- బడ్జెట్ కేటాయింపులను మాత్రమే మా శాఖ చూసుకుంది.
- నిధుల విడుదల విషయంలో నా సొంత అజెండాలు లేవు.
- రూ.82 వేల కోట్ల ప్రాజెక్టు వ్యయం తర్వాత ఎంత పెంచారో నాకు తెలియదు.
- నిధులు ఎవరికి ఇవ్వాలో ఇరిగేషన్ శాఖ పరిధిలోనే జరిగింది.
- ప్రాజెక్ట్ ఎక్కడ కట్టాలనేది ఆర్థిక శాఖకు ఏం సంబంధం..?
- తుమ్మిడిహట్టి ద్వారా నీటి అవసరాలు తీరవనే రిపోర్టులు వచ్చాయి.
- ప్రత్యామ్నాయం కోసమే కాళేశ్వరాన్ని ఎంపిక చేశాం.
- టెక్నికల్ అంశాలన్ని పరిశీలించాకే కాళేశ్వరం నిర్మాణ నిర్ణయం.
- కాళేశ్వరం కమిషన్ ముందు ఎంపీ ఈటల వివరణ.
ముద్ర, తెలంగాణ బ్యూరో : కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణ విషయంలో ప్రభుత్వ ప్రాధాన్యతల ఆధారంగా, కేబినెట్ నిర్ణయాల మేరకే అప్పటి ఆర్థికశాఖ మంత్రిగా నిధులు విడుదల చేశానని మాజీ మంత్రి, మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలలో అవకతవకలపై కాళేశ్వరం కమిషన్ హైదరాబాద్ లోని బీఆర్కే భవన్‌లో నిర్వహించిన బహిరంగ విచారణకు ఈటల హాజరయ్యారు. కమిషన్ చైర్మన్ పీ చంద్రఘోష్ అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. విచారణ అనంతరం బయటకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. నిధుల విడుదల విషయంలో తన సొంత అజెండాలు ఏమి లేవని అదే విషయాన్ని కాళేశ్వరం కమిషన్‌కు ఎదుట స్పష్టం చేశానని అన్నారు. నిధులు ఎవరికి ఇవ్వాలో కూడా ఇరిగేషన్ శాఖ పరిధిలోనే జరిగిందని అన్నారు.బడ్జెట్ కేటాయింపులను మాత్రమే ఆర్థిక శాఖ చూసుకుందని ఈటల రాజేందర్ తెలిపారు.
- ప్రాజెక్టు నిర్మాణానికి ఆర్ధిక శాఖకు సంబంధం లేదు.
కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎక్కడ కట్టాలనేది ఆర్థిక శాఖకు సంబంధం లేదని ముందుగా రూ.82 వేల కోట్ల వ్యయంగా అంచనా వేశారని తెలిపారు.ఆ తర్వాత ఆ అంచనాలు ఎంతకు పెరిగాయో తనకు తెలియదని అన్నారు.ప్రాజెక్ట్ డీపీఆర్ కోసం రూ.595 కోట్లు ఇచ్చిన విషయం కూడా తనకు తెలియదని స్పష్టం చేశారు.తెలంగాణ రాష్ట్రానికి తాను మొట్టమొదటి ఆర్థిక శాఖ మంత్రిగా పని చేశారని, తెలంగాణ సమాజానికి 25 ఏళ్లుగా తాను సుపరిచితుడినని అన్నారు. 2016 తుమ్మిడిహట్టి ప్రాజెక్ట్ అంచనా వ్యయం రూ.16,500 కోట్లని.. ఆ తరువాత ప్రాజెక్ట్ వ్యయం రూ.38 వేల కోట్లకు పెరిగిందని తెలిపారు. తుమ్మిడిహట్టి ద్వారా నీటి అవసరాలు తీరవనే రిపోర్టులు వచ్చాయని అన్నారు.ప్రత్యామ్నాయం చూడాలని ప్రభుత్వం కోరడంతో కాళేశ్వరాన్ని ఎంపిక చేశారని పేర్కొన్నారు. నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావు చైర్మన్‌గా కేబినెట్ సబ్ కమిటీ వేశారని అందులో తాను తుమ్మల నాగేశ్వర్ రావు సభ్యులుగా ఉన్నామని అన్నారు.టెక్నికల్ కమిటీ రిపోర్ట్ ప్రకారం మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల వద్ద బ్యారేజీలు నిర్మించాలని నిర్ణయించామని తెలిపారు. అనంతరం కేబినెట్ కూడా మొత్తం బ్యారేజీల నిర్మాణానికి ఆమోదం తెలిపిందని అన్నారు. టెక్నికల్ అంశాలన్ని పరిశీలించాకే కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించాలని నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ సమాచారం అంతా కేసీఆర్, హరీశ్‌రావుల వద్దే ఉందని ఈటల పేర్కొన్నారు.
- ఇది కక్షసాధింపు చర్య.
రాజకీయ లబ్ధి కోసమే ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఈటల ఆరోపించారు.కాళేశ్వరం అక్రమాలతో తనకు ఎలాంటి సంబంధమూ లేదని పునరుద్ఘాటించారు.గతంలో ఆర్థిక శాఖ మంత్రిగా డబ్బు కేటాయించడం మాత్రమే తన పని అని స్పష్టం చేశారు.నోటీసులు ఎవరికి ఇవ్వాలో కూడా తెలియదా అంటూ కమిషన్‌ను ఈటల తప్పుబట్టారు. కాళేశ్వరం విచారణ వెనుక నిజాయితీ, చిత్తశుద్ధి ఏమాత్రం కనిపించడం లేదని వ్యాఖ్యానించారు. కనీస ప్రాథమిక విచారణ చేయకుండానే తనకు నోటీసులు ఎలా ఇస్తారని నిలదీశారు.
- కేబినెట్‌కు బాస్ కేసీఆర్.
కాళేశ్వరానికి మొదట్లో రూ.63 వేల కోట్ల అంచనా వేయగా.. క్రమంగా ఆ వ్యయం రూ.83 వేల కోట్లకు పెరిగిందని, చివరికి ఎంతైందో తనకు తెలియదని అన్నారు. కాళేశ్వరం విలువ, ఖర్చుతో ఆర్థిక శాఖకు సంబంధం లేదని కామెంట్ చేశారు. అన్ని విషయాలు ఇరిగేషన్ శాఖతో పాటు కాళేశ్వరం కార్పొరేషన్‌తోనే ముడిపడి ఉన్నాయని స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను తాను కట్టానని కేసీఆరే చాలాసార్లు వేదికలపై చెప్పుకున్నారని అన్నారు. కేబినెట్‌కు బాస్ కేసీఆర్ అని.. నిర్ణయం తీసుకుంది ఆయనేనని కుండబద్దలు కొట్టారు. ఇప్పటికైనా రేవంత్ సర్కార్ వాస్తవ రిపోర్టులను బయటపెట్టాలని అన్నారు. ఎంత నష్టం జరిగిందో.. ఎవరు బాధ్యులతో ప్రభుత్వమే చెప్పాలని ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు.
- ఈటల కమిషన్ కు నిజం చెప్పలేదు : ఎంపీ చామల.
కాళేశ్వరం విచారణకు హాజరైన మాజీ మంత్రి ఈటల రాజేందర్ కమిషన్ ముందు వాస్తవాలు దాచారని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు.బీఆర్ఎస్ పాలనలో అప్పటి ఆర్ధిక శాఖ మంత్రిగా కాళేశ్వరం అవినీతిలో భాగస్వాముడైన ఆయన నిజాలు చెప్పి ఉంటే గౌరవంగా ఉండేదన్నారు.శుక్రవారం గాంధీభవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు.కాళేశ్వరం ప్రాజెక్టు రీడిజైన్‌కు కేబినెట్ ఆమోదంతో జరిగిందని ఈటల కమిషన్ కు తప్పుడు వివరణ ఇచ్చారన్నారు.వాస్తవానికి ఆ ప్రాజెక్టు డిజైనింగ్ అంతా ఎవ్వరి ప్రమేయం లేకుండా కేసీఆర్ ఫామ్‌హౌస్‌లోనే జరిగిన విషయం చెబితే బాగుండు అని విమర్శించారు.బీఆర్ఎస్ హయాంలో మంత్రులకు స్వతంత్ర నిర్ణయాధికారం లేదనే విషయాన్ని గుర్తు చేశారు. ఈటల ఆర్థిక మంత్రిగా నామమాత్రంగానే ఉన్నారని ఆరోపించారు.