మహాదేవపూర్, ముద్ర:
వసతి గృహాల్లోని విద్యార్థుల విద్యా ప్రమాణాలు పెంచడానికి ఉపాధ్యాయులు కృషి చేయాలని కాటారం మండలం మేడిపల్లి గ్రామంలోని గిరిజన ఆశ్రమ పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన సందర్బంగా జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ కోరారు. పాఠశాల ఆవరణ, తరగతి గదులు, విద్యార్థుల వసతి గృహం మరియు భోజన శాలను పరిశీలించారు.
పాఠశాలలో విద్యార్థులకు అందవలసిన సదుపాయాలు, మౌలిక వసతులు, పరిశుభ్రత, ఆహార నాణ్యత వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. విద్యార్థులతో ప్రత్యక్షంగా మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు.
అనంతరం పాఠశాల వసతి గృహం నిర్వహణ, సిబ్బంది కొరత, మౌలిక సదుపాయాల పరిస్థితి తదితర అంశాలపై వివరాలు తెలుసుకున్నారు. విద్యార్థుల హాజరు శాతం పెంపు, బోధన నాణ్యత మెరుగుదల, వసతి గృహాల్లో శుభ్రత పాటించడం, పోషకాహారం సమయానికి అందించడం వంటి విషయాల్లో సిబ్బందికి పలు సూచనలు చేశారు. పాఠశాలల్లో గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్య అందేలా ప్రతి ఒక్కరు కృషి చేయాలని, చిన్న చిన్న సమస్యలను వెంటనే పరిష్కరించేలా అధికారులు కృషి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ బాబు, నాయబ్ తహసీల్దార్ రామ్మోహన్, పంచాయతీ కార్యదర్శి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.