- బాలికలతో స్నేహ కమిటీలు.
- స్వీయ రక్షణ టీంలుగా ఇవే బృందాలు.
- చెత్త కుప్పల్లో బిడ్డలను వేయకుండా చర్యలు.
- ఇక నుంచి వీలున్న చోట ఊయలలు ఏర్పాటు.
- బిడ్డను పారేయకుండా ఊయలలో వదిలేస్తే ప్రభుత్వ భాద్యత.
- మహిళా శిశు సంక్షేమ కోసం నిపుణులతో అడ్వయిజరీ కమిటీ.
- ప్రతి మూడు నెలలకోసారి మహిళా మేథోమథన సదస్సు.
- మంత్రి సీతక్క
ముద్ర, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో మహిళా శిశు సంక్షేమం కోసం నిపుణులతో కూడిన ఒక అడ్వైజరీ కమిటీ నియమిస్తామని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ప్రకటించారు.శాఖ ద్వారా ప్రస్తుతం అందుతున్న సేవలను ఆ కమిటీ సలహాలు సూచనలతో మరింత పటిష్టపరుస్తామని వెల్లడించారు. బాలికల రక్షణ కోసం బాలికలతో స్నేహ కమిటీలను ఏర్పాటు చేస్తామనన్నారు. అమ్మాయిలు ఆకాశాన్ని చీల్చుకొని అంతరిక్షానికి వెళ్లినా వారికి భూమి మీద రక్షణ కరువైందని మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే అమ్మాయిల స్వీయ రక్షణ కోసం బాలికా రక్షక టీంలను ఏర్పాటు చేస్తామన్నారు.అమ్మాయిలను వేధిస్తే సంఘ బహిష్కరణకు గురవుతారని హెచ్చరించారు.అమ్మాయిలను ముట్టుకుంటే కఠిన శిక్షలు తప్పవన్నారు. అమ్మాయిల పట్ల చెడుగా ప్రవర్తిస్తే ఇలాంటి శిక్షలు అనుభవించాల్సి వస్తుందో అబ్బాయిలకు అవగాహన కల్పించాలని మంత్రి సీతక్క వెల్లడించారు.హైదరాబాద్ లో రెండు రోజుల పాటు జరిగిన మేధో మధన సదస్సు గురువారం ముగిసింది. ఈ ముగింపు సభలో మంత్రి పాల్గొని ప్రసంగించారు.మేధో మధన సదస్సు విజయవంతం అయ్యిందన్న ఆమె మహిళా శిశు సంక్షేమం కోసం ఎన్నో కొత్త ఆలోచనలకు ఈ సదస్సు ప్రాణం పోసిందన్నారు.మూడు నెలలకోసారి ఇలాంటి సదస్సులు నిర్వహిస్తామని తెలిపారు.జిల్లాల్లో ఇలాంటి సదస్సులు నిర్వహించడం ద్వారా అనుకున్న లక్ష్యాలను చేరుకోవచ్చన్నారు. ఈ సదస్సులో మహిళా శిశు సంక్షేమంపై పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థలు, మేధావులు తమ విలువైన సలహాలు ఇచ్చారని చెప్పారు. ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న స్నేహ కమిటీలు స్వీయ రక్షణ టీంలుగా పనిచేస్తాయన్నారు.అంగన్వాడీ టీచర్ల ద్వారా అమ్మాయిలకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అవగాహన కల్పిస్తామన్నారు. మహిళ, బాలికల భద్రత మీద పనిచేసే స్వచ్చంద సంస్థలను గుర్తించి అంగన్వాడీలను వారితో అనుసంధానం చేస్తామని వివరించారు. త్వరలో మహిళల హక్కుల మీద పనిచేసే స్వచ్ఛంద సంస్థలతో సమావేశం నిర్వహించి మహిళ భద్రత కోసం పటిష్ట విధానాలను రూపొందిస్తామని మంత్రి తెలిపారు.చాలా చోట్ల ముళ్ల పొదల్లో, చెత్తకుప్పల్లో అప్పుడే పుట్టిన బిడ్డలను వదిలేసి వెళుతున్నారన్నారు. చీమలు, కుక్కలు, చెత్త, ముండ్ల మధ్య శిశువుల ప్రాణాలు పోతున్నాయన్నారు. దీన్ని నివారించేందుకు వీలున్న చోట ఊయలలను ఏర్పాటు చేస్తామన్నారు. బిడ్డలను పారేయకుండా ఆ ఊయలలో వదిలేస్తే వారి బాధ్యతను తామే స్వీకరిస్తామని అన్నారు. తెలంగాణ ఏర్పాటై పదేండ్లయినా ఇప్పటికీ బాల్య వివాహ నిరోధక చట్ట నిబంధనలను ఆకళింపు చేసుకోకపోవడం బాధాకరమన్నారు. త్వరలో రూల్స్‌ను అడాప్ట్ చేసుకుంటామని ప్రకటించారు. గ్రామ సభల్లో, ఇతర ప్రభుత్వ కార్యక్రమాల్లో బాల్య వివాహలతో జరిగే నష్టాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని మంత్రి సూచించారు.ఐసీడీఎస్ పథకాలకు తెలంగాణ ప్రాంతంలోనే బీజం పడిందన్నారు. 1972లో మహబూబ్‌నగర్‌లో ఫ్రీడమ్ ఫైటర్ దుర్గాబాయి దేశ్‌ముఖ్ ఐసీడీఎస్ ప్రారంభించారన్నారు.ఆ అనుభవాల ఆధారంగానే దేశవ్యాప్తంగా ఇందిరా గాంధీ ఐసీడీఎస్ స్కీంను విస్తరింపజేశారని తెలిపారు. అంగన్వాడీ సేవలకు ఆరాధ్యులుగా దుర్గాబాయి దేశ్‌ముఖ్, ఇందిరా గాంధీ నిలిచారని చెప్పుకొచ్చారు. వారి ఆదర్శంగా అంగన్వాడీ సేవలను ప్రతి ఇంటికి చేర్చాలన్నారు.ఈ ఏడాది వేయి అంగన్వాడీ కేంద్రాలకు సొంత భవనాలను నిర్మించి ఇస్తామని మంత్రి వెల్లడించారు. జిల్లా కలెక్టర్లతో సమన్వయం చేసి స్థలాలను గుర్తించాలని ఆదేశించారు. అంగన్వాడీ గదుల్లోనే దేశ భవిష్యత్తు ఉందని.. కాబట్టి దేశ భవిష్యత్తును లిఖించేది అంగన్వాడీ సిబ్బంది అని తెలిపారు.కరీంనగర్‌లో ప్రతి శుక్రవారం అంగన్వాడీ సిబ్బంది గ్రామస్తులతో సమావేశాలు నిర్వహిస్తున్నారన్నారు.దాన్ని అన్ని జిల్లాల్లో అమలు చేయాలని ఆదేశించారు. అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లల అడ్మిషన్లను , హాజరును పెంచాలని మంత్రి ఆదేశించారు.