– విధి నిర్వహణలో ప్రమాదం… లైన్ మెన్‌కు తీవ్ర గాయాలు
– ఇన్సూరెన్స్ , భద్రత పరికరాలు లేక తీవ్ర ఇబ్బందులు
– మున్సిపల్ కార్మికుల కోసం ప్రత్యేక ప్రమాద ఆర్థిక నిధిని ప్రకటించాలి
– కరీంనగర్ మాజీ మేయర్ , రాష్ట్ర సివిల్ సప్లయ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ సర్ధార్ రవీందర్ సింగ్ డిమాండ్
ముద్ర, కరీంనగర్ :
మున్సిపల్ కార్మికుల భద్రతపై మళ్లీ ప్రశ్నలు లేవనెత్తే ఘటన కరీంనగర్‌లో చోటుచేసుకుంది. విధి నిర్వహణలో భాగంగా విద్యుత్ మరమ్మతులు చేస్తుండగా లైన్ మెన్ శివకృష్ణ ప్రమాదవశాత్తు విద్యుత్ ఘాతానికి గురై తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన బొమ్మకల్‌కు చెందిన శివకృష్ణ అల్గునూరు ప్రాంతంలో పనిచేస్తున్న సమయంలో జరిగింది.
ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే కరీంనగర్ మాజీ మేయర్, రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ మాజీ చైర్మన్, 58వ డివిజన్ కార్పొరేటర్ సర్దార్ రవీందర్ సింగ్ మేయర్ కొలగని శ్రీనివాస్‌తో కలిసి సురక్ష ఆసుపత్రికి చేరుకుని బాధితుడిని పరామర్శించారు. శివకృష్ణ ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకుని, అతనికి మెరుగైన వైద్యసేవలు అందించాలని ఆసుపత్రి సిబ్బందికి సూచించారు.
ఈ సందర్భంగా సర్దార్ రవీందర్ సింగ్ మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులు రోజూ ప్రాణాలను పణంగా పెట్టి విధులు నిర్వహిస్తున్నారని, కానీ వారికి అవసరమైన రక్షణ పరికరాలు, భద్రతా ప్రమాణాలు కల్పించడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. చాలా మంది లైన్ మెన్‌లు ఇన్సూరెన్స్ సదుపాయం లేకుండా పనిచేయడం దురదృష్టకరమని అన్నారు.
“మున్సిపల్ కార్మికుల ప్రాణాలకు విలువ లేదా? కనీస భద్రతా పరికరాలు కూడా అందించకుండా విధుల్లో పెట్టడం బాధ్యతారాహిత్యం” అని ఆయన విమర్శించారు.
మున్సిపల్ కార్మికులందరికీ నాణ్యమైన భద్రతా పరికరాలు — సేఫ్టీ కిట్లు, గ్లవ్స్, హెల్మెట్లు — తక్షణమే అందించాలని, ప్రతి కార్మికుడికి సమగ్ర ఇన్సూరెన్స్ సదుపాయం కల్పించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విధి నిర్వహణలో ప్రమాదాలకు గురైన కార్మికులకు తక్షణ ఆర్థిక సహాయం అందించేందుకు ప్రత్యేక ప్రమాద నిధిని ఏర్పాటు చేయాలని కూడా కోరారు.
పేద కుటుంబాలకు చెందిన కార్మికులు ప్రమాదాలకు గురైతే వారి కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా సంబంధిత అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు.
గాయపడిన శివకృష్ణ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ, బాధిత కుటుంబానికి అవసరమైన సహాయం అందిస్తానని సర్దార్ రవీందర్ సింగ్ హామీ ఇచ్చారు.