రెండు నెలల్లో రెండోసారి
ప్రారంభించని మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు
పరిహారం పైనే ఆశలు
ముద్ర ప్రతినిధి,నిర్మల్:
నిర్మల్ జిల్లా రైతాంగాన్ని అకాల వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. గత నెల్లోనే అకాల వర్షాలు కురిసిన ఫలితంగా వేలాది ఎకరాల్లో పంటలు దెబ్బ తిన్నాయి.గత నెలలో రెండు రోజుల పాటు కురిసిన వడగళ్ళు, వర్షాలతో రైతుల ఆశలు అడియాశలయ్యాయి. ఇక సోమవారం రాత్రి, మంగళవారం తెల్లవారు జామున జిల్లాలోని అధిక మండలాల్లో కురిసిన వడగళ్ళు, వర్షాలతో మరోసారి ప్రకృతి కన్నెర్ర చేసింది. అర్ధరాత్రి వేళ ఒకేసారి బలంగా వీచిన ఈదురు గాలులు, వడగళ్ళు, వర్షాలతో రైతాంగం కుదేలైంది. ప్రధానంగా ఇప్పటికే మొక్కజొన్న పంట కోసి ఆరబెడుతున్న సమయంలో ఈ వర్షాలు ఆరబోసిన మొక్కజొన్నలను పూర్తిగా తడిపేయటంతో పాటు నీటిలో కొట్టుకుపోయాయి. ఇక కొన్ని చోట్ల ఆలస్యంగా మొక్కజొన్న పంట వేసిన నేపథ్యంలో మొక్కలు పూర్తిగా నేలకు అంటాయి. ఇక వరి పంటలో గతంలో అనుసరించే నాట్ల విధానం కాకుండా వెదజల్లే విధానం అనుసరించిన రైతులకు భారీగా నష్టం వాటిల్లింది. నాట్ల విధానంలో వేర్లు లోపలికి వెళ్ళటం మూలంగా పంట నష్టం తక్కువ ఉంటుంది. ఐతే వెదజల్లే విధానంలో వేర్లు పై భాగాన ఉండటం మూలంగా పంట త్వరగా దెబ్బ తిన్నది. లక్ష్మణ చాంద వంటి కొన్ని మండలాల్లో లాభసాటి పంటగా నువ్వు సాగు చేస్తున్నారు. అకాల వర్షాల మూలంగా వందలాది ఎకరాల్లో నువ్వు పంట దెబ్బ తిన్నది. ఈ పరిస్థితుల్లో పెట్టుబడి సైతం కోల్పోవాల్సిన దుస్థితి నెలకొంది.

మొక్కజొన్న కొనుగోళ్లలో జాప్యంతో నష్టం
ఇదిలా ఉంటే మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో ప్రభుత్వ జాప్యం కూడా రైతులకు శాపంగా మారింది. ప్రభుత్వ మద్దతు ధర రూ.2400 మేరకు ఉంటే ప్రైవేటు వ్యాపారులు రూ.18 వందల నుంచి రూ.19 వందల వరకు చెల్లిస్తున్నారు. దీంతో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటయ్యాక అమ్మేందుకు మొక్కజొన్నలు ఎండబెట్టడం, అర్ధరాత్రి అకాల వర్షంలో కొట్టుకుపోవడం రైతులను ఆవేదనకు గురి చేస్తోంది.

ప్రభుత్వం ఆదుకోవాలి: రైతు ముత్యం రెడ్డి
వరుసగా రెండు నెలల్లో రెండు మార్లు పంట నష్టం చూడాల్సి వచ్చిందని లక్ష్మణ చాంద కు చెందిన రైతు సురకంటి ముత్యం రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. గత నెల కురిసిన అకాల వర్షాల నష్టం సర్వే పూర్తయినా రైతులకు పరిహారం విషయంలో ఇంతవరకు ఎలాంటి ప్రకటన రాలేదన్నారు. ఇపుడు సర్వే పూర్తై ప్రకటన ఎపుడు వస్తుందో తెలియని పరిస్థితి ఉందన్నారు. ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన సర్వే చేసి, పరిహారంపై స్పష్టమైన ప్రకటన చేయాలని ఆయన కోరారు. అలాగే మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలని కోరారు.