ముద్ర ప్రతినిధి, నిర్మల్:
శ్రీ రామ నవమి సందర్భంగా నిర్వహించే శోభాయాత్రలు ప్రశాంతంగా జరిగేలా భారీ బందోబస్తు ఏర్పాటు చేయాలని ఎస్పీ జానకి షర్మిల ఆదేశించారు.సున్నితమైన ప్రాంతాల్లో ప్రత్యేక పహారా – డ్రోన్ కెమెరాలతో పర్యవేక్షణ చేయాలన్నారు. ఎస్పీ జానకి షర్మిల, ఎ ఎస్ పి సాయి కిరణ్ తో కలిసి జిల్లా పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ల అధికారులతో జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్యంగా శ్రీరామ నవమి శోభాయాత్రల ఏర్పాట్లపై చర్చించారు. శ్రీరామ నవమి పురస్కరించుకుని జిల్లాలో జరిగే శోభాయాత్రలు ప్రశాంత వాతావరణంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా నిర్వహించేందుకు పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రధానంగా సున్నిత ప్రాంతాల్లో ప్రత్యేక పహారా ఏర్పాటు, సీసీ కెమెరాల ద్వారా నిరంతర పర్యవేక్షణ, ట్రాఫిక్ నియంత్రణ కట్టుదిట్టంగా అమలు చేయాలని సూచించారు. శోభాయాత్రల రూట్ మ్యాప్ ను ముందుగానే ఖరారు చేసి సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. డ్రోన్ కెమెరాల ద్వారా పర్యవేక్షణ, రూట్ మార్చ్‌లు నిర్వహించడం ద్వారా భద్రతను మరింత బలోపేతం చేయాలని అధికారులకు ఆదేశించారు.