ఎంతో ప్రాచీనమైన ఆయుర్వేద వైద్యానికి మళ్లీ పునర్ వైభవం వస్తున్నదని కోటక్కల్ ఆర్యవైద్యశాల మేనేజింగ్ ట్రస్టీ వైద్యరత్నం పిఎస్ వారియర్ ముని మనవడు డాక్టర్ పి మాధవన్ కుట్టి వారియర్ అన్నారు. నగరం లో కోటక్కల్ ఆర్య వైద్యశాల ప్రారంభించనున్న నేపథ్యం లో సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో ఆయన మాట్లాడారు. ఆయుర్వేదం పేరుతో సమాజంలో ఎంతోమంది రకరకాల ప్రాక్టీసులు చేస్తున్నారని కానీ ఆయుర్వేదానికి కోటక్కల్ ఆర్యవైద్యశాలకు 120 సంవత్సరాల చరిత్ర ఉందని ఆయన అన్నారు. నేటి యువతకు అనేక సమస్యలకు ఆయుర్వేదం ద్వారా పరిష్కారాలు అందించేందుకు బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2 లో త్రినయ పేరుతో ఆర్య వైద్యశాల ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. సంప్రదాయ పద్ధతిలో అర్బన్ ప్రాంతాలలో నివసిస్తున్న వారికి కూడా కొటక్కల్ ఆర్యవైద్యశాల సేవలు అందించే దిశగా మరిన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఉగాది పర్వదినం సందర్భంగా రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ చేతుల మీదుగా ఈ ఆస్పత్రిని ప్రారంభిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా మాధవన్ మాట్లాడుతూ వైద్యం పుట్టింది ఆయుర్వేదం నుంచి అని అలాంటిది సమాజంలో జరిగిన ఎన్నో మార్పుల వల్ల చాలామందికి ఆయుర్వేదం దూరమైందని కానీ మారుతున్న పరిస్థితుల వల్ల మళ్లీ ఆయుర్వేదం వైపు అందరూ చూస్తున్నారని దీనికి ఆయుర్వేదం వల్ల వస్తున్న మంచి ఫలితాలే కారణమని ఆయన అన్నారు. దేశం లో ప్రతి ఏటా 70 లక్షల మంది ఆయుర్వేద వైద్యం పొందుతున్నారని అన్నారు. ఈ సమావేశం లో కోటక్కల్ ఆర్య వైద్యశాల సీఈవో హరి కుమార్, జోగేష్, రాజేంద్రన్ తదితరులు పాల్గొన్నారు.