ముద్ర : మల్కాజిగిరి
మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలోని ఉప్పల్ పోలీసులు చురుకుగా స్పందించి ఏ ఆర్ కానిస్టేబుల్ హత్య కేసులో ప్రమేయం ఉన్న ఇద్దరు నిందితులను కేవలం 6 గంటల్లోనే అరెస్టు చేశారు. ఉప్పల్ డిసిపి సురేష్ కుమార్, అడిషనల్ డీసీపీ వెంకటరమణ తెలిపిన వివరాల ప్రకారం చెంగిచెర్ల ఆర్టీసీ కాలనీ నివాసి ఏఆర్ కానిస్టేబుల్ సుధీర్ కుమార్( 39) అతని స్నేహితులు మధ్య ఆదివారం రాత్రి మాట మాట పెరిగి ఘర్షణకు దారితీసింది ,దీంతో సంతోష్ , తరుణ్
విచక్షణారహితంగా సుధీర్ కడుపులో కత్తులతో దాడి చేసి దారుణ హత్యకు పాల్పడ్డారు.
మేడిపల్లి నివాసి కానుపూర్ శ్రీకాంత్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు, మార్చి 15 రాత్రి సుమారు 8:37 గంటల సమయంలో పృథ్వీరాజ్ అనే వ్యక్తి ఫోన్ చేసి, చిలకానగర్ ప్రాంతంలో తన బావ పరువుల సుధీర్ కుమార్ బానోతు సంతోష్ మధ్య గొడవ జరుగుతోందని తెలిపాడు. సమాచారం అందుకున్న శ్రీకాంత్ సంఘటనా స్థలానికి చేరుకోగా, సుధీర్ కుమార్ రక్తపు మడుగులో పడి మృతదేహంగా కనిపించాడు.
పోలీసుల దర్యాప్తులో, మృతుడు సుధీర్ కుమార్ మరియు నిందితుడు సంతోష్ మధ్య గతంలోనే వివాదాలు ఉన్నట్లు బయటపడింది. మార్చి 15 సాయంత్రం 7:30 గంటల సమయంలో నిందితుడు సంతోష్ తన స్నేహితుడు పొడిశెట్టి తరుణ్‌తో కలిసి సుధీర్‌ను చిలకానగర్ మైదానానికి రమ్మని పిలిచాడు. సుధీర్ తన స్నేహితుడు ఇమ్రాన్ ఖాన్‌తో కలిసి మోటార్‌సైకిల్‌పై అక్కడికి వెళ్లాడు.
అక్కడ ఇద్దరి మధ్య మాటల తగాదా చోటుచేసుకుంది. ఆగ్రహానికి గురైన సంతోష్ కత్తి తీసి సుధీర్‌ను పొడిచాడు. అక్కడి నుండి తప్పించుకోవడానికి ప్రయత్నించిన సుధీర్‌ను సంతోష్, తరుణ్ ఇద్దరూ వెంబడించి పలుమార్లు కత్తితో దాడి చేయడంతో సుధీర్ సంఘటనా స్థలంలోనే మరణించాడు. అనంతరం నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. నిందితులు బోనోతు సంతోష్ ,పోడిశెట్టి తరుణ్ లను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. వీరి నుంచి హత్యకు ఉపయోగించిన ఒక కత్తిని ,రెండు ఫోన్లను, ఒక మోటార్ సైకిల్ ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు ఉప్పల్ సీఐ రామలింగారెడ్డి తెలిపారు తెలిపారు.