- బీఆర్ఎస్ వి శత్రుదేశం చర్యలు.
- పక్క రాష్ట్రంలో రాష్ట్రానికి ఏమైనా సమస్య వస్తే అన్నీ పార్టీలు కలిసి వస్తాయి.
- తెలంగాణలో కూడా ప్రతిపక్షాలు కలిసి రావాలి.
- త్వరలో నామినేటెడ్ పోస్టుల భర్తీ.
- మీడియాతో మంత్రి పొన్నం.
ముద్ర, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో బీఆర్ఎస్ నేతలు ప్రతిపక్ష బాధ్యతలు వదిలి.. శత్రుదేశంగా సొంత రాష్ట్రానికి నష్టం కలిగేలా చేస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. పక్క రాష్ట్రంలో రాష్ట్రానికి ఏమైనా సమస్య వస్తే అన్నీ పార్టీలు కలిసి వస్తాయన్నారు.తెలంగాణలో కూడా ప్రతిపక్షాలు రాష్ట్ర ప్రయోజనాల కోసం కలిసి రావాలని పిలుపునిచ్చారు. ఆదివారం గాంధీభవన్‌లో మంత్రి పొన్నం అధ్యక్షతన హైదరాబాద్ జిల్లా కాంగ్రెస్ నేతల సమావేశం జరిగింది. అంతకు ముందు ఆయన మీడియాతో మాట్లాడారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఢిల్లీలో దోస్తీ.. గల్లీలో కుస్తీలాగా వ్యవహరిస్తున్నాయని వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రయోజనాల కోసం మీరు ఏం చేశారని బీఆర్ఎస్ నేతలను ప్రశ్నించారు. బాధ్యతారహితంగా వ్యహరించినందుకు ఆ పార్టీకి ప్రజలు సున్నా సీట్లు ఇచ్చారని విమర్శించారు. రాబోయే కాలంలో ప్రజలు బీఆర్ఎస్ ను కనుమరుగు చేస్తారని విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో ప్రజా పాలన ప్రభుత్వం నెల రోజుల్లోపు పడిపోతుందని పిల్లి శాపనార్ధాలు పెడుతున్నారని ప్రతిపక్ష నేతలపై మండిపడ్డారు. ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర చేస్తూ ప్రభుత్వం నిలవదని శాపనార్థాలు పెట్టారని మంత్రి ధ్వజమెత్తారు. ప్రభుత్వ ఉద్యోగులు ప్రజా సమస్యలు పరిష్కారం చేస్తూ ప్రజల సంక్షేమాన్ని ముందుకు తీసుకుపోతుంటే.. బీఆర్ఎస్ ఉద్యోగులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారన్న మంత్రి.. తమ ప్రభుత్వం ఆర్థిక సంక్షోభం ఉన్న సంక్షేమ పథకాలను ఆచరణలో పెడుతున్నామన్నారు. వచ్చే నెల 4న ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సభను విజయవంతం చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రతి ఒక్క నియోజకవర్గం నుంచి జన సమీకరణ చేయాలన్నారు. పార్టీ కోసం కష్టపడిన వారికి ఖాళీగా ఉన్న నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తామన్నారు. దేవాలయ కమిటీలు, మార్కెట్ కమిటీలు ఖాళీగా ఉన్న ఇతర ఏ నామినేటెడ్ పదవులు త్వరలోనే భర్తీ చేస్తామన్నారు. ప్రభుత్వం, పార్టీ సమన్వయం చేసుకోవాలని, సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు.శాతవాహన యూనివర్సిటీ పరిధి హుస్నాబాద్ ఇంజనీరింగ్ కళాశాలలో ఈ విద్యా సంవత్సరం నుంచి తరగతులు ప్రారంభం అవుతాయని మంత్రి పొన్నం వెల్లడించారు. హుస్నాబాద్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ ( ఈసీఈ, సీఎస్ఈ, ఐటీ, ఏఐ) కోర్సుల్లో ఒక్కో విభాగానికి 60 సీట్ల చొప్పున మొత్తం 240 సీట్లు ప్రభుత్వం మంజూరైనట్లు పేర్కొన్నారు. ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ లో రాష్ట్ర స్థాయి ర్యాంక్ ను బట్టి సీటు కేటాయింపు ఉంటుందన్నారు. హుస్నాబాద్ ప్రాంత విద్యార్థులు , సమీప జిల్లాల విద్యార్థులు ర్యాంకును బట్టి కౌన్సిలింగ్ లో హుస్నాబాద్ ఇంజనీరింగ్ కాలేజి కి ప్రథమ ప్రాధాన్యత ఇచ్చి అడ్మిషన్ తీసుకోవాలని కోరారు. ఇంజనీరింగ్ కాలేజీ లో అన్ని రకాల సౌకర్యాలు కల్పించినట్లు తెలిపారు. మొదటి సంవత్సరం అడ్మిషన్ పొందుతున్న విద్యార్థిని, విద్యార్థులకు మంత్రి పొన్నం ప్రభాకర్ అభినందనలు తెలిపారు.