తెలుగులో ప్రమాణం చేసిన గవర్నర్
హాజరైన సీఎం, మంత్రులు, ప్రముఖులు
ముద్ర, తెలంగాణ బ్యూరో :
శివప్రతాప్ శుక్లా తెలంగాణ నూతన గవర్నర్‌గా ప్రమాణ స్వీకారం చేశారు. బుధవారం లోక్ భవన్ లో జరిగిన ఈ కార్యక్రమంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అపరేష్ కుమార్ సింగ్ శివప్రతాప్ శుక్లాతో ప్రమాణం చేయించారు.

ఈ సందర్భంగా శివప్రతాప్.. తెలంగాణ గవర్నర్ గా తన బాధ్యతలను శ్రద్ధతో నిర్వహిస్తానని తెలుగులో ప్రమాణం చేశారు. ప్రమాణ స్వీకారం అనంతరం సీఎం రేవంత్ రెడ్డి ఆయనకు పుష్పగుచ్ఛం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఎంతో పాటు స్పీకర్, మండలి ఛైర్మన్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, సీఎస్ రామకృష్ణారావు టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్, వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు. ప్రమాణ స్వీకారానికి ముందు వందేమాతం, జనగణమన ఆలపించారు. 73 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ నేపథ్యం కలిగిన శివ్ ప్రతాప్ శుక్లా ఉత్తరప్రదేశ్ వాస్తవ్యుడు. ఏబీవీపీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు.

ఎమర్జెన్సీ సమయంలో జైలుకెళ్లారు. యూపీలో నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, కేబినెట్ మంత్రిగా, కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. 2023-2026 మధ్య హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. తాజాగా తెలంగాణకు విచ్చేశారు.ఇప్పటి వరకూ రాష్ట్రానికి గవర్నర్ గా ఉన్న జిష్ణుదేవ్ వర్మ ఉండగా.. ఆయన మహారాష్ట్ర గవర్నర్ గా బదిలీపై వెళ్లారు.