అధికార పార్టీ నేతలూ ముందుకు రావాలి
మూసీ పునరుజ్జీవంపై మంత్రుల కంటే అధికారులే ఉత్సాహం చూపుతున్నారు
ముద్ర, తెలంగాణ బ్యూరో :
ప్రజాప్రతినిధులందరూ డ్రగ్స్ టెస్ట్ లకు ముందుకురావాలంటూ శాసనసభ వేదికగా అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ చేసిన వ్యాఖ్యలకు తాను కట్టుబడి ఉన్నానని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ స్పష్టం చేశారు. డ్రగ్ టెస్టులకు తాను సిద్ధమని చెప్పానన్నారు. కానీ తర్వాత ఈ విషయంపై అధికార పార్టీ నేతలెవరూ ఏమీ మాట్లాడడం లేదన్నారు. బుధవారం హైదరాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. మూసీ డీపీఆర్ విషయంలో మొత్తం ప్లేట్ మార్చారన్నారు. మంత్రుల కంటే అధికారులు ఎక్కువ మాట్లాడుతున్నారని ఆరోపించారు. ఆరునూరైనా మూసీ ప్రాజెక్టు చేపడతామని అధికారి ఎలా చెబుతారు? అని ప్రశ్నించారు. మూసీ డీపీఆర్ ఉంటే సభలో ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. ఆ డీపీఆర్ ప్రవేశపెట్టకపోతే శ్రీధర్ బాబుపై సభా హక్కుల ఉల్లంఘన కింద ఫిర్యాదు చేస్తామన్నారు. ప్రభుత్వం నడుపుతున్న పెద్దలు మూర్ఖంగా వ్యవహరిస్తున్నారన్న కేటీఆర్.. ప్రణాళిక, డబ్బు లేకుండానే ఇండ్లు కూల్చేస్తున్నారని విమర్శించారు. రూ.57 వేల కోట్ల వడ్డీలేని రుణాలు ఇచ్చినట్లు భట్టి విక్రమార్క చేసిన వ్యాఖ్యలను గుర్తు చేశారు. వడ్డీలేని రుణాలు ఇచ్చినట్లు ఉత్తర్వు చూపిస్తే తాను రాజీనామా చేస్తానని చెప్పానని కేటీఆర్ అన్నారు. అందుకు నేను రాజీనామా చేయాలని సీతక్క అంటున్నారన్న ఆయన ఆమె మాటల్లో అర్థం లేదన్నారు. సభను తప్పుదోవ పట్టించిన భట్టి రాజీనామా చేయాలా లేక నేను చేయాలా అని ప్రశ్నించారు. ఉత్తర్వులు చూపిస్తే రాజీనామాకు సిద్ధమన్న మాటకు కట్టుబడి ఉన్నానన్నారు. మూసీ, హ్యామ్ రోడ్లలో అవినీతిపై మా ప్రభుత్వం వచ్చాక విచారణ చేపడతామన్నారు. పార్టీ మారి.. ఆ పార్టీ తరఫున పోటీ చేసినా పట్టించుకోవడం లేదన్నారు. నిషేధిత భూములపై మంత్రి పొంగులేటి ఎందుకు నోరు మెదపట్లేదని నిలదీశారు. కోటి ఎకరాలు నిషేధిత భూముల జాబితాలో ఉన్నాయని వివరించారు. అలాగే మాజీ మంత్రి జీవన్ రెడ్డికి కాంగ్రెస్‍లో అసంతృప్తి ఉన్నట్లుందని కేటీఆర్ చెప్పారు. ఆయన విషయంలో తాము జీవన్ రెడ్డితో ఎలాంటి చర్చలు చేయలేదన్నారు