- స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే మల్ రెడ్డి.
ముద్ర, ఇబ్రహీంపట్నం:శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని రామాలయాల్లో బాజభజంత్రీలు, వేద మంత్రోచ్ఛారణల మధ్య సీతారాముల కల్యాణాన్ని కన్నులపండుగగా నిర్వహించారు.మేళతాళాలు,భక్తుల రామనామస్మరణతో ఆలయాలు మార్మోగాయి. కల్యాణ వేదికలను సర్వాంగసుందరంగా అలంకరించి సీతారాముల కల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. పలు దేవాలయాల్లో నిర్వహించిన కల్యాణోత్సవంలో ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని తొర్రుర్ గ్రామంలో శ్రీశ్రీ రంగనాయక స్వామి మందిరంలో సీతారాముల కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి, తెలంగాణ రోడ్ల సంస్థ చైర్మన్ మల్ రెడ్డి రామ్ రెడ్డిలు స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం మంచాల మండలం రంగాపూర్ గుదిబండ రామలింగేశ్వర స్వామి ఆలయంలో సీతారాముల కల్యాణం, అంబోతు తండా ధర్మయ చెరువు వద్ద బుడియా బాపు పెద్దపూజలో పాల్గొన్నారు. ఇబ్రహీంపట్నం మున్సిపల్ కేంద్రంలోని నడిగడ్డ ఆంజనేయ స్వామి ఆలయంలో సీతారాముల కల్యాణ మహోత్సవం వభవంగ నిర్వహించారు. పట్టణ నలుమూలల నుంచి విచ్చేసిన భక్తులు కల్యాణోత్సవాన్ని తిలకించి తరించారు. పలు దేవాలయాల్లో అన్నప్రసాద వితరణ కార్యక్రమాలు నిర్వహించారు.