ముద్ర/వీవనగండ్ల: వృద్ధ కళాకారులకు నెల నెల పెన్షన్ అందకపోవటంతో ఉగాది పండుగ పర్వదినానికి కూడా పస్తులు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుందేమోనని వీపనగండ్ల గ్రామానికి చెందిన వృద్ధ కళాకారుడు మంగలి నారాయణ ఆవేదన వ్యక్తం చేశారు.గత నాలుగు నెలల నుండి కళాకారులకు పెన్షన్ డబ్బులు రాకపోవడంతో ఇబ్బందులు పడాల్సి వస్తుందని, పెన్షన్ డబ్బుల కోసం అధికారుల చుట్టూ తిరిగిన తమకు తెలియదు అంటూ సమాధానం ఇస్తున్నారని వాపోయాడు. వృద్ధాప్యం తోడు కావడంతో ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నాయని, నెల నెల పెన్షన్ డబ్బులు రాకపోవడం వల్ల మందులు కొనటానికి డబ్బులు కూడా లేవని,పాలకులు,ప్రభుత్వ అధికారులు వృద్ధ కళాకారులపై దయతలచి ఇప్పటికైనా పెన్షన్ డబ్బులు మంజూరు చేయాలని వృద్ధ కళాకారుడు మంగలి నారాయణ కోరారు.