ముద్ర ప్రతినిధి, నిర్మల్:
“ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక” కార్యక్రమాన్ని అమలుచేసి గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ప్రగతిని సాధిద్దామని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ పిలుపునిచ్చారు. ఇటీవల ఎన్నికైన గ్రామ సర్పంచులు, మున్సిపల్ కౌన్సిలర్లకు అవగాహన సదస్సు గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, నిర్మల్, ముధోల్, ఖానాపూర్ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ఏలేటి మహేశ్వర్ రెడ్డి, పవార్ రామారావు పటేల్, వెడ్మ బొజ్జు పటేల్ లతో కలిసి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ అభిలాష అభినవ్ మాట్లాడుతూ ప్రభుత్వం అమలు పరుస్తున్న పథకాలు, కార్యక్రమాలు క్షేత్రస్థాయిలో ప్రజలకు చేరాలనే ఉద్దేశంతో 99 రోజుల ప్రత్యేక ప్రణాళికను ప్రారంభించిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, ప్రజలంతా పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ప్రత్యేక ప్రణాళికలో భాగంగా జిల్లాలో పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టామన్నారు. వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి ప్రజల్లో ఉన్న అనారోగ్య సమస్యలను తీర్చేందుకు కృషి చేస్తామన్నారు. ప్రజా ప్రతినిధులందరికీ పంచాయతీరాజ్, మున్సిపల్ చట్టాలపై అవగాహన ఉండాలని తెలిపారు. ప్రజా ప్రతినిధులు ప్రజలకు అందుబాటులో ఉంటూ ఎప్పటికప్పుడు స్థానిక సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని తెలిపారు. నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజా ప్రతినిధులుగా ప్రజలకు సేవ చేసే అవకాశం లభించడం గొప్ప విషయమన్నారు. ప్రజల సమస్యలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ పరిష్కరించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు వెంకటేశ్వర్లు, కిషోర్ కుమార్, భైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, ఆర్డీఓ రత్నకళ్యాణి, నిర్మల్ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ లు అప్పాల కావ్య, అప్పాల గణేష్ చక్రవర్తి, భైంసా మున్సిపల్ చైర్మన్ మున్సిపల్ దత్తాత్రి, జిల్లా గ్రంథాల సంస్థ చైర్మెన్ సయ్యద్ అర్జుమంద్ అలీ, డిఎల్ఎస్ఎ సెక్రటరీ రాధిక, సర్పంచ్ లు, మున్సిపల్ కౌన్సిలర్ లు, ఇతర ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.