగాల్సి ఉంది. ఇలా జరిగితే మహిళల ప్రాతినిథ్యం మరింత పెరిగే అవకాశం ఉంది.

Leave A Reply

Your email address will not be published.