Take a fresh look at your lifestyle.

పెబ్బేర్ బైపాస్ లో ఘోర రోడ్డు ప్రమాదం… ఒకరు మృతి

ముద్ర, పెబ్బేరు: రెండు కార్లు అతివేగంగా,నిర్లక్ష్యంగా వెహికిల్స్ నడిపి పరస్పరం ఢీకొని డివైడర్ ఎక్కి మరో బస్సును ఢీ కొట్టాయి.దీంతో ఒక కారులో ఉన్న ఓ వ్యక్తి స్పాట్ డెడ్ అవ్వగా,ప్రైవేటు బస్సులో ప్రయాణించే 30 మందికి తీవ్ర గాయాలు అయిన ఘటన వనపర్తి జిల్లా పెబ్బేరు సమీపంలోని రంగాపూర్ బైపాస్ వద్ద నేషనల్ హైవేపై శుక్రవారం సాయంత్రం జరిగింది.పెబ్బేరు ఎస్సై హరిప్రసాద్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం,పెబ్బేరుకు చెందిన ముష్టి విష్ణు(35),తన కుటుంబంతో, మరో కారులో 8 మంది మహబూబ్నగర్ వైపు వెళ్తున్నారు.అదేవిధంగా హైదరాబాద్లోని వనస్థలిపురానికి చెందిన ఓ పెళ్లి బృందం 40 మంది ప్రైవేటు ట్రావెల్స్లో తిరుపతికి వెళ్తున్నారు.పెబ్బేరు సమీపంలోని రంగాపూర్ బైపాస్లో నేషనల్ హైవే 44పై మహబూబ్నగర్ వైపు వెళ్తున్న రెండు కార్లు అతివేగంగా,అతి నిర్లక్ష్యంగా వాహనాలు నడిపి పరస్పరం ఢీకొట్టుకొని డివైడర్ పైకి ఎక్కి తిరుపతి వైపు వెళ్తున్న పెళ్లి బస్సును ఢీ కొట్టాయి.దీంతో బస్సు డివైడర్ పైకి దూసుకెళ్లింది. ప్రమాదంలో పెబ్బేరు పట్టణానికి చెందిన ముష్టి విష్ణు(35) అక్కడికక్కడే మృతి చెందాడు.అతని భార్య పరిస్థితి విషమంగా ఉంది. కుమారుడికి కాలు విరగగా,ఇద్దరు కుమార్తెలు స్వల్ప గాయాలతో బయట పడ్డారు.అదేవిధంగా మరో కారులో సైతం 8 మందితో వెళ్తున్న కుటుంబ సభ్యులు కూడా గాయాలపాలయ్యారు.బస్సులో తిరుపతికి వెళ్తున్న 30 మంది తీవ్రగాయాల పాలయ్యారు. ప్రమాదం జరిగిన వెంటనే గమనించిన నేషనల్ హైవే పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని ముష్టి విష్ణును, క్షత గాత్రులను హైవే,108 అంబులెన్సుల ద్వారా వనపర్తి జిల్లా ఆసుపత్రికి తరలించారు.ప్రమాదం జరగడంతో ట్రాఫిక్ స్తంభించింది.సమాచారం తెలుసుకున్న పెబ్బేరు పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గురైన వెహికిల్స్ను పక్కకు తొలగించి దాదాపు 3, 4 గంటల పాటు శ్రమించి ట్రాఫిక్ను సరి చేశారు.

Leave A Reply

Your email address will not be published.