ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్:
గ్రామాలు, పట్టణాల సమగ్ర అభివృద్ధికి “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక” కార్యక్రమం దోహదపడుతుందని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ తెలిపారు.
ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యచరణలో భాగంగా కల్వకుర్తి నియోజకవర్గంలోని తర్నికల్ గ్రామంలో నిర్వహించిన ప్రజా పాలన గ్రామసభకు కలెక్టర్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజల అవసరాలు, స్థానిక సమస్యలను తెలుసుకుని ప్రణాళికలు రూపొందించడం ద్వారానే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఈ 99 రోజుల యాక్షన్ ప్లాన్‌ను మార్చి 6 నుంచి జూన్ 12 వరకు జిల్లాలో పకడ్బందీగా అమలు చేస్తున్నామని వెల్లడించారు.
జిల్లా వ్యాప్తంగా 460 గ్రామపంచాయతీలు మరియు నాగర్ కర్నూల్, కల్వకుర్తి, కొల్లాపూర్, అచ్చంపేట మున్సిపాలిటీల పరిధిలోని 85 వార్డుల్లో గ్రామ సభలను విజయవంతంగా నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ఐదు దశల్లో అమలు చేస్తూ, ఏప్రిల్ 16న మండల స్థాయి, మే 2న నియోజకవర్గ స్థాయి, మే 22న జిల్లా స్థాయి కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. జూన్ 2 రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవంతో ఈ కార్యక్రమానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలిపారు.
విద్య, వైద్య, వ్యవసాయం సహా పది ముఖ్య అంశాలతో రూపొందించిన ఈ ప్రణాళిక గ్రామాల అభివృద్ధికి దోహదపడుతుందని వివరించారు. ప్రజల భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాలను అమలు చేయాలని అధికారులు, ప్రజాప్రతినిధులకు సూచించారు. గ్రామ సభల ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు.
ఈ సందర్భంగా రేషన్ కార్డులు, సన్న బియ్యం, ఇందిరమ్మ ఇళ్లు, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రుణ మాఫీ, ఉచిత బస్సు ప్రయాణం, రూ.500కే గ్యాస్ సిలిండర్ వంటి పథకాల వివరాలను ప్రజలకు తెలియజేస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వ లక్ష్యం నిజమైన లబ్ధిదారులకు ఈ పథకాలు చేరేలా చూడటమేనని స్పష్టం చేశారు.
విద్యా రంగంలో పలు మార్పులు తీసుకొస్తున్నామని తెలిపారు. అంగన్వాడీ నుంచి పదో తరగతి వరకు విద్యార్థులకు అల్పాహారం అందించడంతో పాటు, ఇంటర్మీడియట్ విద్యార్థులకు అల్పాహారం మరియు మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశపెట్టనున్నట్లు చెప్పారు. అదేవిధంగా ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల ప్రమాద భీమా కల్పించే ఇందిరమ్మ ఆర్థిక భీమా పథకాన్ని అమలు చేయనున్నట్లు వెల్లడించారు.
పాఠశాలలు, కళాశాలల్లో గంజాయి, డ్రగ్స్, ఈ-సిగరెట్ల వినియోగంపై జాగ్రత్తలు తీసుకోవాలని, వాటి వల్ల విద్యార్థులు మరియు కుటుంబాలకు కలిగే నష్టాన్ని గుర్తించాలని కలెక్టర్ సూచించారు.
గ్రామాలు, పట్టణాల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులై ఈ 99 రోజుల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ ప్రణాళిక ద్వారా సమగ్ర అభివృద్ధి సాధ్యమై, గ్రామాల పచ్చదనం మరియు ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి శ్రీరాములు, మండల స్థాయి అధికారులు, తర్నికల్ గ్రామ సర్పంచ్ వరలక్ష్మి, ఉపసర్పంచ్, గ్రామ వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు మరియు ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు పాల్గొన్నారు.