- కాంగ్రెస్ హామీలు రాష్ట్ర ప్రభుత్వమే అమలు చేయాలి.
- కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.
ముద్ర, తెలంగాణ బ్యూరో : కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేసే బాధ్యత తమది కాదని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. కేవలం బీజేపీ ఇచ్చిన హామీలను అమలు చేసే బాధ్యత మాత్రమే తమదని ఆయన స్ఫష్టం చేశారు. కాంగ్రెస్ హామీలను రాష్ట్ర ప్రభుత్వమే అమలు చేయాలన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయాల్సిన బాధ్యత కేంద్రప్రభుత్వానిదేనని కాంగ్రెస్ నేతల వితండ వాదన చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ప్రధాని మోడీ తెలంగాణకు ఏం ఇచ్చారని, కిషన్ రెడ్డి ఏం తెచ్చారనే విచిత్ర వాదన విడ్డూరంగా ఉందన్నారు. ఇచ్చిన హామీలను కాంగ్రెస్ కచ్చితంగా అమలు చేయాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారంమ ఇందూరు రైతు మహా సమ్మేళన సభలో పాల్గొన్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడారు.. నిజామాబాద్ రైతులు అనేక సంవత్సరాల పోరాటానికి ఫలితం దక్కిందన్నారు. దేశంలోని అనేక రాష్ట్రాల్లో పసుపు పంట సాగు జరుగుతున్నప్పటికీ, జాతీయ పసుపు బోర్డును నిజామాబాద్‌లో ఏర్పాటు చేయడం ఒక గొప్ప పరిణామమని అన్నారు. దేశంలోని రైతాంగానికి అనుకూలంగా పనిచేస్తోన్న మోడీ సర్కార్ వ్యవసాయానికి అవసరమైన విద్యుత్‌ను సమర్ధవంతంగా అందజేస్తుందన్నారు. గతంలో ఎరువుల కోసం రైతులు దుకాణాల వద్ద లైన్లలో నిలబడాల్సివచ్చేదని, నేడు మోదీ ప్రభుత్వం అవసరమైనంత ఎరువును రైతులకు అందిస్తోందన్నారు. మోదీ ప్రభుత్వం యూరియాపై రూ.3500కు పైగా సబ్సీడీ ఇస్తోందున రైతులకు యూరియా కేవలం రూ.267కే లభిస్తోందన్నారు. తెలంగాణ రైతుల విషయంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం ఎప్పటికీ అండగా నిలుస్తోందన్నారు. యూపీఏ ప్రభుత్వం చేయలేకపోయిన పనిని మోదీ ప్రభుత్వం చేసి చూపించిందన్నారు. నిజామాబాద్ రైతులకు పసుపు బోర్డు కల్పించడం ఈ దిశగా ఒక గొప్ప కానుక అని,. మోదీ ప్రభుత్వం తెలంగాణకు ఏం చేసింది?’ అని ప్రశ్నించే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యూపీఏ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులను గమనించాలన్నారు.