ముద్ర ప్రతినిధి, నిర్మల్:
ఇటీవలి మున్సిపల్ ఎన్నికల్లో తమ పార్టీ కొన్ని ప్రధాన స్థానాల్లో ఓటమి పాలైనా బిజెపిని ఓడించేందుకు మైనార్టీ ఓట్ల కోసం ఎం ఐ ఎం పార్టీతో కాంగ్రెస్, బి ఆర్ ఎస్ ఏకమయ్యాయని బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎంఎల్ఏ ఏలేటి మహేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం తమ క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ కేవలం 52 శాతం ఓట్లు మాత్రమే సాధించిందని అన్నారు. దీన్ని బట్టి ప్రజల్లో 48 శాతం ప్రభుత్వం పట్ల అసంతృప్తితో ఉన్నారని స్పష్టం అవుతోందని అన్నారు. కేవలం రెండేళ్ల పాలనలో ఈ స్థాయిలో వ్యతిరేకత పెరిగేందుకు ప్రధాన కారణం తామిచ్చిన హామీల అమలులో విఫలం కావటమేనని అన్నారు. ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతున్న నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల కంటే ముందు అన్ని పార్టీల సహకారంతో మైనార్టీ ఓట్లతో విజయం సాధించి మైండ్ గేమ్ ఆడుతోందని ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికలతో గ్రామీణ ప్రాంతాల స్థానిక సంస్థల ఎన్నికల కోసం హైప్ కు యత్నించిందని విమర్శించారు. గత ఎన్నికలతో పోలిస్తే బీజేపీ ఓటు బ్యాంకు గణనీయంగా పెరిగిందని అన్నారు. నిర్మల్ పట్టణ ఓటింగ్ లో కాంగ్రెస్, బి ఆర్ ఎస్, ఎంఐఎం సాధించిన ఓట్లు 27 వేలు కాగా, బీజేపీ సాధించిన ఓట్లు 20,335 చూస్తే బీజేపీ కానున్న ఆదరణ అర్థం అవుతోందన్నారు. ఆ పార్టీల పోల్ మేనేజ్మెంట్, అధికార దుర్వినియోగం, డబ్బుల పంపిణీ, మైనార్టీ ఓట్ల కోసం ఇతర పార్టీలతో కుమ్మక్కు వల్లే గెలుపు సాధ్యమైందన్నారు. ఫలితాల పరంగా ఆ పార్టీలు గెలిచినా నైతిక విజయం బీజేపీదేనని అన్నారు. గత ఎన్నికల్లో నిర్మల్ లో కేవలం 1 వార్డులో గెలిచిన బీజేపీ ఇపుడు 13 కు పెరగడం పార్టీకి ప్రజల్లో ఉన్న ఆదరణకు నిదర్శనమని అన్నారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే నల్ల ఇంద్రకరణ్ రెడ్డి, రావుల రామ్ నాథ్, సాదం అరవింద్ తదితరులున్నారు.