పిపిటి సమావేశంలో టెక్నికల్ కమిటీ పరిశీలన…
ముద్ర ప్రతినిధి, జగిత్యాల:
గోదావరి పుష్కరాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. జగిత్యాల జిల్లాలో నిర్వహించనున్న గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై పురోగతిని సమీక్షించేందుకు జిల్లా కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన పిపిటి (PPT) సమావేశంలో మంగళవారం టెక్నికల్ కమిటీ సమగ్ర పరిశీలన నిర్వహించింది.

ఈ పరిశీలనకు ఇంజినీర్-ఇన్-చీఫ్ (జనరల్) ఓ.వి. రమేష్ బాబు, జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ తో కలసి పరిశీలించారు. ఈ సందర్భంగా గోదావరి పుష్కరాల కోసం చేపట్టాల్సిన మౌలిక వసతుల అభివృద్ధి, భద్రతా చర్యలు, రవాణా సౌకర్యాలు, తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య ఏర్పాట్లు వంటి అంశాలపై సమగ్రంగా చర్చించారు.

ముఖ్యంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. అలాగే ఘాట్‌ల అభివృద్ధి పనులు, రహదారి మరమ్మత్తులు, విద్యుత్ సరఫరా, తాత్కాలిక సౌకర్యాల ఏర్పాటు వంటి అంశాలను వేగవంతం చేయాలని టెక్నికల్ కమిటీ సూచించింది. అన్ని శాఖలు సమన్వయంతో పని చేసి పుష్కరాలను విజయవంతంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థల) బి. రాజ గౌడ్, జగిత్యాల ఆర్డీవో మధుసూదన్, ఈ.ఈ.పి.ఆర్. లక్ష్మణ్ రావు, ఈ.ఈ. ఆర్ అండ్ బి శ్రీనివాస్, ధర్మపురి టెంపుల్ ఈవో శ్రీనివాస్, నీటి పారుదల శాఖ అధికారుల, సంబంధిత శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.