మహాదేవపూర్, ముద్ర:
ఆశా కార్యకర్తలు గ్రామ, మండల స్థాయిలో గర్భిణిలు సుఖ ప్రసవాలు జరిగేలా, ఎప్పటికప్పుడు ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తూ మాతా శిశు మరణాలు జరుగకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ కోరారు. ప్రతి ఆసుపత్రిలో ఎంతమందికి వైద్య సేవలు అందిస్తున్నారు, ఏ ప్రాంతాలలో నుండి వైద్య సేవలకు వస్తున్నారని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మంగళవారం టేకుమట్ల మండలం వెలిశాల గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా ఆశా కార్యకర్తలకు ఆశా డే శుభాకాంక్షలు తెలిపారు. ఆశ వర్కర్లు గ్రామస్థాయిలో అందిస్తున్న సేవలు అమూల్యమైనవని అన్నారు. 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఈ నెల 11వ తేదీ వరకు ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, వాటిని పక్కడ్బందీగా అమలు చేయాలని వైద్య సిబ్బందిని కోరారు. అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని ల్యాబొరేటరీని పరిశీలించి, అందుబాటులో ఉన్న సౌకర్యాలను పరిశీలించారు.ఈ కార్యక్రమంలో తహసిల్దార్ స్వరూప రాణి, ఎంపీడీవో అనిత, వైద్యులు డాక్టర్ నాగరాణి, హారిక, సర్పంచ్ తిరుపతి తదితరులు పాల్గొన్నారు.