Take a fresh look at your lifestyle.

రోడ్లు ఉంటేనే పెట్టుబడులు.. పరిశ్రమలు

రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి నిర్మాణ రంగం కీలకం
మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ధికి సర్కార్ ప్రాధాన్యత
బిల్డర్స్ నేషనల్ మేనేజింగ్ కమిటీ, జనరల్ కౌన్సిల్ సమావేశంలో మంత్రి కోమటిరెడ్డి

ముద్ర, తెలంగాణ బ్యూరో :

రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పఫ్టం చేశారు. రోడ్లు, భవనాల నిర్మాణంలో నాణ్యతకు అత్యున్నత ప్రాధాన్యం కల్పిస్తూ వేగవంతమైన అభివృద్ధి లక్ష్యంగా విజన్ 2047 లక్ష్యంతో ముందుకు సాగుతోందన్నారు. నిర్మాణ రంగం రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి కీలకమని, ప్రభుత్వంతో కలిసి పనిచేస్తూ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని బిల్డర్లకు పిలుపునిచ్చారు. శనివారం హైదరాబాద్ లో బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించిన నేషనల్ మేనేజింగ్ కమిటీ, జనరల్ కౌన్సిల్ సమావేశంలో మంత్రి మాట్లాడారు. అభివృద్ధికి ప్రధాన పునాది మౌలిక వసతులేనన్న మంత్రి రోడ్లు బలంగా ఉంటేనే పెట్టుబడులు వస్తాయని చెప్పారు. కనెక్టివిటీ బాగుంటేనే పరిశ్రమలు క్యూ కడతాయన్నారు. అందుకే తాము రోడ్లు, భవనాల రంగంలో భారీగా పనులు చేపట్టామని చెప్పారు. ప్రస్తుతం దాదాపు ఒక లక్ష కోట్ల రూపాయల విలువైన పనులు రాష్ట్రంలో కొనసాగుతున్నాయని చెప్పారు. హైబ్రిడ్ అన్యుటీ మోడల్(హ్యామ్)ప్రాజెక్టులు, రీజినల్ రింగ్ రోడ్, నేషనల్ హైవేల విస్తరణ, స్టేట్ హైవేలు, ఫ్లైఓవర్లు, రైల్వే ఓవర్ బ్రిడ్జిలు – పనులు ప్రతి ప్రాంతంలో వేగంగా జరుగుతున్నాయన్నారు. రీజినల్ రింగ్ రోడ్ తెలంగాణ భవిష్యత్తును మార్చే ప్రాజెక్ట్ అని అన్న మంత్రి.. ఇది హైదరాబాద్ చుట్టూ ట్రాఫిక్ భారాన్ని తగ్గించడంతో పాటు పరిసర జిల్లాల్లో కొత్త అభివృద్ధి మార్గాలను తెరుస్తుందన్నారు. ఇది ఆర్థిక కారిడార్లకు దారి తీస్తుందని మంత్రి వెంకట్ రెడ్డి అభిప్రాయపడ్డారు. అయితే ప్రభుత్వాలు ప్రణాళికలు చేస్తాయన్న మంత్రి.. బడ్జెట్ లో భారీ నిధులు కూడా కేటాయిస్తాయన్నారు. ప్రాజెక్టులూప్రకటిస్తాయని చెప్పారు. కానీ ఆ ప్రణాళికలకు ప్రాణం పోసేది మాత్రం మీరేనని బిల్డర్లను ఉద్దేశించి చెప్పారు. మీరు వేసే రోడ్లు ప్రజల ప్రయాణాన్ని సులభం చేస్తాయన్నారు. మీరు నిర్మించే వంతెనలు దూరాలను తగ్గిస్తాయనీ కట్టే భవనాలు సేవలకు నిలయాలు అవుతాయన్నారు. అందుకే నిర్మాణ రంగం అంటే తనకు కేవలం కాంట్రాక్ట్ కాదనీ అది రాష్ట్ర నిర్మాణం అని అభివర్ణించారు.

Leave A Reply

Your email address will not be published.