మహిళల ఆరోగ్య సంరక్షణకు జిల్లాలో పకడ్బందీగా ప్రత్యేక 100 రోజుల వైద్య సేవల కార్యక్రమం అమలు చేయాలి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి వెల్లడి
(ముద్ర, ఉమ్మడిరంగారెడ్డి జిల్లా ప్రతినిధి):

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రత్యేకించి మహిళా ఉద్యోగుల ఆరోగ్య సమస్యల పరిష్కారం కొరకు మెగా హెల్త్ క్యాంపును నిర్వహించనున్నట్లు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి తెలిపారు. ఈ అవకాశాన్నిఅందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మహిళా దినోత్సవ కార్యక్రమాలు ,మహిళల ఆరోగ్యంపై వందరోజుల ప్రత్యేక ఆరోగ్య సేవా కార్యక్రమాలు, జిల్లాలో హెచ్ పి వి టీకా కార్యక్రమం నిర్వహణపై సోమవారం కలెక్టర్ నారాయణరెడ్డి సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని కొంగరకలాన్ కలెక్టరేట్ ప్రాంగణంలో మహిళా ఉద్యోగులకు, ఇతరులకు మెగా హెల్త్ క్యాంపు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ వైద్య శిబిరంలో మహిళలకు ప్రత్యేక స్క్రినింగ్ పరీక్షలు, వైద్య సేవలు అందించబడతాయన్నారు.
మహిళల వైద్య సేవల కోసం జిల్లాలో 100 రోజుల ప్రత్యేక కార్యక్రమం మొదటి దశలో మాతృ ఆరోగ్యము శిశు ఆరోగ్యము మరియు వృద్ధులు ఆరోగ్యం పై ప్రత్యేక చర్యలు చేపట్టబడుతున్నాయని వెల్లడించారు. గర్భిణీ స్త్రీల పర్యవేక్షణ పిల్లల ఆరోగ్య పరీక్షలు, వృద్ధులకు అవసరమైన వైద్య సేవలు సమగ్రంగా అందించేందుకు కార్యాచరణ రూపొందించారని తెలిపారు. బాలికల ఆరోగ్య పరిరక్షణలో భాగంగా హెచ్ పి వి టీకా కార్యక్రమము సమర్థవంతంగా అమలు చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమాల ద్వారా జిల్లాలో మహిళల ఆరోగ్యం మెరుగుపడేలా సమన్వయంతో పని చేయాలని సూచించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, సిబ్బంది సమన్వయంతో ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాలని సూచించారు. ఈ సమావేశంలో అదనపు జిల్లా కలెక్టర్ శ్రీ చంద్రా రెడ్డి గారు,జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ లలిత దేవి పాల్గొన్నారు.
******