Take a fresh look at your lifestyle.

నేటి నుంచి ఎస్సెస్సీ మూల్యాంకనం మూడు విడతల్లో వాల్యుయేషన్23న పూర్తి

 

ముద్ర ప్రతినిధి, నిర్మల్:

పదో తరగతి పరీక్షలు ఏప్రిల్ రెండో వారంలో ముగియనున్న నేపథ్యంలో అధికారులు మూల్యాంకనానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. స్థానిక సెయింట్ థామస్ ఉన్నత పాఠశాలలో ఈ మూల్యాంకనం ఏప్రిల్ 1న ప్రారంభం కానున్నది. జిల్లా విద్యాధికారి దర్శనం భోజన్న క్యాంప్ ఆఫీసర్ గా వ్యవహరించనున్నారు. అసిస్టెంట్ క్యాంప్ ఆఫీసర్ గా ఏసీజిఐ ముడారపు పరమేశ్వర్ వ్యవహరిస్తారు. సమాధాన పత్రాల కోడింగ్ కోసం 40 మంది శిక్షణార్థ విద్యార్థులను నియమించారు. అలాగే 66 మంది సీనియర్లను చీఫ్ ఎగ్జామినర్లుగా, స్కూల్ అసిస్టెంట్ స్థాయి సిబ్బంది 374 మందికి సహాయ ఎగ్జామినర్లుగా నియమించారు. ఇక మార్కుల తుది పరిశీలన కోసం 132 మంది ఎస్జీటీ లను ప్రత్యేక సహాయకులుగా నియమించారు. వీరంతా ఏప్రిల్ 1 ఉదయం విధుల్లో చేరాలని అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సారి ప్రతి పరీక్షకు మధ్య 2 నుంచి 3 రోజుల వ్యవధి ఉన్న నేపథ్యంలో గతానికి భిన్నంగా ఈ సారి మూడు విడతలుగా మూల్యాంకనం నిర్వహించనున్నారు. ఏప్రిల్ 1 నుంచి 9 వరకు తెలుగు, హిందీ, ఆంగ్లం, గణితం మూల్యాంకనం నిర్వహిస్తున్నారు. అలాగే భౌతిక రసాయన శాస్త్రం, జీవశాస్త్రం మూల్యాంకనం ఏప్రిల్ 10న ప్రారంభమై 17న ముగియనుంది. ఇక చివరగా సాంఘిక శాస్త్ర మూల్యాంకనం 17 నుంచి 23 వరకు జరగనుంది. ఆయా జిల్లాల నుంచి మూల్యాంకనానికి కేటాయించిన సమాధాన పత్రాలు చూస్తే తెలుగు 12,213 పత్రాలు, హిందీ అత్యల్పంగా 8,071, ఆంగ్లం 25,184, గణితం 26,967, భౌతిక రసాయన శాస్త్రం 25,910, జీవశాస్త్రం 12,085, సాంఘిక శాస్త్రం 25,856 పత్రాలు జిల్లాకు కేటాయించారు.


విధులకు హాజరు కాకుంటే శాఖాపరమైన చర్యలు: డీఈఓ భోజన్న
విధులు కేటాయించిన సిబ్బంది తప్పని సరిగా సకాలంలో విధులకు హాజరు కావాలని జిల్లా విద్యాశాఖాధికారి దర్శనం భోజన్న సూచించారు. విధులకు హాజరుకాని సిబ్బందిపై శాఖాపరమైన చర్యలుంటాయని ఆయన పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.