- కాలుష్య రహిత తెలంగాణ కొరకు కృషి చేద్దాం.
- సమాజంలోని ప్రతి వ్యక్తి పర్యావరణాన్ని కాపాడుతానని ప్రతిన బూనాలి.
- గోల్కొండ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో మొక్కలు నాటిన మంత్రి.
- రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ, జిల్లా ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్.
ముద్ర, తెలంగాణ బ్యూరో : భవిష్యత్ తరాలకు మంచి పర్యావరణం అందించేందుకు మొక్కలు నాటి, వాటిని పెంచి కాపాడాలని హైదరాబాద్ జిల్లా ఇన్ ఛార్జీ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రజలకు పిలుపునిచ్చారు.ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో గోల్కొండ ఏరియా హాస్పిటల్ లో జహీరాబాద్ ఎంపీ సురేష్ షేట్కార్, కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మోహిద్దిన్, జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తో కలిసి మొక్కలు నాటారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు.చెట్లు నీడ ఇవ్వడంతో పాటు ఆక్సిజన్ అందిస్తాయని చెప్పారు.చెట్లను పెంచడం నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్ లో వచ్చే తరం ఆక్సిజన్ పెట్టుకునే స్థాయికి వస్తుందన్నారు.ఈ ప్రమాదాన్ని ముందే గ్రహించి ప్రతి ఒక్కరు మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు దోహదపడాలన్నారు. కాలుష్యం పెరిగిపోయి ప్రజలు క్యాన్సర్, షుగర్ వ్యాధులను బారినపడి మందులపై ఆధారపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాలుష్యం పెరగకుండా హైదరాబాద్ మరో ఢిల్లీ కానీయకుండా, హైదరాబాద్ ప్రకృతి కి మారు పేరుగా ఉండాలంటే ఇక్కడ అందరం కలిసి చెట్లు నాటి కాలుష్య నివారణకు పాటు పడాలని అన్నారు. గోల్కొండ ఏరియా హాస్పిటల్ కి వచ్చే వారికి మొక్కలు నాటే అవగాహన కల్పించాలని అన్నారు.తెలంగాణ మాది అనుకునే ప్రతి వ్యక్తి పర్యావరణాన్ని కాపాడడానికి ఒక శక్తిగా పర్యావరణాన్ని కాపాడడానికి మొక్కలు నానాటి ప్లాస్టిక్ ను మన దైనందిన జీవితం నుండి దూరం చేయాలని,మొక్కలు పెంచడం మన దిన చర్య గా భావించి జన్మదినం లకు ప్రత్యేక రోజులకు మొక్కలు నాటాలన్నారు. హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ చెట్టు నీడతోపాటు ప్రకృతి సహజమైన ఆక్సిజన్ ను అందిస్తుందని చెప్పారు. చెట్టు నీడ వెలకట్టలేనిదని చెట్లు ప్రగతికి మెట్లనీ ప్రతి ఒక్కరూ చెట్టును నాటి సమాజంలో మార్పు తీసుకురావాలన్నారు. శుభ కార్యక్రమాల్లో కేకులను కట్ చేసి హంగామా సృష్టించే బదులు మొక్కలు నాటాలని కోరారు. కాలుష్య నివారణకు ప్రతి ఒక్కరూ సింగిల్ యూస్ ప్లాస్టిక్ ను వాడే బదులు జూట్ బ్యాగులను వాడాలన్నారు. కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మహియుద్దీన్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటాలని అన్నారు. గోల్కొండ ఆసుపత్రిలో ప్రతిరోజు 1200 నుండి 1500 మంది అవుట్ పేషెంట్లు వస్తున్నారని తెలిపారు. ఆస్పత్రిలో కొత్త భవనం నిర్మించేందుకు రూ. 6 కోట్లు, యంత్రాల కొనుగోలు కోసం రూ. 1.80 కోట్లు మంజూరైనట్లు తెలిపారు ఆస్పత్రిలో డాక్టర్లు, నర్సులు అదనంగా అవసరం ఉందన్నారు.ఈ కార్యక్రమంలో జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ షెట్కర్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఈఈ పి. సురేష్, డి సి హెచ్ ఎస్ సూర్య కుమారి, ఏరియా ఆసుపత్రి పర్యవేక్షకులు శ్రీనివాసరావు, కార్పొరేటర్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు, గోల్కోడ ఏరియా హాస్పిటల్ వైద్యాధికారులు పాల్గొన్నారు