ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్:
జిల్లాలో వంట గ్యాస్ సరఫరాలో ఎలాంటి కొరత లేదని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. గురువారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో గ్యాస్ సరఫరా, వినియోగంపై అధికారులతో కలిసి సమగ్రంగా చర్చించారు.
ఈ సమావేశానికి జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్, అదనపు కలెక్టర్ అమరేందర్, అదనపు ఎస్పీ వెంకటేశ్వర్లు, సివిల్ సప్లై అధికారి నరసింహారావు, మున్సిపల్ కమిషనర్లు తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో వంట గ్యాస్ సరఫరా వ్యవస్థను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల అక్రమ వినియోగాన్ని అరికట్టేందుకు పోలీస్ శాఖతో సమన్వయం పెంచాలని సూచించారు.
జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తూ, అక్రమంగా వినియోగించే సిలిండర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. అవసరమైన సందర్భాల్లో కేసులు నమోదు చేసి, సిలిండర్లను జప్తు చేయాలని ఆదేశించారు.
గృహ వినియోగానికి కేటాయించిన గ్యాస్ సిలిండర్లను వ్యాపార అవసరాలకు ఉపయోగిస్తే డీలర్లపై లైసెన్స్ రద్దు చేసి కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
జిల్లాలో గ్యాస్ సరఫరాకు ఎటువంటి లోటు లేదని, తగిన నిల్వలు అందుబాటులో ఉన్నాయని కలెక్టర్ తెలిపారు. వినియోగదారులు గ్యాస్ బుకింగ్ చేసిన తర్వాత, సంబంధిత ఏజెన్సీలు సిలిండర్లను నేరుగా ఇళ్లకు సరఫరా చేస్తాయని చెప్పారు. గ్యాస్ ఏజెన్సీలు లేదా గోదాముల వద్దకు వెళ్లి వేచి ఉండవద్దని ప్రజలకు సూచించారు. షెడ్యూల్ ప్రకారం ప్రతి వినియోగదారునికి ఇంటి వద్దకే సిలిండర్ అందజేస్తామని హామీ ఇచ్చారు.
జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్ మాట్లాడుతూ, గ్యాస్ సిలిండర్ల అక్రమ వినియోగాన్ని అరికట్టేందుకు పోలీస్ శాఖ పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు. జిల్లాలో ఎక్కడైనా ఇలాంటి అక్రమాలు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. వచ్చిన ఫిర్యాదులపై తక్షణమే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.