తప్పిపోయిన పిల్లలు ఇక సేఫ్
నేరస్దులపైనా ఫోకస్
ముద్ర, తెలంగాణ బ్యూరో :
ఈసారి మేడారం జాతరలో కనీవినీ ఎరుగని రీతిలో ఈసారి భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. మేడారం జాతర ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతర. సుమారు రెండు కోట్ల మంది భక్తులు మేడారం సమ్మక్క ,సారలమ్మలను దర్శించుకుని మొక్కలు చెల్లిస్తుంటారు. ఈ నెల 28వ తేది నుంచి 31వ తేది వరకూ మేడారం జాతర అత్యంత వైభవంగా నిర్వహించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం , కనీవినీ ఎరుగని రీతిలో వైభంగా ఏర్పాట్లు చేసింది. కోటికిపైగా జనం నాలుగు రోజుల్లో జాతర దర్శించుకోవడం అంటే భద్రత సైతం అంతే కట్టుదిట్టంగా ఉండాలి. భక్తులను లూటీ చేసే కేటుగాళ్లు, పిల్లలను అపహరించే కిడ్నాపర్స్, మహిళల మెడలో బంగారు ఆభరణాలు టార్గెట్ చేసే దొంగల ముఠా.. ఇలా వీళ్లందరి భారి నుంచి మేడారం జాతరకు రోజూ లక్షలాాదిగా తరలివచ్చే భక్తులను రక్షించాల్సిన తెలంగాణ పోలీసుశాఖపై ఉంది. అందులోనూ రెండేళ్ల క్రితం మేడారం జాతరలో తప్పిపోయిన పిల్లలు వృద్దుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో ఈసారి AIతో పోలీసులు రంగంలోకి దిగారు.
తొక్కిసలాటను ముందే గుర్తించే పాన్ టిల్ట్ కెమెరాలు..
ఓ జాతరలో ఇంతలా ఆర్టీఫీషియల్ ఇంటిలిజెన్స్ ఉపయోగించడం దేశంలోనే ఇది తొలిసారి. మేడారం 2.O పేరుతో ప్రత్యేక హైటెక్ ప్రణాళికతో ముందుకెళ్తున్నారు. డ్రోన్లు, హీలియం బెలూన్లుతొో గగనతలంపై నుంచే మేడారం జాతర పరిసర ప్రాంతాలపై పూర్తిస్దాయి ఏఐ ఆధారిత నిఘా వ్యవస్దను ఏర్పాటు చేశారు. ఫేస్ రికగ్నైజ్ టెక్నాలజీతో నేరగాళ్లను కదలికలను ఇట్టే కనిపట్టడం ద్వారా చొరీలకు చెక్ పెట్టనున్నారు. ఈ జాతరలో టీజీ క్వెస్ట్ అనే AI ఆధారిత డ్రోన్ వ్యవస్దను వినియోగించనున్నారు. ఈ డ్రోన్లు 30 చదరపు కిలోమీటర్ల అటవీ ప్రాంతంతోపాటు , జంపన్న వాగు పరిసర ప్రాంతాల్లో 24గంటలు గస్తీ కాస్తూ నేరస్తులపై నిఘా పెడతాయి. హీలియం బెలూన్లకు పాన్ టిల్ట్ జూమ్ కెమెరాలు అమర్చడం ద్వారా అత్యంత ఎత్తునుంచి జనసమూహాన్ని విశ్లేషించడంతోపాటు,తొక్కిసలాటకు అవకాశం ఉన్న ప్రాంతాలను ముందే గుర్తించి ,వెంటనే కట్రోల్ రూమ్ కు అలర్ట్ పంపిస్తాయి.
మేడారం జాతరంలో పిల్లలు తప్పిపోయే ఛాన్సే లేదు..
గతంలో మేడారం అనుభవాలు దృష్టిలో ఉంచుకున్న పోలీస్ శాఖ,ఈసారి వృద్దులు, పిల్లలు తప్పిపోకుండా పకడ్బంధీ చర్యలు చేపట్టింది. ఒడా ఫోన్ , ఐడియా సహకారంతో జియో ట్యాగింగ్ సిస్టమ్ ను అందుబాటులోకి తెచ్చారు. ఈ జియో ఆధారిత మిస్సింగ్ పర్సన్స్ ట్రాకింగ్ సిస్టమ్ ద్వారా మేడారం సమ్మక్క ,సారలమ్మ జాతరలో తప్పిపోయిన పిల్లలను, వృద్దులను క్షణాల్లో కనిపెట్టేయోచ్చు. మేడారంకు జాతరకు వచ్చే భక్తులకు తాడ్వాయి సమీపంలోని ప్రధాన ద్వారం వద్ద జాతరకు వచ్చిన పిల్లలు, వృద్దుల వివరాలు నమోదు చేసి, జియో ట్యాగ్ ఉన్న తాడును చేతికి కడతారు. పిల్లలు తప్పిపోయారని కంట్రోల్ రూమ్ కు సమాచారం ఇచ్చిన వెంటనే వారికి కట్టిన ట్యాగ్ ను స్కాన్ చేయడం ద్వారా ఎక్కడ ఉన్నారో క్షణాల్లో తెలిసిపోతుంది. అలా మేడారం జాతరలో తప్పిపోయిన వారిని గుర్తించి , వారి తల్లిదండ్రులకు ,బంధువులకు అప్పగిస్తారు. ఒక్కమాటలో చెప్పాలంటే మేడారం ఆలయ పరిసర ప్రాంతాల్లోకి ఒక్కసారి ఎంటరైతే పొరపాటునకూడా తప్పిపోయే ఛాన్సే లేదన్నమాట.
ఫేస్ రికగ్నజ్ టెక్నాలజీతో బాంబు బెదిరింపులకు చెక్..
మేడారం జాతరలో అందుబాటులోకి తేబోతున్న మరో అద్భుతం ఫేస్ రికగ్నజ్ టెక్నాలజీ. ఈ టెక్నాలజీ ద్వారా లక్షలాది భక్తుల సందోహంలో సైతం నేరస్తుల కదలికలను ఇట్టే కనిపెట్టేయొచ్చు. ముఖ్యంగా పార్కింగ్ ప్రదేశాలు, ఆసుపత్రులు వంటి ప్రాంతాల్లో అనుమానిత వ్యక్తులు,వస్తువులను గుర్తించి వెంటనే తగిన చర్యలు తీసుకోవడం ద్వారా పేలుడు పదార్ధాలను సైతం జాతర పరిసర ప్రాంతాల్లోకి చేరకుండా అడ్డుకోవచ్చు. ఎక్కడైనా అనుమానిత వస్తువులు కనిపించిన వెంటనే కంట్రోల్ రూమ్ కు రియల్ టైమ్ అలెర్ట్స్ వెళతాయి. ఇంతలా ఏఐ టెక్నాలజీ ఉపయోగిస్తున్నప్పటికీ ,మేడారంలో విధులు నిర్వహించేందుకు పోలీసుల బలగాల సంఖ్య విషయంలో ఏమాత్రం అశ్రద్ద వహించడంలేదు. ఏకంగా ఆలయపరిసర ప్రాంతాలతోపాటు ,ట్రాపిక్ నియంత్రణ,నేరాల అదుపుకు 13వేల మంది పోలీసు సిబ్బంది , నాలుగు రోజులపాటు మేడారం జాతరలో విధులు నిర్వహిస్తూ,ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు,భక్తులకు అందుబాటులో ఉంటారు.