Take a fresh look at your lifestyle.

ప్రజల గుండెల్లో జర్నలిస్టులకు సుస్థిర స్థానం

మునీర్ జీవితం ఆచరణీయం

ప్రధాని తీరు ప్రజాస్వామ్యానికి నష్టదాయకం

నాలుగు లేబర్ కోడ్స్ జర్నలిస్టులకు నష్టదాయకమైనవి

ప్రధాన పత్రికల వైఫల్యమే సోషల్ మీడియా విజృంభన

మునీర్ బాభాయ్ పుస్తక పరిచయ సభలో కే. శ్రీనివాసరెడ్డి, చైర్మన్ రాష్ట్ర మీడియా అకాడమీ

ముద్ర, కరీంనగర్ :  ప్రజల పక్షాన నిలిచి, నిష్పక్షపాతంగా పనిచేసినప్పుడే జర్నలిస్టులకు ప్రజల గుండెల్లో స్థానం ఉంటుందని తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ప్రెస్ క్లబ్ – గోదావరిఖని సౌజన్యంతో అక్షర ఫౌండేషన్ ఆధ్వర్యంలో గోదావరిఖని ప్రెస్ క్లబ్ లో మంగళవారం జరిగిన ప్రోలిటేరియన్ జర్నలిస్ట్ మునీర్ బాయ్ పుస్తక పరిచయ సభలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. భారతదేశంలో పెట్టుబడి దారుల చేతుల్లోకి మీడియా రంగం వెళ్లిపోయిందని అన్నారు. గడిచిన 12 సంవత్సరాలలో ప్రధానమంత్రి కనీసం ఒక్క మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేయలేదని ఇది ప్రజాస్వామ్యానికి, ప్రజలకు నష్టదాయకమని పేర్కొన్నారు. జర్నలిజాన్ని నమ్ముకుని జీవితాంతం అన్యాయాన్ని, ఆధిపత్యాన్ని ప్రశ్నిస్తూ, పాలకుల లోపాలను ఎత్తిచూపుతూ ఎన్నో కష్టాలను ఎదుర్కొన్న జర్నలిస్ట్ మునీర్ జీవితం ఆదర్శప్రాయమని పేర్కొన్నారు. నిర్భయంగా, ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా, వాస్తవ సమాచారాన్ని ప్రజలకు అందించడమే జర్నలిస్టుల కర్తవ్యం అని ఆయన ఉద్భోదించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాలుగు లేబర్ కోడ్స్ వలన సమాజంలో నాలుగవ స్తంభంగా నిలబడిన జర్నలిస్టులను, దుకాణాలలో పనిచేసే కూలీలను ఓకే గొడుగు కిందకు తీసుకువచ్చారని ఆయన ఆవేదన వ్యక్తపరిచారు. జర్నలిస్టుల జీతభత్యాల పెరుగుదలకు మరో సమరశీల పోరాటం నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు అప్రజాస్వామికంగా ఉందని ఆయన ఆవేదన వ్యక్తపరిచారు. ప్రధాన పత్రికా రంగంలో వృత్తి నిబద్ధత కోల్పోవడం వలన సోషల్ మీడియాకు ఆదరణ పెరిగిందని తేల్చి చెప్పారు. సోషల్ మీడియాలో వచ్చే కొన్ని కథనాలు వాస్తవానికి దూరంగా ఉంటున్నాయని, వాటిపై ఏలాంటి తనిఖీ, నియంత్రణ లేకపోవడం వల్ల విచ్చలవిడితనం పెరిగిపోతున్నదని దీనిని కట్టడి చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.

ఆదర్శప్రాయుడు మునీర్

అక్షరాలను నమ్ముకుని జీవితాంతం పనిచేసిన మునీర్ జీవితం ఆచరణీయమని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ కొనియాడారు. ముఖ్యమంత్రిలతో సన్నిహిత సంబంధాలు ఉన్నప్పటికీ సామాన్యమైన జీవితాన్ని గడుపుతూ, ప్రజల కోసమే మునీర్ పనిచేశాడని ఆయన పేర్కొన్నాడు. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని జర్నలిస్టులకు ఇంటి స్థలాలు, ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇస్తామని ఆయన పేర్కొన్నారు. కోల్ బెల్ట్ జర్నలిస్టులు ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలిచారని అన్నారు. మునీర్ జీవితంపై పరిశోధన చేయాలని సూచించారు.

అక్షర ఫౌండేషన్ అధ్యక్షుడు మాదాసి రామమూర్తి అధ్యక్షతన జరిగిన సభలో రామగుండం కార్పొరేషన్ మేయర్ మహంకాళి స్వామి డిప్యూటీ మేయర్ పాతపల్లి ఎల్లయ్య ఐజేయు టీయూడబ్ల్యూజే జాతీయ నాయకుడు నగునూరి శేఖర్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంపత్ కుమార్ జిల్లా అధ్యక్షుడు మల్లా వజుల వంశీ, గోదావరిఖని ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు డి మాధవరావు గడ్డం శ్యామ్ కుమార్ ఇఫ్తా జాతీయ నాయకులు కే స్వామి కార్మిక సంఘాల నాయకులు తుమ్మల రాజిరెడ్డి రియాజ్ అహ్మద్ పర్లపల్లి రవి ఐ కృష్ణ మల్లికార్జున్ శ్రోతులు కె విశ్వనాథ్ తోకల రమేష్ రచయిత నక్క వెంకట్రావు, పుస్తక సమీక్షను హెచ్ రవీందర్ నిర్వహించారు. అరసం జాతీయ కార్యదర్శి వేల్పుల నారాయణ, ఏలేశ్వరం వెంకటేశ్వర్లు, ప్రజా సంఘాల నాయకులు గాండ్ల శ్రీనివాస్, బక్క రవి, శేఖర్, కోల లక్ష్మణ్, పాలకుర్తి విజయకుమార్, మామిడి సత్యనారాయణ, మనోహర్ రెడ్డి, సుధాకర్ రావు, జేవి రాజు,శ్రీపతి రాజగోపాల్,మైనార్టీ నాయకులు హమీద్, మాల మహానాడు నాయకులు మర్రి ఐలయ్య, పిట్టల వెంకటి, నంది నరేష్, ప్రజానాట్యమండలి కళాకారులు కన్నం లక్ష్మీనారాయణ, చీకటి అంజయ్య, ఎజ్జ రాజయ్య, దయా నర్సింగ్ జనగామ రాయనర్స్ పద్మ రమ తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.