బోథ్, ముద్ర:
ఆదిలాబాద్ జిల్లాలో పెట్రోల్, డీజిల్ సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. బుధవారం సంబంధిత శాఖల అధికారులు, పెట్రోల్ బంక్ డీలర్లతో నిర్వహించిన జూమ్ వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. ప్రజలకు ఇంధన కొరత తలెత్తకుండా నిల్వలను నిరంతరం పర్యవేక్షిస్తూ, సరఫరా నిలిచిపోకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. వినియోగదారులు అనవసరంగా ఇంధనాన్ని నిల్వ చేసుకునే పరిస్థితి రాకుండా అవగాహన కల్పించడంతో పాటు, కృత్రిమ కొరత సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పౌర సరఫరాల శాఖ అధికారులను ఆదేశించారు. చమురు సంస్థల ప్రతినిధులతో సమన్వయం కొనసాగిస్తూ జిల్లాకు అవసరమైన ఇంధన కోటాను సకాలంలో తెప్పించుకోవాలని డీలర్లకు సూచించారు. జిల్లాలో ఎక్కడా ‘స్టాక్ లేదు’ అనే బోర్డులు కనిపించకుండా చర్యలు తీసుకోవాలని, అత్యవసర సేవల వాహనాలకు ఇంధన సరఫరాలో ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు. పెట్రోల్, డీజిల్ కొరతపై వస్తున్న అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని, ఎలాంటి సమస్యలు లేదా సందేహాల నివృత్తి కోసం కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన టోల్‌ఫ్రీ నంబర్ 1800 425 1939ను సంప్రదించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. ఈ జూమ్ సమావేశంలో జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి నందిని, తహసీల్దార్ శ్రీనివాస్, సంబంధిత అధికారులు, చమురు సంస్థల ప్రతినిధులు, పెట్రోల్ బంక్ డీలర్లు, తదితరులు పాల్గొన్నారు.