Take a fresh look at your lifestyle.

ఖచ్చితమైన సమాచారం ప్రజలకు అందించాలి

  • సమాచార ముఖ్య కమిషనర్ డా.చంద్రశేఖర్ రెడ్డి సూచన.

ముద్ర ప్రతినిధి, మెదక్: జవాబుదారీతనంతో కూడిన చట్టంలో నిబంధనలకు లోబడి ఖచ్చితమైన సమాచారం ప్రజలకు అందించి ప్రభుత్వానికి పౌర సమాచార అధికారులు వారధిగా నిలవాలని రాష్ట్ర సమాచార ముఖ్య కమిషనర్ డా.చంద్రశేఖర్ రెడ్డి సూచించారు.మెదక్ జిల్లాలో సమాచార హక్కు చట్టం పటిష్టంగా అమలు చేయడంలో జిల్లా కలెక్టర్ తీసుకుంటున్న చొరవ అభినందనీయమన్నారు.మంగళవారం మెదక్ సమీకృత కలెక్టరేట్ లో పౌర సమాచార అధికారులతో ఆర్టిఐ యాక్ట్ అమలు, విధి విధానాలపై క్షుణ్ణంగా అవగాహన కల్పించారు.ముఖ్య కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డితోపాటు ఇతర కమిషనర్లు బోరెడ్డి అయోధ్య రెడ్డి, పీవీ శ్రీనివాస్ రావు, మోసిన్ పర్వీన్, వైష్ణవి మేర్ల, దేశాల భూపాల్ హాజరయ్యారు.ఈ సందర్భంగా చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. కమిషనర్లుగా బాధ్యతలు చేపట్టి మొదటిగా మెదక్ జిల్లాకు రావడం జరిగిందన్నారు. సమాచార హక్కు చట్టంపై పౌర సమాచార అధికారులు పూర్తి అవగాహన కలిగి ఉండాలని, ప్రభుత్వ పథకాల అమలు, నిధుల వినియోగం, అవినీతి నిర్మూలనే లక్ష్యంగా సమాచార హక్కు చట్టం అమలులోకి వచ్చిందని తెలిపారు.సెక్షన్లు, సబ్ సెక్షన్లపై క్షుణ్ణంగా చదివి పౌర సమాచార అధికారులు సమగ్ర అవగాహన పెంపొందించుకోవాల్సిన ఉందన్నారు.రాష్ట్రంలో ఉన్న 29 ప్రభుత్వ శాఖలలో 15 శాఖలలో ఏం కేసులు లేకపోవడం హర్షించ దగ్గ విషయంగా పేర్కొన్నారు.136 దేశాలలో చట్టం అమలులో ఉందన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలకు జవాబుదారితనం ఎంత అవసరమో పారదర్శకత అంతే అవసరమన్నారు.గత పది సంవత్సరాల కాలంలో సమాచార కమిషన్ అందుబాటులో ఉంచకపోవడం వల్ల రాష్ట్రంలో 18 వేల కేసులు సమాచార హక్కు చట్టం కమిషన్ దగ్గర పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. ప్రజలు సమాచారం కోసం దరఖాస్తు చేసుకున్న 30 రోజుల్లో సమాచారం అందజేయాలని, ప్రతి ప్రభుత్వ కార్యాలయాల వద్ద సిటిజన్ చార్ట్ బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. సహేతుక కారణాలు చూపించకుండా ఆర్టిఐ ఆక్ట్ దరఖాస్తులను తిరస్కరించకూడదని చెప్పారు. సమాచార హక్కు చట్టం అందుబాటులో ఉంది కాబట్టి అందరూ బాధ్యతగా తీసుకొని వీలైనంత తొందరగా సమాచారం ప్రజలకు అందించాలన్నారు.రాబోవు ఆగస్టు నెలలో పెండింగ్లో ఉన్న కేసులను పూర్తిగా పరిష్కరించి కొత్త దరఖాస్తులు ద్వారా ముందుకు వెళ్ళబోతున్నామని చెప్పారు.రెండు నెలల్లో 30 శాఖల కేసులకు పూర్తిగా పరిష్కరించి జీరో కేసులు ఉండే విధంగా చర్యలు తీసుకున్నామన్నారు. 11 జిల్లాలను ఎంపిక చేసుకుని సమాచార హక్కు చట్టం ద్వారా పౌర సమాచార అధికారులకు అవగాహన పెంపొందించి చట్టంలోని సెక్షన్లు, పూర్తిగా వివరిస్తున్నామన్నారు. అందరికీ సమాచారం అందించేందుకు ముందుకు రావాలన్నారు. 22 జిల్లాల్లో 17 శాఖలు వచ్చే మార్చిలోపు అన్ని కేసులకు పరిష్కార మార్గాలు చూపి సమాచారం అందించే విధంగా చూస్తామన్నారు. మరుగున పడిన వ్యవస్థను నూతన ఉత్సాహంతో ముందుకు తీసుకువచ్చి ప్రజలకు జవాబు దారితనం పెంచడంలో అవగాహన సదస్సు ఎంతో ఉపయోగపడుతుంది అన్నారు.కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ.. జిల్లాలో సమాచార హక్కు చట్టాన్ని పటిష్టంగా అమలయ్యే విధంగా అధికారులకు పలు ఆదేశాలిస్తూ సమావేశాలు నిర్వహిస్తూ శాఖల పూర్తి నిబంధనలను అనుసరిస్తూ ప్రజలు ఎటువంటి పరిస్థితుల్లోనైనా సమాచారం కావాలని దరఖాస్తు చేసుకున్నప్పుడు నిబంధనలకు లోబడి సమాచారం అందించే విధంగా ఆదేశాలు జారీ చేస్తున్నామని వివరించారు. ఇతర సమాచార కమిషనర్లు సమాచార హక్కు చట్టంపై నియమ నిబంధనలను పౌర సమాచార అధికారులకు సుదీర్ఘంగా వివరించారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్, అదనపు ఎస్పీ మహేందర్, ఆర్డీవోలు రమాదేవి, మహిపాల్ రెడ్డి, జయచంద్రారెడ్డి, జిల్లాలోని వివిధ శాఖల పౌర సమాచార అధికారులు తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు కలెక్టరేట్ లో వనమహోత్సవంలో భాగంగా అటవీ శాఖ ఆధ్వర్యంలో మొక్కలు నాటారు.

Leave A Reply

Your email address will not be published.